Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 10 Aug 2022 00:28:49 IST

చైతన్య దీపికలు..

twitter-iconwatsapp-iconfb-icon
చైతన్య దీపికలు..

నా(నే)టి భాషానిలయాలు
స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాజరాజనరేంద్రాంధ భాషానిలయం
చైతన్యస్ఫూర్తికి ప్రతీకగా శబ్ధానుశాసన గ్రంథాలయం
వీటి కేంద్రంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ఉద్యమం
ఆజాదీకా అమృత్‌ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం


భారత స్వాతంత్య్ర పోరాటంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అగ్రభాగాన నిలిచింది. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు, ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. పాలకులకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలను చేపట్టి భరత మాత దాస్య  శృంఖలాలు తెంచడానికి తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ప్రజలందరినీ కదలించడంలో.. ఒక్కతాటిపై నడిపించడంలో ఎనలేని కృషి చేశారు. అదే సమయంలో గ్రంథాలయాలను వేదికలుగా చేసుకొని ఉద్యమ చైతన్యాన్ని రగిలించారు. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలే లక్ష్యంగా సాగిన జాతీయోద్యమంలో ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలు ముఖ్య భూమిక పోషించాయి. ఆజాదీకా అమృతోత్సవాల నేపథ్యంగా ప్రత్యేక కథనం.

హనుమకొండ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : జాతీయోద్యమంలో  అంతర్భాగంగా వరంగల్‌ జిల్లాలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులు గ్రంథాలయాలను ఇందుకు వేదికలుగా వాడుకున్నారు. అలాంటి వాటిలో ఒకటి హనుమకొండలోని శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్రభాషానిలయం. రెండోది వరంగల్‌లోని శబ్దానుశాసన గ్రంథాలయం. ఈ రెండు గ్రంథాలయాల స్థాపనలో ఆంధ్రశబ్ద  ఉపయోగమే ఒక సాహసోపేత చర్యగా ఉండేది. ఈ భాషా నిలయాలు భాషావాదుల నిలయాలుగా, జాతీయవాదుల సమావేశ స్థలాలుగా ఉపకరించేవి. నైజం ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా గ్రంథాలయోద్యమం జాతీయోద్యమంగా శంకించే రోజుల్లో శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్రాభాషా నిలయం నిర్మాణానికి కృషి చేసిన పాలపర్తి సత్యనారాయణ రావు చిరస్మరణీయులు. కాళోజీ నారాయణరావుతో పాటు నాటి స్వాతంత్య్ర సమరయోధులందరూ ఈ రెండు గ్రంథాలయాలనే తమ జాతీయోద్యమానికి ఆలంభనంగా చేసుకున్నారు.

స్వాతంత్య్ర ఉద్యమ కరదీపిక
శ్రీ రాజరాజనరేద్ర ఆంధ్రభాషానిలయానికి 118 యేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1904లో ఏర్పాటైన ఈ గ్రంథాలయం ఇప్పటికీ నాటి స్వాతంత్య్ర ఉద్యమానికి, నిజాం వ్యతిరేక పోరాటాలకు, ఎన్నో ప్రజా ఉద్యమాలకు సాక్షీభూతంగా నేటికీ నిలిచి ఉంది. హనుమకొండ చౌరస్తా నుంచి బస్‌స్టాండ్‌కు వెళ్లే రోడ్డులో ఉన్న ఈ గ్రంథాలయ భవనం, ఇందులో పుస్తకాలు పూర్తిగా పాతబడినా జిల్లా పాలనా యంత్రాంగం సహకారంతో గ్రంథాలయ నిర్వాహకులు పరిరక్షించుకుంటూ వస్తున్నారు. ఇందులో అడపాదడపా సమావేశాలు నిర్వహించడం ద్వారా నాటి గ్రంథాలయ ప్రాభవాన్ని నేటి తరానికి అందిస్తున్నారు.

ఉద్యమాలకు కేంద్రం
రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయం ఎన్నో సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. తెలుగు చదవడమే నేరమైన రోజులవి. ఆ కాలంలో తెలంగాణలో సామాన్య ప్రజలు మాట్లాడే తెలుగు భాషను చిన్నచూపు చూసేవారు. మాతృ భాషలో పత్రికలు నడిపేవారిపై నిరంతర నిఘా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో  ప్రజలను ఏకతాటిపై తెచ్చిన తెలుగు భాషా ఉద్యమానికి నిలయమైంది ఈ గ్రంథాలయం. 1901 సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పడింది. ఈ స్ఫూర్తి ఓరుగల్లును తాకింది. హైదరాబాద్‌ నుంచి బదిలీపై వరంగల్‌కు వచ్చిన  కొందరు ఉద్యోగులు హనుమకొండలో భాషానిలయం ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. అలా హనుమకొండ చౌరస్తా సమీపంలో ఈ గ్రంథాలయం 1904 జనవరి 30న దేశ్‌ముఖ్‌ పింగళి వెంకటరమణారెడ్డి బంగ్లాపై ఏర్పాటయింది. భాష అభిమానంతో ఇంటి యజమాని ఎలాంటి అద్దె తీసుకోలేదు. రావిచెట్టు రంగారావు,  సురవరం ప్రతాప్‌ రెడ్డి, కాళోజీ నారాయణ రావు తెలుగు భాష అభివృద్ధి కోసం  ప్రయత్నం చేశారు. ఆ నాటి గ్రంథాలయ ఉద్యమం ప్రజల్లో మార్పునకు కారణమైంది. శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయం నిజాం కాలంలో తెలుగు భాషా పరిరక్షణకు ఒక వేదికగా నిలిచింది. ఇందులో నిత్యం సాహిత్య సభలు, సదస్సులు జరిగేవి. శేషాద్రి రమణ కవులు సేకరించిన పలు తాళపత్ర గ్రంథాలతో పాటు కాకతీయుల కాలం నాటి శాసనాల్లో కొన్నింటిని ఇందులో భద్రపరిచారు.

