HYD : పోలీస్‌ ‘కోచింగ్‌’ సెంటర్లు.. 13 కేంద్రాలు.. 13, 600 మంది అభ్యర్థులు

ABN , First Publish Date - 2022-05-16T15:03:56+05:30 IST

ఖాకీ డ్రెస్‌.. చేతిలో లాఠీ.. చాలా మందికి ఓ కల.. పోలీస్‌ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో..

HYD : పోలీస్‌ ‘కోచింగ్‌’ సెంటర్లు.. 13 కేంద్రాలు.. 13, 600 మంది అభ్యర్థులు

  • ప్రీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణకు విశేష స్పందన
  • ఒక్కో అభ్యర్థిపై రూ. 10వేలకు పైగా ఖర్చు
  • 12 సబ్జెక్టులు, 2500 పేజీల మెటీరియల్‌ ఉచితం

ఖాకీ డ్రెస్‌.. చేతిలో లాఠీ.. చాలా మందికి ఓ కల.. పోలీస్‌ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ప్రయత్నించే వారెందరో. అలాంటి వారికి ప్రీ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ పెట్టి.. అర్హత సాధించిన వారికి ట్రై కమిషనర్‌రేట్‌ పోలీసులు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రీ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు వేల సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.


హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ (Hyderabad), రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్స్‌ పరిధిలో మొత్తం 13 కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు 13,633 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ (Free Coaching) ఇస్తున్నారు.


రాచకొండలో 2 వేల మంది..

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం ఐదు సెంటర్ల ను ఏర్పాట్లు చేసి రెండు వేల మందికి శిక్షణ అందిస్తున్నారు. మొత్తం 12 సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తున్నారు. 2500 పేజీల స్టడీ మెటీరియల్‌ను అభ్యర్థులకు ఉచితంగా అందించారు. గతంలో జరిగిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ సమయంలో రెండు సార్లు ఉచిత కోచింగ్‌ను అందించిన రాచకొండ పోలీసులు 2000 మందికి పైగా అభ్యర్థులు పోలీస్‌ కొలువులు సాధించేందుకు కృషి చేశారు. కోచింగ్‌ సెంటర్లను సీపీ మహేష్‌ భగవత్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఉదయం స్నాక్స్‌, టీ సమకూర్చుతున్నారు. 


జోన్‌కు ఒకటి..

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒక్కో జోన్‌కు ఒక్కో సెంటర్‌ చొప్పున మొత్తం 5 కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 7,133 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో అభ్యర్థిపై రూ. 10 వేలకు పైగా ఖర్చు చేస్తున్న అధికారులు.. తొమ్మిది సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తున్నారు. మెటీరియల్‌ను (Material) కూడా ఉచితంగా అందిస్తున్నారు.


సైబరాబాద్‌లో 4,500 మంది.. 

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి శంషాబాద్‌, బాలానగర్‌, మాదాపూర్‌ జోన్‌లలో మొత్తం మూడు కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 4500 మంది అభ్యర్థులు ఉచితంగా కోచింగ్‌ తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిభావంతులైన అధ్యాపకులతో మూడు నెలలపాటు శిక్షణ అందిస్తారు. ప్రతి సెంటర్‌ను ఆ జోన్‌ ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో అభ్యర్థిపై నెలకు రూ. 10 వేల నుంచి 15 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-16T15:03:56+05:30 IST