ఈ రోడ్డు.. ప్రమాదాల అడ్డా

ABN , First Publish Date - 2022-01-06T05:47:00+05:30 IST

మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధి మడూరు రోడ్డు నిత్యం ప్రమాదాలకు నిలయమైంది.

ఈ రోడ్డు.. ప్రమాదాల అడ్డా
బైకును ఢీకొనడంతో చనిపోయిన పంది (ఫైల్‌)

మడూరు రోడ్డుపై నిత్యం ప్రమాదాలు
వాహనాలను ఢీకొంటున్న పందులు
ఇబ్బందులు పడుతున్న జనాలు
పట్టించుకోని అధికారులు
ప్రొద్దుటూరు రూరల్‌, జనవరి 5:
మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధి మడూరు రోడ్డు నిత్యం ప్రమాదాలకు నిలయమైంది. ఈ రోడ్డులోని సంజీవనగర్‌లో ఎక్కువ మంది పందుల పెంపకాన్ని చేపట్టారు. ఈ పందులను రోడ్లపైకి వదలడం వలన అవి రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తూ వాహనదారులను ఢీకొట్టడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం కొత్తపల్లె గ్రామానికి చెందిన యువకులు దావీద్‌, దాదాపీర్‌ బైకుపై వెళుతూ ప్రకా్‌షనగర్‌ సమీపంలో పందిని ఢీకొని కిందపడ్డారు. ప్రమాదంలో పంది అక్కడికక్కడే మరణించగా యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. పందులు ఢీకొనడంతో అనేక ప్రమాదాల్లో కొంతమంది చనిపోగా చాలామంది గాయాలపాలయ్యారు.

పందుల పెంపకం లేకుండా చర్యలు తీసుకోవాలి
అటు మున్సిపాలిటీకి, ఇటు కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సరిహద్దు ప్రాంతమైన సంజీవనగర్‌లో ఎక్కువ సంఖ్యలో పందుల పెంపకం చేపట్టారు. దీని వలన ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లడంతో పాటు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ప్రజల ఫిర్యాదు మేరకు అధికారులు జోక్యం చేసుకుని పందుల పెంపకందారులకు నోటీసులు జారీ చేశారు. గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో పందులను పెంచుకోవాలని హెచ్చరించారు. దీంతో కొన్నాళ్లు సంజీవనగర్‌లో పందుల పెంపకాన్ని ఆపివేసి అమృతానగర్‌ వైపు వెళ్లిపోయారు. అయితే ఇటీవల మళ్లీ సంజీవనగర్‌లోనే పందుల పెంపకం చేపట్టడంతో ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. మడూరు రోడ్డులో, సంజీవనగర్‌లో పందుల పెంపకం లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-06T05:47:00+05:30 IST