జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించండి: సుప్రీంలో ‘పిల్’

ABN , First Publish Date - 2022-06-16T22:02:09+05:30 IST

చూస్తుంటే దేశంలో జనాభా విస్ఫోటనం సంభవించేలా ఉందని, దానిని నియంత్రించే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో

జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించండి: సుప్రీంలో ‘పిల్’

న్యూఢిల్లీ: చూస్తుంటే దేశంలో జనాభా విస్ఫోటనం సంభవించేలా ఉందని, దానిని నియంత్రించే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో తాజాగా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మథురకు చెందిన దేవికానందన్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. జనాభా నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేసి గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, నిద్ర, ఆశ్రయం, జీవనం, న్యాయం, విద్య వంటి ప్రాథమిక హక్కులను రక్షించేలా నియమ నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ వ్యాజ్యంలో దేవికానందన్ కోరారు. రాజ్యాంగంలోని 14, 15, 19, 21 అధికరణల ప్రకారం పౌరులకు ప్రాథమిక హక్కులు లభించాయని, జనాభాను నియంత్రించడం ద్వారా వాటికి భంగం కలగకుండా చూడాలని కోరారు. 


జనాభాను నియంత్రించకుండా పైన పేర్కొన్న హక్కులను కాపాడడం దుర్లభమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 24వ ప్రతిపాదన పనితీరును సమీక్షించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు జాతీయ కమిషన్‌ను అమలు చేయలేదని దేవికానందన్ తన పిల్‌లో పేర్కొన్నారు. దేశంలోని 125 కోట్లమంది భారతీయులకు ఆధార్ కార్డులు ఉన్నాయని, 20 నుంచి 25 శాతం మందికి అవి లేవని పేర్కొన్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాటుదారులు కలిసి దాదాపు 5 కోట్ల మంది భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నట్టు చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే దేశ జనాభా 150 కోట్ల పైమాటేనని, ఈ లెక్కన చైనాను భారత్ దాటేసిందన్న విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు.


భారత తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలామ్ ఆజాద్ మనవడు ఫిరోజ్ బక్త్ అహ్మద్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ, మరికొందరు కూడా గతంలోఇలాంటి వ్యాజ్యాలనే సుప్రీంలో దాఖలు చేశారు. భారతదేశం తమ ప్రజలపై కుటుంబ నియంత్రణను బలవంతం చేయడాన్ని నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని, నిర్దిష్ట సంఖ్యలో పిల్లలను కలిగి ఉండాలనే ఏదైనా బలవంతపు చర్య ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రి సుప్రీంలో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు దేశంలో సహజంగానే ఉన్నాయని, తమ కుటుంబం ఎంత ఉండాలి? తమకు సరిపడే కుటుంబ నియంత్రణ పద్ధతులు వంటివి ఎలాంటి బలవంతం లేకుండానే అందుబాటులో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. 


దేశంలో 50 శాతానికిపైగా సమస్యలకు జనాభా విస్ఫోటనమే కారణమని, కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సాయం, రాయితీలు, ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ, ఆస్తి హక్కు, ఉచిత ఆశ్రయ హక్కు వంటివాటి కోసం ‘ఇద్దరు పిల్లలు’  చట్టాన్ని ఒక ప్రమాణంగా రూపొందించేందుకు సాధ్యాసాధ్యాలను నిర్ధారించడానికి కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని పిల్‌లో దేవికానందన్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2022-06-16T22:02:09+05:30 IST