ఉచితాలు సాధికారత చేకూర్చాలి

ABN , First Publish Date - 2022-09-26T08:50:18+05:30 IST

పరిపాలనను మెరుగుపరిచి ఓట్లు అడగటం కన్నా.. జనాన్ని ఆకర్షించి ఓట్లు అడగటం పాలకులకు ఇప్పుడు సులువైంది.

ఉచితాలు సాధికారత చేకూర్చాలి

  • వ్యక్తులను వ్యసనపరులను చేయొద్దు..
  • రాజకీయాలు చెడు వృత్తి కాదు
  • చెడు వ్యక్తుల వల్ల అలా మారాయి
  • ఏ వామపక్ష పార్టీలోనూ సభ్యత్వం లేదు
  • నేర్చుకోక కమ్యూనిస్టులు వెనకబడ్డారు
  • మార్పుకు తగ్గట్టు నిలబడితేనే భవిష్యత్తు
  • ఏపీ రాజధాని అమరావతి మార్పు సరికాదు
  • వర్సిటీల పేర్లు మార్చడం వల్ల ఏమీ రాదు

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో నాగేశ్వర్‌

‘‘రిపాలనను మెరుగుపరిచి ఓట్లు అడగటం కన్నా.. జనాన్ని ఆకర్షించి ఓట్లు అడగటం పాలకులకు ఇప్పుడు సులువైంది. ప్రతి ఉచిత పథకం మంచిదని చెప్పలేం. ఉచితాలు వ్యక్తిని సాధికారత వైపు మళ్లించాలి.. వ్యసనపరుడిని చేయకూడదు. అప్పట్లో ఎన్టీఆర్‌ రూ.2కిలో బియ్యం ఇచ్చారు. అప్పుడు మార్కెట్‌ ధరలో అది సగం. అయినా విమర్శలొచ్చాయి. బహుశా ఇప్పుడు రేషన్‌ కార్డుల సంఖ్య జనాభా కంటే ఎక్కువగా ఉంటుందేమో! మార్కెట్‌లో ఇప్పుడు సన్న బియ్యం కిలో రూ.40 ఉన్నా యి. దానిని రూ.10 కిలో చొప్పున రేషన్‌ షాపుల్లో ఇవ్వమనండి. అలా చేస్తే.. రూ.1 కిలో బియ్యాన్ని రూ.10 చేసిన ప్రభుత్వం అని ప్రతిపక్షాలు, మీడియా గగ్గోలు పెడతాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది.. నాకెందుకు అని రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు. ప్రజల్లో చైతన్యం రావడమే దీనికి పరిష్కారం’’ అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ప్రొఫెసర్‌గా, విశ్లేషకుడిగా, జర్నలిస్ట్‌గా, ఆర్థికవేత్తగా, హక్కుల నేతగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన ఆయన.. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో పలు అంశాలపై మాట్లాడారు. 


ఎమ్మెల్సీగా గెలుస్తాననుకోలేదు..

‘‘నేను విశ్లేషకుడిగా ఉన్నా.. ప్రాక్టికల్‌ అనుభవం లేకుండా సిద్ధాంతపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం వల్ల లాభం లేదు. అందువల్ల రాజకీయాల్లోకి వచ్చాను. ఎమ్మెల్సీగా గెలుస్తాననుకోలేదు. పట్టభద్రుల చైతన్యం వల్ల 2007, 2009లో గెలిచా. మొదటిసారి ఎమ్మెల్సీగా పోటీ చేసినపుడు.. మీరెందుకు ఈ పనికిమాలిన రాజకీయాల్లోకి వస్తున్నారని అడిగారు. నేను ఒకటే చెప్పా.. చెడు వ్యక్తుల వల్లే రాజకీయాలు చెడుగా మారాయి. అంతేకానీ, రాజకీయాలు చెడు వృత్తి కాదు. నేను పెద్ద అంచనాలతో కౌన్సిల్‌కు వెళ్లలేదు కనుక పెద్ద నిరాశేమీ కలగలేదు. రాజకీయాలను శుభ్రం చేయడం చాలా కష్టం. కానీ కొన్ని పనులు చేయగలిగాం.


ఏ పార్టీ సభ్యత్వం లేదు..

నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే.. దేన్నైనా విమర్శనాత్మకంగా చూడటం. చదవటం. అది మనకు నచ్చిన భావజాలమైనా.. అలాంటి విధానం వల్ల మనం నిత్యం నేర్చుకుంటాం. ఇప్పుడు వామపక్షాలు దేశంలో ఎందుకు బలహీనపడుతున్నాయి..? వారు నేర్చుకోవడం లేదు. సమాజాన్ని చూడటం లేదు. సమస్యలపై మాట్లాడటం లేదు. పురాణాలను పుక్కిడి పురాణాలు అని కొట్టిపారేయడం ఎంత వరకు కరెక్‌? అది కోట్లాది ప్రజల విశ్వాసం. వారిని చేరుకోవడానికి దానిని మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు. జనానికి అర్థమయ్యే భాష, జనం విశ్వాసాలను ఒక మాధ్యమంగా చేసుకోవాలి. అది లేనప్పుడు ప్రజలు పార్టీలకు దూరం అవుతారు. నాకు ఏ వామపక్ష పార్టీలోనూ సభ్యత్వం లేదు. జనం సమస్య ఆధారంగా కమ్యూనిస్టుల రాజకీయ ఎత్తుగడ ఉండాలని 2009లోనే చెప్పాను. 14 ఏళ్లయినా కమ్యూనిస్టులకు ప్రజాదరణ లేదు. మార్పుకు తగ్గట్టు నిలబడితే తప్పకుండా కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉంటుంది.  


