Abn logo
Sep 18 2020 @ 01:38AM

మిత్ర ‘విమర్శ’

గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పుట్టినరోజు అభినందనల సందేశాల నడుమ, ఒక అప్రియమైన కానుక అందింది. అది కూడా మిత్రపక్షం నుంచి. ఆరు సంవత్సరాల పైబడిన ఎన్‌డిఎ ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక కేబినెట్ మంత్రి రాజీనామా చేయడం జరగలేదు. దీర్ఘకాలం పంజాబ్ నుంచి భారతీయ జనతాపార్టీకి మిత్రపక్షంగా ఉంటున్న శిరోమణి అకాలీదళ్ తన కార్యకర్తల నుంచి, మద్దతుదారులైన రైతాంగ శ్రేణుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలవొగ్గి, వివాదాస్పదమైన వ్యవసాయ రంగ బిల్లులకు వ్యతిరేకతను బాహాటంగా ప్రకటిస్తూ, తమ మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్ బాదల్‌ని ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకున్నది. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఈ నిర్ణయాన్ని లోక్‌సభలో ప్రకటించారు. ఈ మూడు బిల్లులలోని నిర్ణయాలను కేంద్రప్రభుత్వం మునుపే ఆర్డినెన్స్‌లుగా జారీచేసింది. వెంటనే వాటికి అనేక వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో ఈ ఆర్డినన్సులను సభామోదం కోసం బిల్లులుగా ప్రవేశపెట్టారు. ఒక పక్క, బిల్లులపై తర్జనభర్జనలు, నిరసనలు వెలువడుతుండగానే, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు 2020ను లోక్‌సభ ఆమోదించింది. తక్కిన రెండు బిల్లులపై చర్చ సందర్భంగానే అకాలీదళ్ తమ మంత్రి నిష్క్రమణను ప్రకటించింది. హర్ సిమ్రత్ కౌర్ వ్యవసాయరంగంతో అనుబంధం ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. 


వ్యవసాయ ఉత్పత్తుల వర్తక వాణిజ్యాల (అభివృద్ధి, అనుకూలతల ఏర్పాటు) ఆర్డినెన్స్–2020, రైతాంగం (ధరల హామీ, రైతు సేవలపై సాధికారత, రక్షణలు కల్పించే ఒప్పందం) ఆర్డినెన్స్–2020, నిత్యావసర సరుకుల (సవరణ) ఆర్డినెన్స్–2020 ఈ మూడు ఆర్డినెన్స్‌లు దేశవ్యాప్తంగా రైతాంగశ్రేణులలో, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వంటి వాణిజ్యపంటల రైతాంగంలో తీవ్ర అలజడిని కలిగించాయి. 


మంగళవారం నాడు లోక్‌సభ ఆమోదించిన నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు, వ్యవసాయోత్పత్తుల ధర పెంపునకు, నిల్వ పరిమితికి మధ్య లంకె పెట్టింది. ఇది పెద్ద పెద్ద రైతులు తమ ఉత్పత్తిని భారీగా నిల్వచేసుకోవడానికి చట్టబద్ధత కల్పిస్తోందని, రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ, మార్కెట్ రంగాలలో కేంద్రం జొరబడి, తమ హక్కులను హరిస్తుందని రాష్ట్రాలు వాది‍‍స్తున్నాయి. ఏవో పెద్ద ఉత్పాతాలు వస్తే తప్ప నిత్యావసరాల పంపిణీలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోదు. సాధారణ సమయాల్లో, ఎంత నిల్వ చేసుకున్నా, కృత్రిమంగా ధరలు పెంచుకున్నా బలాదూర్. ఆహారభద్రతకు ఈ బిల్లు పెద్ద ప్రమాదమని విమర్శకులు అంటున్నారు.


రైతుల (సాధికారత, రక్షణ) సవరణ బిల్లు- కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయ ఉత్పత్తిని కొనేవారికి, రైతుకు మధ్య జరిగే వర్తక ఒప్పందాల చట్రాన్ని ఈ బిల్లు సూచిస్తున్నదని, ఇది రైతుకు న్యాయమైన ధర ఇప్పించేందుకు ఉపయోగపడేదని ప్రభుత్వం చెబుతోంది. పంజాబ్, హర్యానా రైతులు ప్రభుత్వ వాదనను నమ్మడం లేదు. ఈ సందర్భంలో రిలయన్స్ జియో ఉదాహరణ చెబుతున్నారు. మొదట అతి చవుకగాసేవలు అందించిన కంపెనీ, తన ఆధిక్యం స్థిరపడిన తరువాత ఏకపక్షంగా చార్జీలను పెంచుతున్నదని వారు గుర్తుచేస్తున్నారు. రైతును కాంట్రాక్టు వ్యవసాయంలోకి దించేవరకే, అధిక ప్రతిఫలాన్ని ఇవ్వజూపుతారని, ఒకసారి వ్యవసాయరంగమంతా కాంట్రాక్టుమయం కాగానే, వ్యాపారులే శాసిస్తారని రైతాంగం భయపడుతున్నారు.


