ఇచ్ఛాపురంలో యమ ‘కంకరు’లు!

ABN , First Publish Date - 2022-07-21T05:11:55+05:30 IST

ఇచ్ఛాపురం పట్టణంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పీర్ల కొండ చుట్టూ కంకర, మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొండను తొలచి మరీ తరలించేస్తున్నారు. భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగతున్న నేపథ్యంలో కంకర, మట్టికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ట్రాక్టరు లో

ఇచ్ఛాపురంలో యమ ‘కంకరు’లు!
పీర్ల కొండ వద్ద కంకర తవ్వకాలు చేపట్టిన దృశ్యం

పీర్ల కొండ చుట్టూ తవ్వకాలు

యథేచ్ఛగా కంకర, మట్టి తరలింపు

చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు

రెచ్చిపోతున్న అక్రమార్కులు

(ఇచ్ఛాఫురం)

ఇచ్ఛాపురం పట్టణంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పీర్ల కొండ చుట్టూ కంకర, మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొండను తొలచి మరీ తరలించేస్తున్నారు. భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగతున్న నేపథ్యంలో కంకర, మట్టికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ట్రాక్టరు లోడు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ పలుకుతుండడంతో అక్రమార్కులు ఇదో లాభసాటి మార్గంగా ఎంచుకున్నారు. ముఖ్యంగా రత్తకన్న వైపు జోరుగా తవ్వకాలు సాగుతున్నాయి. ఇదో మాఫియాలా విస్తరించింది. ప్రస్తుతం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. దీంతో కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ట్రాక్టర్లు, లారీల యజమానులతో కుమ్మక్కై దందాను కొనసాగిస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాత్రిపూట తరలింపు కొనసాగుతోంది. యంత్రాలను మొహరించి 50 వరకూ ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొండలు, గుట్టల్లో కంకర, మట్టి తవ్వకాలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. లేకుంటే అది చట్టరీత్యా నేరం. కానీ పీర్ల కొండ చుట్టూ జరుగుతున్న తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే జాతీయ రహదారి విస్తరణ పనులకంటూ అక్రమార్కులు కొత్త ఎత్తుగడ వేశారు. దాని మాటున వందలాది కంకర, మట్టి లోడ్లను తరలిస్తున్నారు. వెంచర్లు ఆధునీకరించే పనులకు వినియోగిస్తున్నారు. 

వ్యవసాయేతర భూములుగా..

వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం చాలావరకూ నిబంధనలు విధించింది. కానీ అవేవీ కానరావడం లేదు. ఇచ్ఛాపురం మునిసిపాల్టీతో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను చదును చేసి ప్లాట్లుగా విభజిస్తున్నారు. వాస్తవానికి ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుఉడు సర్వేయర్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు అందిస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే అనుమతులిస్తారు. అర ఎకరానికి మించి ఉంటే దానిని తప్పకుండా ఆర్డీవో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సెంట్లలో ఉన్న భూమిని కన్వర్షన్‌ ద్వారా గజాలుగా మార్చాల్సి ఉంటుంది. ఇందుకుగాను అధికంగా ఖర్చవుతుంది. ప్రభుత్వానికి సర్వీసు చార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇవేవీ చేయకుండానే వెంచర్లుగా మార్చుతున్నారు. వీటిని మార్చే క్రమంలో కంకర, మట్టి అవసరముంటుంది. అందుకే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు యథేచ్ఛగా మట్టి, కంకర తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

చర్యలు తీసుకుంటాం

అనుమతులు లేకుండా కంకర, మట్టి తవ్వకాలు నేరం. పీర్ల కొండ చుట్టూ తవ్వకాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే నిఘా పెంచాం. సిబ్బందిని పంపించి కంకర తవ్వకాలను గుర్తిస్తాం. బోర్డులు ఏర్పాటుచేస్తాం. నిబంధనలు మీరి ఎవరైనా తవ్వకాలు చేపడితే కేసులు నమోదుచేస్తాం.

-లావణ్య, తహసీల్దారు, ఇచ్ఛాపురం  




Updated Date - 2022-07-21T05:11:55+05:30 IST