దురహంకారం నుంచి మోకరిల్లడం వరకూ... సాగు చట్టాల రద్దుపై టీఎంసీ ఘాటు స్పందన...

ABN , First Publish Date - 2021-11-19T19:41:10+05:30 IST

వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు

దురహంకారం నుంచి మోకరిల్లడం వరకూ... సాగు చట్టాల రద్దుపై టీఎంసీ ఘాటు స్పందన...

కోల్‌కతా : వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో రైతులను టీఎంసీ అభినందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఇది దురహంకారానికి నష్టమని పేర్కొన్నారు. ‘‘దురహంకారం నష్టపోయింది. విర్రవీగడం నుంచి మోకరిల్లడం వరకు’’ అని దుయ్యబట్టారు. 


ఈ సందర్భంగా ఒబ్రెయిన్ తాను 2020 సెప్టెంబరులో పోస్ట్ చేసిన వీడియోను రీట్వీట్ చేశారు. చర్చించకుండా ఈ సాగు చట్టాలను తీసుకొచ్చారని ఈ వీడియోలో ఆయన ఆరోపించారు. పార్లమెంటులో జరుగుతున్నదానిని దేశ ప్రజలు చూడకూడదనే ఉద్దేశంతో రాజ్యసభ టీవీ ఫీడ్‌ను కట్ చేశారని ఆరోపించారు. ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. రాజ్యసభ టీవీని సెన్సార్ చేశారని, ప్రచారం జరగకుండా చూసుకున్నారని అన్నారు. తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. 


గత ఏడాది సెప్టెంబరులో ఈ మూడు సాగు చట్టాలను పార్లమెంటు ఆమోదించింది. వీటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. 


Updated Date - 2021-11-19T19:41:10+05:30 IST