హైదరాబాద్‌ మార్కెట్లోకి ‘సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌’

ABN , First Publish Date - 2021-02-28T09:04:14+05:30 IST

ఫ్రెంచ్‌ కార్ల కంపెనీ పీఎ్‌సఏ గ్రూప్‌ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌ విభాగంలో ప్రీమియం ఎస్‌యూవీ ‘సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌’

హైదరాబాద్‌ మార్కెట్లోకి ‘సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌’

  • దేశీయ విపణిలోకి ఫ్రెంచ్‌ కంపెనీ
  • విక్రయాలకు ‘ఫిజిటల్‌’ షోరూమ్‌లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫ్రెంచ్‌ కార్ల కంపెనీ పీఎ‌స్‌ఏ గ్రూప్‌ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌ విభాగంలో ప్రీమియం ఎస్‌యూవీ ‘సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌’ ను విడుదల చేయనుంది. మార్చి ఒకటి నుంచి బుకింగ్‌లను స్వీకరించనుంది. హైదరాబాద్‌లో ప్రైడ్‌హోండా సిట్రాన్‌ వాహనాలకు డీలర్‌గా వ్యవహరిస్తోంది.


దేశీయంగా 10 ప్రధాన నగరాల్లో డీలర్ల నెట్‌వర్క్‌ను కంపెనీ ఏర్పాటు చేసుకుంది. ఇప్పటి వరకూ భారత్‌లోని ఎస్‌యూవీల్లో లేని కొత్త సౌకర్యాలతో దీన్ని విడుదల చేస్తోంది. భద్రతపరంగా వినూత్న సదుపాయాలు సిట్రాన్‌ సీ5 ఎయిర్‌ క్రాస్‌లో ఉన్నాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఎస్‌యూవీ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. వాహనాల విక్రయానికి కంపెనీ కొత్త పంథాను అనుసరిస్తోంది. ‘లా మైసన్‌ సిట్రాన్‌’ పేరుతో ఫిజిటల్‌ షోరూమ్‌ను హైదరాబాద్‌లోని ప్రైడ్‌ హోండా షోరూమ్‌లో ప్రారంభించింది. ఫిజిటల్‌ షోరూమ్‌లలో ఆన్‌లైన్‌లో బుకింగ్‌లతోపాటు టెస్ట్‌ డ్రైవ్‌ సౌకర్యం, ఆఫ్టర్‌ సేల్‌ సేవలు ఉంటాయని సిట్రాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (అమ్మకాలు, నెట్‌వర్క్‌) జోల్‌ వెరనీ తెలిపారు. సంప్రదాయ వాహన విక్రయాలకు లా మైసన్‌ సిట్రాన్‌ షోరూమ్‌లు కొత్త మలుపు ఇవ్వగలవన్నారు. ఈ షోరూమ్‌లో ముందుగానే తమ అభిరుచులకు అనుగుణంగా కారును కస్టమైజ్‌ చేసుకోవచ్చు.


ఖాతాదారులు తమకు అవసరమైన మార్పులు సూచిస్తే.. అందుకు అనుగుణంగా తయారు చేసి డెలివరీ చేస్తారు. సిట్రాన్‌ బ్రాండ్‌పై భారత్‌ మార్కెట్లోకి మరిన్ని వాహనాలను విడుదల చేయాలని ఫ్రెంచ్‌ కంపెనీ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 90 దేశాల్లో కంపెనీ 10 లక్షల సిట్రాన్‌ బ్రాండ్‌ కార్లను విక్రయించింది. ప్రీమియం, కంఫర్ట్‌ కోరుకునే వినియోగదారులకు ‘సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌’ సరిపోతుందని లా మైసన్‌ సిట్రాన్‌, హైదరాబాద్‌ సీఈఓ జి.రాకేశ్‌ కుమార్‌ తెలిపారు. సిట్రాన్‌ సీ5కు హైదరాబాద్‌ మార్కెట్లో మంచి స్పందన లభించగలదని ప్రైడ్‌ గ్రూప్‌ ఎండీ ఎం.సురేశ్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-02-28T09:04:14+05:30 IST