మునసబు నుంచి రాష్ట్రపతి దాకా...

ABN , First Publish Date - 2022-05-18T09:23:53+05:30 IST

మునసబు నుంచి రాష్ట్రపతి స్థాయి దాకా రాజకీయ ప్రస్థానం సాగించిన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు 1913మే 19న అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నప్పరెడ్డి, చిన్న సుబ్బమ్మ దంపతులకు జన్మించారు...

మునసబు నుంచి రాష్ట్రపతి దాకా...

మునసబు నుంచి రాష్ట్రపతి స్థాయి దాకా రాజకీయ ప్రస్థానం సాగించిన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు 1913మే 19న అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నప్పరెడ్డి, చిన్న సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. మద్రాస్ అడయార్ థియొసోఫికల్ స్కూలులోనూ, అనంతపురం ఆర్ట్స్ కాలేజీలోనూ విద్యను అభ్యసించారు. ఆయన అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో చదువరిగా ఉన్నప్పుడే దేశంలో శాసనోల్లంఘన ఉద్యమం మొదలయ్యింది. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి సంజీవరెడ్డి ఉద్యమంలోకి ప్రవేశించారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలోనే సంజీవరెడ్డి తండ్రి మరణించారు. దాంతో కుటుంబ బాధ్యత సంజీవరెడ్డి భుజాలపై పడింది. కుటుంబ వ్యవసాయాన్ని, ఇల్లూరు గ్రామ మునుసబు బాధ్యతలను సంజీవరెడ్డి స్వీకరించారు. సంజీవరెడ్డిని మేనమామ తరిమెల సుబ్బారెడ్డి రాజకీయంగా ప్రోత్సహించారు. 1940లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలోనూ, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.


యువ కాంగ్రెస్ నాయకుడిగా అప్పటి పట్టాభి, ప్రకాశం వర్గాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ రాజకీయంగా ఎదిగారు సంజీవరెడ్డి. ప్రత్యేకంగా ఒక రాజకీయ సిద్ధాంతానికి లోబడకుండా, విలువలకు తిలోదకాలీయకుండా, వ్యక్తి క్షేమం కంటే జాతి క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అధికార రాజకీయాలు నడిపారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకరుగా, రాష్ట్రపతిగా భారతదేశానికి విశేష సేవలందించారు. ముఖ్యమంత్రిగా వీరి హయాంలోనే నాగార్జునసాగర్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వంటివి పురుడు పోసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు శాసన మండలి కూడా వీరి హయాంలోనే ఏర్పడింది. మారుమూల ప్రాంతాలలో కూడా ప్రజాస్వామ్య జ్యోతి ప్రకాశించాలనే ఉద్దేశంతో పంచాయతీలు, సమితులు, పరిషత్తులు అనబడే మూడు అంచెల ప్రభుత్వ వ్యవస్థను సంజీవరెడ్డి ప్రభుత్వం ఏర్పరచింది. దామోదరం సంజీవయ్య వర్గంతో నడిచిన గ్రూపు రాజకీయాల వల్ల తలెత్తిన కర్నూలు బస్సురూట్ల జాతీయకరణ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పు మూలంగా సంజీవరెడ్డి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చారు. స్వతహాగా వ్యవసాయాన్ని ఎంతగానో ఇష్టపడే ఆయన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడి సాధించేందుకు కృషి చేయాలని, అప్పుడు యావత్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాగలదని ఆకాంక్షించారు.


