న్యూఢిల్లీ: ఢిల్లీ-పంజాబ్ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ దాఖలైంది. సింఘూ సరిహద్దులో ఒక వ్యక్తి మృతదేహం ఛిద్రమై కనిపించిన కొద్ది గంటల్లోనే ఈ పిటిషన్ దాఖలు కావడం విశేషం. ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించే హక్కును రైతు నిరనసకారులు ఉల్లంఘించడమే కాకుండా, హింసను కోరుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. స్వాతి గోయెల్, సంజీవ్ నెవర్ అనే ఇద్దరు పిటిషనర్ల తరఫున అడ్వకేట్ శేఖర్ ఝా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
దసరా రోజున లఖ్‌బీర్ సింగ్ అనే దళిత వ్యక్తి మృతదేహం ఛిద్రమైన దశలో పోలీస్ బ్యారికేడ్‌కు వేలాడుతూ కనిపించిందని, అమానవీయ చర్యలకు తావిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో నిరసనలు కొనసాగించడం చట్టవిరుద్ధంగా పరిగణించాలని ఆ పిటిషన్ పేర్కొంది. రిపబ్లిక్‌డే సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్దఎత్తున హింస చెలరేగడాన్ని, ఒక మహిళపై లైంగిక దాడుల ఆరోపణలను కూడా పిటిషనర్ ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతులను అక్కడ్నించి తొలగించాలని కోరారు. కోవిడ్ నిబంధనల ప్రకారం, నిరసనలు, పెద్ద ఎత్తున జన సమీకరణలు జరగరాదని కూడా పిటిషనర్ పేర్కొన్నారు. కాగా, రైతులు నిరసనలు కొనసాగించడంలో హేతుబద్ధతను అక్టోబర్ 4న సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. 18 నెలల పాటు సాగు చట్టాల అమలును వాయిదా వేస్తున్నట్టు కేంద్రం హామీ ఇచ్చినందున జాతీయ రహదారులను దిగ్బంధించడంతో సహా, నిరసనలు కొనసాగించడంలో హేతుబద్ధతన ఏమిటని రైతులను ప్రశ్నించింది.