సాగర తీరంలో స్నేహ మాధుర్యం

ABN , First Publish Date - 2022-08-08T06:09:17+05:30 IST

ఆకాశాన్ని కమ్మేసిన మబ్బులు...అప్పుడప్పుడూ పలకరిస్తున్న చిరు జల్లులు...ఆగి ఆగి కురుస్తున్న జడివాన...ఇవేవీ స్నేహ మాధుర్యానికి అడ్డుకావన్నట్లు సాగరతీరంలో ఆదివారం సందడి నెలకొంది.

సాగర తీరంలో స్నేహ మాధుర్యం
బీచ్‌ రోడ్డులో సెల్ఫీలతో సందడి చేస్తున్న స్నేహితులు

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆనందాల హరివిల్లు

ఎక్కడెక్కడివారో తరలివచ్చి ఆటపాటలతో సందడి

ఆ తరం...ఈ తరం...నవతరం...స్త్రీపురుషుల ముచ్చట్లు

స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పిన వైనం

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : ఆకాశాన్ని కమ్మేసిన మబ్బులు...అప్పుడప్పుడూ పలకరిస్తున్న చిరు జల్లులు...ఆగి ఆగి కురుస్తున్న జడివాన...ఇవేవీ స్నేహ మాధుర్యానికి అడ్డుకావన్నట్లు సాగరతీరంలో ఆదివారం సందడి నెలకొంది.  స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ తరం...ఈతరం...నవ తరంతో బీచో రోడ్డు నిండిపోయింది. పిల్లలు, యువత, వృద్ధులు...స్త్రీ పురుషుల్లో అన్నివర్గాల్లో ఒకటే ఉత్సాహం.


తమ అనుబంధానికి చిహ్నంగా స్నేహితుల బ్యాండ్‌ ధరించి మురిసిపోయారు. స్వీట్లు పంపిణీ చేశారు. కేక్‌లు కట్‌ చేశారు.  నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన స్నేహితులు ఆటపాటలతో సందడి చేశారు. జ్ఞాపకాలు పంచుకున్నారు. అనుభూతుల్ని నెమరువేసుకున్నారు. సెల్ఫీలు దిగారు. కెరటాలతో పోటీపడుతూ ఇసుక తిన్నెలపై సయ్యాటలాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బృందాలుగా తరలివస్తున్న స్నేహితుల సందడి సాగరతీరానికి సరికొత్త అందాలు అద్దింది. స్నేహితుల సంబరాల మధ్య ఎగసి పడేఅలల సవ్వడి కూడా చిన్నబోయింది. 

Updated Date - 2022-08-08T06:09:17+05:30 IST