నేనే ముఖ్యమంత్రినైతే..

తెలుగుదేశం అభిమానులకు జగన్‌ను తిడితేనే రుచిస్తుంది. అప్పుడే వాళ్లకు తటస్థంగా ఉన్నట్లు. వైఎస్సార్‌సీపీ అభిమానులకు చంద్రబాబును తిడితేనే నచ్చుతుంది. అలా చేస్తేనే వారి దృష్టిలో నేను తటస్థంగా ఉన్నట్లు. చూసేవాళ్లు తటస్థంగా ఉంటే నేను తటస్థుడినా.. కాదా తెలుస్తుంది. నేను తటస్థ వాదిని కాదు.. స్వతంత్ర వాదిని. చంద్రబాబు అయినా, కేసీఆర్‌ అయినా, జగన్‌ అయినా.. నేను ఏది నిజమని నమ్మితే అదే చెబుతాను. ఉదాహరణకు ఏపీలో ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టడాన్ని తప్పు అని చెప్పాను.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టాను. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీకి ఇవ్వడం తప్పన్నాను. కొంతమంది నేను బీజేపీని ఎక్కువగా ప్రశ్నిస్తున్నానని అంటున్నారు. అధికారంలో ఉన్న వారినే కదా ప్రశ్నిస్తారు. రాజకీయాల్లో అన్నింటినీ కలిపి ఒక అంచనాకు రావడం సరికాదు. ఒక్కో విధానం, అంశం ప్రాతిపదికన విశ్లేషించాలి. ఉదాహరణకు తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్యకు 10కి 2 మార్కులు వేస్తాను. రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్‌ సరఫరాకు 10కి 10 మా ర్కులు వేస్తా.  దళితబంధు కంటే.. 5వేల మంది యువతను గుర్తించి, వారికి ఐటీ రంగంలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తే.. ఎక్కువ మేలు జరుగుతుందని నా నమ్మకం. అలా అని నేను దళితబంధుకు వ్యతిరేకం కాదు. నేనే ముఖ్యమంత్రినైతే ఆ డబ్బును ఎలా వాడతారని అడిగి తే.. ప్రతి దళిత బిడ్డకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అంతర్జాతీయ స్కూల్‌ స్థాయిలో చదువు చెబుతాను. వాళ్లకు ఆరోగ్యం, నైపుణ్యం, పౌష్టికాహారం ఇస్తాను. వాళ్లు సొంత కాళ్లపై నిలబడేలా చూస్తాను. వారు పారిశ్రామికవేత్తలైతే మరో 10 మందికి ఉగ్యోగాలిస్తారు.


పేర్లు మారిస్తే రాజకీయ ప్రయోజనం శూన్యం

అమరావతి విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించాడని అన్నా. అమరావతిని మార్చి మూడు రాజధానులు చేయడం సరైనది కాదనీ అన్నా. సమస్యేమిటంటే.. అమరావతి రాజధానిని చంద్రబాబు మోడల్‌గా టీడీపీ ప్రచారం చేశాక.. జగన్‌ ముట్టుకుంటాడని నేననుకోవడం లేదు. రాజధానిని మార్చాల్సిన అవసరం లేదు. అలాగే ఏపీలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చడం వల్ల రాజకీయంగా ప్రయోజనం వస్తుందనుకోను. కావాలనుకుంటే ప్రతి బస్తీలో వైఎ్‌సఆర్‌ క్లినిక్‌ పెట్టండి. ప్రతి వాడలో వైఎ్‌సఆర్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రం పెట్టండి. వచ్చిన ప్రతి ఒక్కరూ వైఎ్‌సఆర్‌ను తలచుకుంటారు. రాజశేఖర్‌రెడ్డి రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఏ పథకానికైనా ఆయ న పేరుందా..? అన్నింటికీ రాజీవ్‌, ఇందిర పేర్లే పెట్టా డు. అయినా గెలిచాడు కదా. రాజశేఖర్‌రెడ్డి ప్రభావం వల్ల జగన్‌రెడ్డి కూడా గెలిచాడు కదా. ప్రజలు పేర్లతో గుర్తుంచుకోరు.. హృదయాల్లో గుర్తు పెట్టుకుంటారు. కంచ ఐలయ్య వైశ్యులపై రాసిన పుస్తకం సరికాదని అందరికన్నా ముందు మందకృష్ణ అన్నారు. సమాజాన్ని మార్పు వైపు తీసుకెళ్లాలి తప్ప విద్వేషాల వైపు కాదు. బ్రాహ్మనిజంపై పోరాడిన సంఘ సంస్కర్తల్లో చాలా మంది బ్రాహ్మణులే. బ్రాహ్మణులు వేరు బ్రాహ్మనిజం వేరు’’ అని నాగేశ్వర్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-26T08:50:18+05:30 IST