జొకో బోణీ

ABN , First Publish Date - 2020-09-30T09:31:13+05:30 IST

పురుషుల టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, చెక్‌ రిపబ్లిక్‌ భామ కరోలినా ప్లిస్కోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన ...

జొకో బోణీ

రెండో రౌండ్‌కు ప్లిస్కోవా, కెనిన్‌, బెరెట్టిని 

బ్రాడీ, కెర్బర్‌ అవుట్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: పురుషుల టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, చెక్‌ రిపబ్లిక్‌ భామ కరోలినా ప్లిస్కోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సెర్బియా యోధుడు జొకోవిచ్‌ 6-0, 6-2, 6-3తో స్వీడన్‌కు చెందిన 80వ ర్యాంకర్‌ మైకేల్‌ వైమర్‌పై వరుససెట్లలో విజయం సాధించాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం సాగించిన జొకో మ్యాచ్‌లో ఏకంగా 32 విన్నర్లు సంధించాడు. మిగతా స్టార్‌ ఆటగాళ్లలో ఏడోసీడ్‌ మాటియో బెరెట్టినీ (ఇటలీ) 6-3, 6-1, 6-3తో వాసెక్‌ పాస్పిసిల్‌ (కెనడా)పై, పాబ్లో కర్రెనో బుస్టా (స్పెయిన్‌) 6-3, 6-2, 7-5తో జాన్‌ మెల్‌మన్‌ (ఆస్ట్రేలియా)పై, 20వ సీడ్‌ క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ) 6-4, 4-6, 6-1, 6-4తో ఫిలిప్‌ కొషెరిబెర్‌ (జర్మనీ)పై గెలిచి రెండోరౌండ్లో అడుగు పెట్టారు. కాగా.. లోకల్‌ స్టార్‌, 8వ సీడ్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌కు ఆరంభరౌండ్లోనే చుక్కెదురైంది. మోన్‌ఫిల్స్‌ 4-6, 5-7, 6-3, 3-6తో అలెగ్జాండర్‌ బూబిక్‌ (రష్యా) చేతిలో కంగుతిన్నాడు. 

బ్రాడీకి షాక్‌..

మహిళల సింగిల్స్‌లో యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనలిస్ట్‌ జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా), మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ)కు తొలిరౌండ్‌లోనే షాక్‌ తగిలింది. డచ్‌ టీనేజర్‌ క్లారా టాసన్‌ 6-4, 3-6, 9-7తో 21వ సీడ్‌ బ్రాడీని ఓడించగా, కాజా జువాన్‌ (స్లోవేనియా) 6-3, 6-3తో కెర్బర్‌కు చెక్‌పెట్టింది. ఇక, రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా 6-7(9), 6-2, 6-4తో మయర్‌ షరీఫ్‌ (ఈజి్‌ప్ట)పై కష్టపడి నెగ్గగా.. 4వ సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6-4, 3-6, 6-3తో సామ్‌సొనొవాపై, మాజీ చాంపియన్‌ జెలెనా ఓస్టపెంకో (లాత్వియా) 6-2, 6-1తో మాడిసన్‌ బ్రెంగ్లీ (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్లో ప్రవేశించారు. 

Updated Date - 2020-09-30T09:31:13+05:30 IST