ముఖ్యమంత్రి పదవి వదులుకున్న అనంతరం సంజీవరెడ్డి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఉక్కు గనుల శాఖను; ఇందిరాగాంధీ మంత్రివర్గంలో రవాణా, విమాన సర్వీసులు, నౌకా వాణిజ్య శాఖను నిర్వర్తించారు. 1967 ఎన్నికల్లో హిందూపురం నుంచి లోక్‍సభకు ఎన్నికైన సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకర్ పదవికి ప్రతిపక్షాల అభ్యర్థి శ్రీ తెన్నేటి విశ్వనాథంపై పోటీ చేసి గెలుపొందారు. స్పీకరుగా ఎన్నికైన వెంటనే సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. స్పీకర్ పదవి చేపట్టిన వెంటనే ఇందిరాగాంధీ ప్రభుత్వంపై అప్పటి జనసంఘ్ నాయకుడు అటల్ బిహారీ వాజపేయి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించారు. సంజీవరెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టం 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇందిరాగాంధీ వ్యతిరేకించి శ్రీ వి.వి.గిరికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు సహకరించారు. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ సంస్థా కాంగ్రెస్, రిక్విజిషనిస్టు కాంగ్రెస్‌గా విడిపోయింది. తదనంతరం 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సంస్థా కాంగ్రెస్ తరఫున అనంతపురం నుంచి పోటీ చేసిన సంజీవరెడ్డి రిక్విజిషనిస్టు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నపాటి ఆంటోనీ రెడ్డి చేతిలో ఓడిపోయారు. పొన్నపాటి ఆంటోనీరెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది సంజీవరెడ్డి గారే. 1971 మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తరువాత సంజీవరెడ్డి సంస్థా కాంగ్రెస్ నుంచి, రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమణ తీసుకుని ఇల్లూరు వచ్చేశారు. అక్కడ తన పూర్తి సమయాన్ని తన మనసుకు దగ్గరైన కులవృత్తి వ్యవసాయానికి కేటాయించారు.


అత్యవసర పరిస్థితి సడలింపు, జనతా పార్టీ ఆవిర్భావం తరువాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హైదరాబాదులో నిర్వహించిన ఓ సభకు సంజీవరెడ్డి హాజరయ్యారు. జయప్రకాష్ నారాయణ్ ఆహ్వానం మేరకు వేదికపైకి వచ్చిన సంజీవరెడ్డి, ఆ సభలో చేసిన ప్రసంగం ద్వారానే రాజకీయ ప్రవాసం నుంచి బయటకు వచ్చారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సంజీవరెడ్డి నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఏకైక జనతా అభ్యర్థి సంజీవరెడ్డి గారే. తరువాత ఆయన రెండవసారి లోక్‌సభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకరుగా ఎన్నికైన నాలుగు నెలల లోపుగానే జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా సంజీవరెడ్డి పేరును ప్రకటించింది. అన్ని ప్రధాన పార్టీలు బలపరచడంతో సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై జులై 26, 1977న ప్రమాణ స్వీకారం చేశారు. 1979లో జనతా ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు మళ్ళీ సుస్థిర ప్రభుత్వం ఏర్పడేదాకా సంజీవరెడ్డి ఎంతో నేర్పుతో నెట్టుకొచ్చారు. ది న్యూయార్క్ టైమ్స్ జులై 20, 1979న "India’s Guardian During Political Crisis" శీర్షికన సంజీవరెడ్డి గారి గురించి కథనాన్ని ప్రచురించింది. అత్యంత క్రియాశీల రాష్ట్రపతిగా వ్యవహరించిన సంజీవరెడ్డి 1982 జులై 25న పదవీ విరమణ చేసి స్వగ్రామం ఇల్లూరు వెళ్ళి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం తాను మట్టి నుండి వచ్చానని, తిరిగి మట్టిలో కలిసిపోవడానికి వెళ్తున్నానని, అనంతపురం వాసిగా తన శేషజీవితాన్ని సాధారణ పౌరునిగా గడుపుతానని చెప్పి వీడ్కోలు పలికారు. సంజీవరెడ్డి 1989లో రాష్ట్రపతిగా తన అనుభవాలను "Without Fear or Favour: Reminiscences and Reflections of a President" అనే ఆంగ్ల గ్రంథంలో అక్షరీకరించారు. సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితం గడిపిన సంజీవరెడ్డి గారు జూన్ 1, 1996న బెంగళూరులో తుది శ్వాస విడిచారు.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2022-05-18T09:23:53+05:30 IST