ఇక, వ్యవసాయోత్పత్తుల వర్తక, వాణిజ్యాల (అభివృద్ధి, అనుకూలతల ఏర్పాటు) బిల్లు- హద్దులు లేని సరుకుల రవాణా గురించినది. వ్యవసాయోత్పత్తులను స్థానిక, నిర్ణీత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా, వెలుపలికి కూడా తరలించి అమ్ముకోవడానికి వీలు కల్పించే ఈ బిల్లు వ్యవసాయదారులకు వరం వంటిదని కేంద్రం చెప్పుకున్నది. అంతర్రాష్ట్ర వర్తకానికి కానీ, వ్యవసాయోత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి గానీ ఎటువంటి నిబంధనలూ అడ్డు కాబోవు. నిర్ణీత మార్కెట్లకు వెలుపల జరిగే వర్తకం విషయంలో రాష్ట్రప్రభుత్వాలకు పన్నులు, లెవీలు ఏవీ కట్టనక్కరలేదు. సంప్రదాయ మార్కెట్లు అమ్మకందారుకీ, కొనుగోలుదారుకీ నడుమ ఒక వేదికగా పనిచేసి, రైతులకు అన్యాయం జరగకుండా నిరోధిస్తాయి. కనీసం అటువంటి వ్యవస్థ ఒకటి అక్కడ ఉంటుంది. ఆ మార్కెట్లలో వ్యవహరించే ఏజెంట్లకు, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు కూడా లైసెన్సింగ్ ఉంటుంది. ఈ బాహాటపు వర్తకంలో అటువంటి రక్షణలు, పద్ధతులు ఏమీ ఉండవు. కనీస మద్దతు ధరను అమలుచేయాలనే నిబంధన ఏమీ ఉండదు. మార్కెట్ డిమాండ్ ప్రకారమే ధరలు ఉంటాయి. రైతుల అనుభవం ప్రకారం మార్కెట్ శక్తులు నిర్ణయించే ధరలెపుడూ రైతులకు ప్రతికూలంగానే ఉంటాయి.


మొత్తం మీద ఈ మూడు బిల్లులూ, వ్యవసాయరంగాన్ని మార్కెట్‌కు అనుసంధానం చేయడానికి ఉద్దేశించినవే. దానితోపాటు, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, కేంద్రం అధికారాలను ఏకపక్షంగా విస్తరించే బిల్లులు. కరోనా ఉత్పాత సమయంలో, ప్రజలు భయాందోళనల్లో ఉన్న సమయంలో, అనేక వివాదాస్పదమైన నిర్ణయాలను త్వరితగతిన చట్టబద్ధం చేయాలన్న పథకంలో భాగంగానే ఈ మూడు బిల్లులను హడావుడిగా తీసుకువచ్చారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఆశ్చర్యంగా, ప్రతిపక్షాల నుంచి కంటె కేంద్రప్రభుత్వ మిత్రపక్షం నుంచే గట్టి ప్రతిఘటన ఎదురయింది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి మోదీ ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహం తెలిసిందే. కానీ, ఆత్మనిర్భరత గురించి చెబుతూ రైతులను పరాధీనులుగా మార్చే ప్రయత్నం మంచిది కాదు.


అయితే, ఈ మూడు బిల్లులకు కొన్ని సవరణలను మాత్రమే పంజాబ్ రైతులు కోరుతున్నారు. బహుశా, కొద్దిపాటి సవరణలు చేయడానికి ముందుకు వస్తే, అకాలీదళ్ తన అసమ్మతిని వెనక్కి తీసుకోవచ్చు కూడా. పైగా, మంత్రి చేత రాజీనామా చేయించినంత మాత్రాన, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్టు కాదని, తక్కిన అన్ని విషయాలలోను అండగానే ఉంటామని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చెప్పారు కూడా. కాబట్టి, ఈ కలహం చిన్నదే కావచ్చు, గాలివానగా మారకపోవచ్చు. ఎంతో కాలంగా, రాష్ట్రాల, ప్రాంతాల హక్కులను కుదించివేస్తూ, కేంద్రీకృత అధికారాన్ని పెంచుకుంటూపోతున్న క్రమానికి ఒక అసమ్మతి వ్యక్తమైందన్నదే ఇందులో ప్రతిపక్షాలకు ఆనందకరమైన అంశం. m