‘సరుకు’కు ప్రత్యేక రైల్వే లైన్లు

ABN , First Publish Date - 2022-02-06T09:02:24+05:30 IST

దేశంలో కేవలం సరుకుల రవాణా కోసమే ప్రత్యేకంగా రైళ్లు నడుస్తున్నాయని.. అందుకోసం ప్రత్యేక రైల్వే లైన్లు ఉన్నాయని.. ఇవి ప్రయాణికుల ఎక్స్‌ప్రైస్‌ రైళ్ల కంటే వేగంగా నడుస్తున్నాయని ఎంతమందికి తెలుసు? మరో ఏడాదికల్లా

‘సరుకు’కు ప్రత్యేక రైల్వే లైన్లు

  • ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే వేగంగా ప్రయాణం..
  • ఇక గూడ్స్‌ బళ్లపై ఆధారపడక్కర్లేదు
  • విజయవాడ-ఖరగ్‌పూర్‌, విజయవాడ-ఇటార్సీ మార్గాల్లోనూ స్పెషల్‌ లైన్లు
  • డీఎ్‌ఫడీసీ ఆధ్వర్యంలో నిర్మాణం వీటితో రూ.వేల కోట్లు ఆదా!
  • బ్రాడ్‌ గేజ్‌ కంటే ఎక్కువ వెడల్పు
  • ఒకేసారి 12 వేల టన్నుల రవాణా
  • లెవెల్‌ క్రాసింగులు ఉండవు
  • ఒక్క క్షణం కూడా రైళ్లు ఆలస్యం కావు!
  • కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నండూరి శ్రీనివాస్‌ వెల్లడి
  • ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ


న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): దేశంలో కేవలం సరుకుల రవాణా కోసమే ప్రత్యేకంగా రైళ్లు నడుస్తున్నాయని.. అందుకోసం ప్రత్యేక రైల్వే లైన్లు ఉన్నాయని.. ఇవి ప్రయాణికుల ఎక్స్‌ప్రైస్‌ రైళ్ల కంటే వేగంగా నడుస్తున్నాయని ఎంతమందికి తెలుసు? మరో ఏడాదికల్లా దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సరుకు రవాణాకు ఇక సాధారణ గూడ్స్‌ రైళ్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కొద్ది సంవత్సరాల్లో దక్షిణాదిన కూడా సరుకుల రవాణాకు ప్రత్యేక రైల్వే లైన్ల నిర్మాణం పూర్తవుతుందని డెడికేటెడ్‌ ఫ్రెయిట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఎ్‌ఫడీసీ) డైరెక్టర్‌, తెలుగువాడైన నండూరి శ్రీనివాస్‌ చెప్పారు. దీనివల్ల వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని వెల్లడించారు. ఆయన ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో మౌలిక వసతులకు భారీగా నిధుల కేటాయింపుపై ఆయన స్పందించారు. డీఎ్‌ఫడీసీ 2006లో ఏర్పడినప్పటికీ పెద్దగా పని జరగలేదని, 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు.


‘గతిశక్తి’లో భాగంగా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం లభించడంతో తమ కార్పొరేషన్‌ అతి వేగంగా పనులు ప్రారంభించిందన్నారు. కార్పొరేషన్‌కు ప్రపంచ బ్యాంకు, జైకా (జపాన్‌) నుంచి రూ.30 వేల కోట్ల రుణం రాగా.. మిగతా మొత్తాన్ని భారతీయ రైల్వే సమకూరుస్తోందని తెలిపారు. ‘ప్రస్తుతం పశ్చిమ కారిడార్‌లో 1,500 కి.మీ., తూర్పు కారిడార్‌లో 1,700 కి.మీ. మేర ప్రత్యేక రైల్వే లైౖన్ల నిర్మాణం కొనసాగుతోంది. తూర్పున 351 కి.మీ, పశ్చిమాన 641 కి.మీ. రైల్వే లైన్లు పూర్తయ్యాయి. రెండు కారిడార్లలో ఇప్పటివరకు 20,198 రైళ్లు నడిచాయి. ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్‌లో ఖరగ్‌పూర్‌ నుంచి విజయవాడ (1.115 కి.మీ), నార్త్‌-సౌత్‌ కారిడార్‌లో ఇటార్సీ నుంచి విజయవాడ ( 975 కి.మీ.), న్యూపాల్ఘర్‌ నుంచి ఖరగ్‌పూర్‌ వరకు ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌ల నిర్మాణానికి డీపీఆర్‌ కూడా పూర్తయింది’ అని పేర్కొన్నారు.


