రాచనాగుకు తలస్నానం చేయించాడు.. వణుకు పుట్టిస్తున్న వీడియో..

ABN , First Publish Date - 2020-05-26T18:52:56+05:30 IST

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్న వేళ... ఓ వ్యక్తి ఏకంగా రాచనాగుకు తలస్నానం చేయించిన..

రాచనాగుకు తలస్నానం చేయించాడు.. వణుకు పుట్టిస్తున్న వీడియో..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్న వేళ... ఓ వ్యక్తి ఏకంగా రాచనాగుకు తలస్నానం చేయించిన వీడియో వైరల్‌గా మారింది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా సహా అనేక మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 5 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో.. ఓ వ్యక్తి బకెట్‌లో నీళ్లు తీసుకొచ్చి నాగుపాము తలపై పోస్తుండగా.. అది ఏమాత్రం బుసకొట్టకుండా సేదదీరుతున్నట్టు కనిపించింది. నీళ్లు పోసిన తర్వాత సదరు వ్యక్తి పాము తలపై నెమ్మదిగా తట్టడం, ఓ పరదాపై దాన్ని వదిలేసి కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తూ మాట్లాడడం వంటి దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. పాముకి, మనిషికి మధ్య అనుబంధం చూసి పలువురు ముచ్చటపడగా.. మరికొందరు మాత్రం ఇలా చేయడం చాలా ప్రమాదం అంటూ హెచ్చరించారు.


ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా స్పందిస్తూ.. ‘‘అసలే వేసవి.. మంచిగా తలస్నానం చేయడం ఎవరికి మాత్రం ఇష్టముండదు? కానీ ఇది చాలా ప్రమాదం.. ఎప్పుడూ ప్రయత్నించకండి..’’ అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌పై మరో యూజర్ స్పందిస్తూ.. ‘‘మనుషులకు తప్ప సృష్టిలోని జీవులన్నిటికీ దయాగుణం ఉంది సర్..’’ అని పేర్కొన్నారు. కాగా ‘‘ఉక్కు నరాలు, దయాభావం కలగలిస్తే కనిపించేదే ఈ దృశ్యం..’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రమాదమే అయినా చూడ్డానికి చాలా బాగుంది..’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. 





Updated Date - 2020-05-26T18:52:56+05:30 IST