‘స్వాతంత్య్ర ఉద్యమకారులను స్మరించుకోవాలి’

ABN , First Publish Date - 2022-08-11T05:57:19+05:30 IST

స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన యోధులను స్మరించుకోవడం మన బాధ్యత అని జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అన్నారు.

‘స్వాతంత్య్ర ఉద్యమకారులను స్మరించుకోవాలి’
ఛాయచిత్రాలను తిలకిస్తున్న జేసీ నారపురెడ్డి మౌర్య

నంద్యాల టౌన్‌, ఆగస్టు 10: స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన యోధులను స్మరించుకోవడం మన బాధ్యత అని జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా వీవీ గిరి జయంతి వేడుకలను ఆర్‌ఏఆర్‌ఎస్‌ సెంటినరీ హాల్‌లో బుధవారం నిర్వహించారు. పర్యాటక శాఖ, దేవాదాయ, ధర్మదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వీవీ గిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జేసీ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించేలా జిల్లావ్యాప్తంగా రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుతెఎలిపారు. ఈనెల 14, 15వ తేదీలలో ప్రతిఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోథుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను సత్కరించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, తెలుగు నాటక రంగ ప్రముఖులు బళ్లారి రాఘవ జయంతి వేడుకలను నిర్వహించామన్నారు. జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శనను తిలకించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఆర్వో పుల్లయ్య, జిల్లా దేవాదాయ శాఖాధికారి సుధాకర్‌రెడ్డి, జిల్లా పర్యాటక శాఖాధికారి గోపాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T05:57:19+05:30 IST