పెద్దపెద్ద బోగీల్లో రవాణా..

సరుకు రవాణాకు ప్రత్యేక రైల్వే లైన్ల వల్ల పరిపాలనా వ్యయం, రవాణా వ్యయం తగ్గిపోవడమే కాక అతి వేగంగా రవాణా జరుగుతుందని శ్రీనివాస్‌ చెప్పా రు. ఈ లైన్ల ట్రాక్‌ వెడల్పు మామూలు బ్రాడ్‌ గేజ్‌లైన్ల కంటే ఎక్కువ వెడల్పు ఉంటుందని, పెద్ద పెద్ద బోగీల ద్వారా రవాణా జరుగుతుందని తెలిపారు. ఒకేసారి 12వేల టన్నులను రవాణా చేయగలమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలే కాక, అనేక ప్రైవేటు సంస్థలు తమ సరుకులను ఈ ప్రాంతాల్లో అతి తక్కువ ధరకు, అతి వేగంగా రవాణా చేయగలుగుతున్నారని చెప్పారు. త్వరగా పాడయ్యే పళ్లు, కూరగాయలు, పాల వంటివాటినీ వేగంగా రవా ణా చేస్తున్నామన్నారు. 2023కల్లా పశ్చిమ, తూర్పు డెడికేటెడ్‌ కారిడార్ల ద్వారా రూ.24 వేల కోట్ల మేరకు రవాణా జరుగుతుందని తెలిపారు. పశ్చిమ కారిడార్‌లో 4 రాష్ట్రాలు, 31 జిల్లాలు... తూర్పు కారిడార్‌లో 7 రాష్ట్రా లు, 44 జిల్లాలు ప్రయోజనం పొందుతున్నాయని చెప్పారు.


గంటకు వంద కి.మీ. వేగం

రాజధాని వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే వేగంగా తమ రైళ్లు గమ్య స్థానం చేరుకోగలుగుతాయని, రాజధాని గంటకు 75 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే తమ ప్రత్యేక రైళ్లు 100 కిమీ వేగంతో ప్రయాణిస్తాయని శ్రీనివాస్‌ వెల్లడించారు.  చైనాలో 47 శాతం, అమెరికాలో 48 శాతం రైళ్ల ద్వారా సరుకుల రవాణా జరుగుతుండగా.. మన దేశంలో 36 శాతమే జరుగుతోందన్నరు. 57 శాతం సరుకు రవాణా రోడ్డు మార్గాన జరుగుతోందని చెప్పారు. డీఎ్‌ఫడీసీ నిర్మించే రైల్వే లైన్లకు లె వెల్‌ క్రాసింగ్స్‌ ఉండవని, అంతటా రోడ్డు పై వంతెనలు, లేదా రోడ్డు కింది వంతెనల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అత్యాధునిక  కమ్యూనికేషన్‌ వ్యవస్థ, నిరంతరం జీఎ్‌సఎం ద్వారా రైళ్ల ట్రాకింగ్‌ జరుగుతుందని, ఒక్క క్షణం కూడా ఆలస్యమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఇప్పుడు తూర్పు, పశ్చిమ కారిడార్లలో ట్రక్కులు కూడా తమ లైన్ల ద్వారా ప్రయాణిస్తున్నాయని, ఇందుకోసం ‘ట్రక్స్‌ ఆన్‌ ట్రైన్‌’ సేవలను ప్రవేశపెట్టామని శ్రీనివాస్‌ చెప్పారు. రేవారీ-పాలంపూర్‌ సెక్టార్‌లో ఇప్పటి వరకు 2,836 ట్రక్కులు రైల్వే మార్గంలో ప్రయాణించాయని, దీని వల్ల రూ,9 కోట్లు ఆర్జించామని వెల్లడించారు.

Updated Date - 2022-02-06T09:02:24+05:30 IST