కొత్త రూల్స్.. జులై 1 నుంచి నిషేధిత plastic వాడితే జరిమానా..

ABN , First Publish Date - 2022-06-29T17:37:38+05:30 IST

విచ్చలవిడిగా ప్లాస్టిక్‌‌ని తెగ వాడేస్తున్నారా?.. అయితే మీకో హెచ్చరిక. నిషేధిత జాబితాలో పేర్కొన్న ఎస్‌యూపీ(సింగిల్-యూస్ ప్లాస్టిక్) వాడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త రూల్స్.. జులై 1 నుంచి నిషేధిత plastic వాడితే జరిమానా..

న్యూఢిల్లీ : విచ్చలవిడిగా ప్లాస్టిక్‌‌ని తెగ వాడేస్తున్నారా?.. అయితే మీకో హెచ్చరిక. నిషేధిత జాబితాలో పేర్కొన్న ఎస్‌యూపీ(single use plastic) వాడితే జరిమానా(Fine) చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ నిబంధన జులై 1 నుంచి ఆచరణలోకి రానుంది. సంబంధిత స్థానిక సంస్థల నిర్ణయం ఆధారంగా పెనాల్టీ(Penalty) తీవ్రత ఆధారపడి ఉంటుంది. జరిమానా లేదా జైలుశిక్ష విధింపునకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. గాలి, నీరు, నేల కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్(Plastic) మాత్రమే కాకుండా... డ్రైనేజీలో పేరుకుపోతున్న, పర్యావరణ వ్యవస్థకు నష్టం చేకూర్చుతున్న ప్లాస్టిక్‌ వాడకంపైనా జరిమానాలు విధించాలని సూచనలు చేసింది. దేశంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని దశలవారీగా నియంత్రణకుగానూ గతేడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కీలక ప్రకటన చేశారు. 2022 నాటికి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటెమ్స్‌ వాడకాన్ని నిషేధానికి ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగానే జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.


ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం నియంత్రణ చర్యలు సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయబోవన్నారు. అవగాహన కల్పిస్తూ, ప్రత్యమ్నాయ మార్గాలను సూచిస్తూ అందరి సహకారంతోనే నిషేధపు చర్యలు ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. పదేపదే నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్నవారికి ఈ జరిమానా పెరుగుతూ ఉంటుందని ఆయన తెలిపారు. తయారీ, ఎగుమతులు, నిల్వ, పంపిణీ, విక్రయాల కోసం వినియోగిస్తున్న 19 నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటెమ్స్‌కు ప్రత్యమ్నాయాలను సిద్ధం చేసుకునేందుకు ఇండస్ట్రీ, ప్రజలకు తగిన సమయం ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు. నిషేధిత ప్లాస్టిక్ వాడక పరిమాణం తక్కువగానే ఉంటున్నా.. వాటి వలన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వివరించారు.


నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్‌లు ఇవే...

నిషేధిత ఎస్‌యూపీ(సింగిల్-యూజ్ ప్లాస్టిక్) జాబితాలో ప్లాస్టిక్ స్టిక్స్ కలిగిన ఇయర్‌బర్డ్స్‌‌తోపాటు బెలూన్స్‌లో వినియోగించే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, క్యాండీ స్టిక్స్, ఐస్‌క్రీమ్ స్టిక్స్, డెకరేషన్‌లో వినియోగించే పాలీస్టెరీన్(థర్మోకోల్), ప్లాస్టిక్ ప్లేట్స్, కప్స్, గ్లాసులు, ప్లాస్టిక్ కత్తులు, ఫోర్క్స్, స్పూన్స్, స్ట్రా, ట్రేయ్స్‌ ఉన్నాయి. వీటితోపాటు స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డ్స్, సిగరెట్ ప్యాకెట్స్ ప్యాకింగ్‌కు వినియోగించే ప్యాకేజింగ్ ఫిల్మ్స్, ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు ఉన్నాయి.

Updated Date - 2022-06-29T17:37:38+05:30 IST