నిజాం ఆరా
ఈ గ్రంథాలయంపై కొద్ది కాలంలో నిజాం రాజు కన్ను పడింది. భాషా నిలయం నిర్వహణ, కార్యకలాపాలను ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనిని మూసివేసేందుకు ఎన్నో ఒత్తిళ్లు తీసుకువచ్చినా జాతీయోద్యమం ముందు అవి పని చేయలేదు. 1994లో భాషా నిలయం  స్వంత భవనంలోకి మారింది. ఉద్యమాలతో పాటు 1949 తెలంగాణ సాయుధ పోరాటానికి భాషా నిలయం కేంద్రంగా దోహదపడింది.

మూడు ఉద్యమాలకు వేదిక
ఆ కాలంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడు ఉద్యమాలు ఉదృతంగా సాగేవి. మొదటిది ఆంధ్రభాషా వికాసోద్యమం, రెండవది సంఘ సంస్కరణోద్యమం, మూడవది రాజకీయోద్యమం. ఈ మూడింటిలోనూ ఈ గ్రంథాలయం కీలకభూమిక పోషించింది. ఈ గ్రంథాలయం నడవకుండా నిజాం పాలకులు అనేక అవరోధాలు సృష్టించారు. నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఈ భాషా నిలయం వేదికగా స్వేచ్ఛా, స్వాతంత్య్ర భావనల ఉద్దీపనకు ప్రేరణ కల్పిస్తుండేవి. సభలు, సమావేశాలు నిర్వహించి దేశభక్తిని పెంపొందిచేది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను రహస్యంగా ఇక్కడి నుంచే పంపిణీ జరిగేది. నాటి స్వాతంత్య్ర ఉద్యమకారులకు రహస్య సందేశాలు ఈ గ్రంథాలయం నుంచే చేరవేయడం జరిగేది. గ్రంథాలయాల్లో పుస్తకపఠనం కోసం వచ్చిన ఉద్యమకారులు తమ కార్యాచరణకు  ఇక్కడి నుంచే రూపకల్పన చేసేవారు. నాటి నైజాంలో బయట జరిగే చిన్న చిన్న సమావేశాలను కూడా అనుమానాస్పందగా చూసేవారు. పత్రికలలోని వార్తలపై బహిరంగంగా మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. ఆ కారణంగా ఉత్సాహకరమైన సంభాషణలకు భాషానిలయమే శరణ్యమైంది. అలా ఈ గ్రంథాలయం జాతీయోద్యమంలో, నైజాం వ్యతిరేక పోరాటంలో ఒక చారిత్రక పాత్రను పోషించింది.

శబ్ధానుశాసన గ్రంథాలయం
వరంగల్‌లోని శబ్దానుశానుశాసన గ్రంథాలయం కూడా జాతీయోద్యమంలో తన వంతు పాత్రపోషించింది. పత్రికల ద్వారా నాటి స్వాతంత్య్ర ఉద్యమ, రాజకీయ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది కరదీపికగా ఉపయోగపడింది. వరంగల్‌లోని మట్టెవాడ ప్రాంతంలో 1918లో ఈ గ్రంథాలయం ఏర్పడింది. వరంగల్‌ రైల్వే గేటు ఆవలి ప్రాంతంలోని కరీమాబాద్‌, ఉర్సు, రంగశాయిపేట, శంభునిపేట తదితర ప్రాంతాల్లో నాడు నిజాంకు వ్యతిరేకంగా ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకలాపాలు ఉదృతంగా సాగేవి. నాటి ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలకు ఈ గ్రంథాలయం అందుబాటులో ఉండేది. వారికి ఒక వేదికగా ఎంతో దోహదపడింది. వరంగల్‌లో శోభ పత్రిక నడుపుతున్న కాలంలో దేవుపల్లి రామానుజారావు శబ్దానుసాన గ్రంథాలయానికి కార్యదర్శిగా పని చేశారు. 1945లో ఈ గ్రంథాలయం రజతోత్సవం జరుపుకుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.