ఓట్ల కోసం తాయిలాల సంస్కృతి దేశానికి ప్రమాదకరం : Narendra Modi

ABN , First Publish Date - 2022-07-16T20:41:22+05:30 IST

ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి (freebies culture) దేశాభివృద్ధికి

ఓట్ల కోసం తాయిలాల సంస్కృతి దేశానికి ప్రమాదకరం : Narendra Modi

న్యూఢిల్లీ : ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి (freebies culture) దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేరి గ్రామంలో నాలుగు లేన్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే (Bundelkhand Expressway)ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో శనివారం ఆయన మాట్లాడారు. 


ఉత్తర ప్రదేశ్‌లో రహదారుల అనుసంధానం లేకపోవడానికి కారణం గత ప్రభుత్వాలేనని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ BJP ప్రభుత్వాలు ఉన్నాయని, ఇవి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలని అన్నారు. అనుసంధానం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రాష్ట్రం గొప్పగా పరివర్తన చెందుతోందన్నారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల చిత్రకూట్-ఢిల్లీ మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో మూడు నుంచి నాలుగు గంటల సమయం ఆదా అవుతుందని తెలిపారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల కలిగే ప్రయోజనాలు అంతకన్నా ఎక్కువ అని వివరించారు. 


ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం వాహనాల వేగాన్ని పెంచడం మాత్రమే కాకుండా యావత్తు బుందేల్‌ఖండ్‌లో పారిశ్రామిక అభివృద్ధి పుంజుకుంటుందని తెలిపారు. తాయిలాల సంస్కృతి దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని చెప్పారు. ప్రజలు, మరీ ముఖ్యంగా యువత తాయిలాల సంస్కృతి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adithyanadh) నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్ గొప్పగా పరివర్తన చెందుతోందన్నారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని, రహదారుల అనుసంధానం వేగంగా మెరుగుపడుతోందని చెప్పారు. గతంలో వీటి పరిస్థితి ఎలా ఉండేదో ఓసారి గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉత్తర ప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. తాము కేవలం వర్తమానం కోసం నూతన సదుపాయాలను సృష్టించడం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల గుండా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. దీనికి రూ.14,850 కోట్లు ఖర్చయింది. 2020 ఫిబ్రవరిలో దీనికి మోదీ శంకుస్థాపన చేశారు. 28 నెలల్లో దీని నిర్మాణం పూర్తయింది. 


Updated Date - 2022-07-16T20:41:22+05:30 IST