Abn logo
Sep 26 2021 @ 00:15AM

ఫ్రిజ్‌కు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌

దౌలపల్లి సుబ్బారావు, రమణమ్మ (ఫైల్‌ ఫొటోలు)

చెలరేగిన మంటలు

పొగలు దట్టంగా వ్యాపించడంతో  ఊపిరాడక భార్యాభర్తలు మృతి

కొత్త ఇంట్లోకి వచ్చిన నాలుగు రోజులకే విషాదం


విశాఖపట్నం/మహారాణిపేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఫ్రిజ్‌కు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో సంభవించిన ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. నగరంలోని అల్లిపురం వెంకటేశ్వరమెట్టలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దౌలపల్లి సుబ్బారావు (54) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. భార్య రమణమ్మ (48)తో కలిసి నాలుగు రోజుల కిందటి వరకూ కెప్టెన్‌ రామారావు జంక్షన్‌లోని అద్దె ఇంట్లో ఉండేవారు. ఆ ఇంటిని ఖాళీ చేసి గత ఆదివారమే అల్లిపురం వెంకటేశ్వరమెట్టకు మారారు. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇంట్లో సుబ్బారావు, ఆయన భార్య వుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కలవారంతా అప్రమత్తమై పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ మంటలను అదుపుచేసిన అనంతరం పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా సుబ్బారావు, అతని భార్య నిర్జీవంగా పడి  ఉన్నారు. మొదట అందరూ గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని భావించారు. అయితే ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ మామూలుగానే ఉండడం, రిఫ్రిజిరేటర్‌ బాగా ఖాళీపోయి వుండడంతో షార్ట్‌సర్క్యూట్‌ అయి వుంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇంట్లో తలుపులు వేసుకుని వుండడంతో ఒక్కసారిగా పొగ వ్యాపించడంతో ఊపిరాడక మృతిచెంది వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈస్ట్‌ ఏసీపీ హర్షితచంద్ర, టూటౌన్‌ సీఐ కె.వెంకటరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణం ఏమిటనేది దర్యాప్తులో తేలుతుందని ఏసీపీ తెలిపారు.