చాలా కాలం తర్వాత...

ABN , First Publish Date - 2022-01-17T06:21:58+05:30 IST

స్నేహితులు వచ్చారు.. సందడి చేశారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆనందంగా గడిపారు..

చాలా కాలం తర్వాత...
ఆనందమానందమాయే : 30 ఏళ్ల తరువాత కలుసుకున్న దిరుసుమర్రు పాఠశాల విద్యార్థులు

కలుసుకున్న అపూర్వ స్నేహితులు


పాలకోడేరు/పోడూరు/నరసాపురంరూరల్‌/భీమవరంరూరల్‌/టౌన్‌, జనవరి 16 : స్నేహితులు వచ్చారు.. సందడి చేశారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆనందంగా గడిపారు.. ఎన్నాళ్లయిందిరా నిన్ను కలుసుకుని.. ఎన్నాళ్ల యిందే నిన్ను చూసి అంటూ అపూర్వ స్నేహితులు ఒకరినొకరు కబుర్లు చెప్పు కున్నారు..ఆ పాత స్నేహితులతో పాఠశాలల ప్రాంగణాలు కళకళలాడాయి. పెద్దలు కూడా తమ తమ కళాశాలల్లో చిన్న పిల్లలుగా మారిపోయారు.ఆ నాటి ఆటలు గుర్తు చేసుకుని మరీ ఆడారు.. పాటలు పాడుకుని సందడి చేశారు. నాటి మధుర స్మృతులను మనసు నిండా నింపుకుని.. సెల్‌ఫోన్లలో నెంబర్లు  సేవ్‌ చేసుకుని ఆనందంగా ఇళ్ల బాటపడ్డారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం జడ్పీ హైస్కూల్‌లో 1976–77 సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వవిద్యార్థులు 45 ఏళ్ల తరువాత ఆదివారం కలుసుకుని సందడి చేశారు.  ఆనాటి మిత్రుల్లో ఇద్దరు చనిపోవడంతో వారి కుటుంబాలకు రూ.70 వేల చొప్పున అందించారు. మరో మిత్రుడి కుటుంబానికి రూ.60 వేలు ఇచ్చారు.విస్సాకోడేరులో బీజేపీ నాయకుడు పురిగళ్ళ రఘురామ్‌, సర్పంచ్‌ బొల్లా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శనివారం స్నేహితుల సమ్మేళనం నిర్వహించారు. పోడూ రు జడ్పీ హైస్కూల్‌  1993– 94 టెన్త్‌ పూర్వ విద్యార్థులు 27 ఏళ్ల తరు వాత కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భీమవరం మండలం దిరుసుమర్రులోని అల్లూరి రాంబద్రిరాజు ఉన్నత పాఠశాల 1991–92 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తరువాత కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు సత్యనారాయణరాజు, రమణయ్య, రాజమౌళిలను సత్కరించారు. భౌతికంగా దూరమైన మిత్రులు, గురువులకు శ్రద్ధాంజలి ఘటించారు.భీమవరం ఏఆర్‌కేఆర్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో 1990 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 22 ఏళ్ల తరువాత కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.





Updated Date - 2022-01-17T06:21:58+05:30 IST