ఉచితం–అనుచితం

ABN , First Publish Date - 2022-01-26T06:58:30+05:30 IST

ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభపెడుతూ రాజకీయపార్టీలు ‘ఉచిత’ వాగ్దానాలను గుప్పించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రసమస్యగా భావించడం సరైనదే. అధికారంకోసం ఓటర్లను ఉచితాల...

ఉచితం–అనుచితం

ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభపెడుతూ రాజకీయపార్టీలు ‘ఉచిత’ వాగ్దానాలను గుప్పించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రసమస్యగా భావించడం సరైనదే. అధికారంకోసం ఓటర్లను ఉచితాలవర్షంలో రాజకీయపార్టీలు ముంచెత్తుతున్న స్థితిని నిలువరించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై మంగళవారం సర్వోన్నతన్యాయస్థానం ఘాటుగా స్పందించింది. బీజేపీ నేత అశ్విన్ కుమార్ తన పిటిషన్ లో తన పార్టీ ఊసెత్తకుండా యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఆచరణసాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను వంచిస్తున్నాయని ఆగ్రహించారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం కోసం ఎప్పటికీ హామీలుగానే మిగిలిపోయే వాగ్దానాలు చేసిన పార్టీల గుర్తింపు రద్దుచేయాలన్నది ఈ నాయకుడి వాదన. కొన్ని రాష్ట్రాలను, కొన్ని పార్టీలను మాత్రమే పేర్కొన్న పిటిషన్ దారు ఉద్దేశాలను ప్రశ్నించి, దేశంలోని అన్ని రాజకీయపార్టీలనూ ప్రతివాదులుగా చేరుస్తున్నట్టు ఆయన చేతనే అనిపించి సుప్రీంకోర్టు మంచిపనిచేసింది. 2014 ఎన్నికల సందర్భంలో విదేశాల్లో దాగిన భారతీయ కుబేరుల నల్లధనాన్ని తవ్వితీసి ఈ దేశంలోని ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలోనూ 15వేల రూపాయల చొప్పున వేస్తానని అప్పుడెప్పుడో నరేంద్రమోదీ ఇచ్చిన హామీని సామాజిక మాధ్యమాల్లో కొందరు ఈ బీజేపీ నాయకుడికి గుర్తుచేస్తున్నారు.


ఈ మధ్యన తమిళనాడు ఎన్నికల సందర్భంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన శరవణన్ అనే ఓ యువకుడు తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నడూ వినని హామీలు ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో కోటిరూపాయలు, మూడంతస్థుల బంగ్లా, పార్కింగ్ సదుపాయంతో సహా ఓ హెలికాప్టర్, ఓ మరపడవ, ఇంటిపని చక్కగా చేసిపెట్టే ఓ రోబో, చంద్రుడిమీదకు అడపాదడపా ఉచిత ట్రిప్పులు, మొత్తం నియోజకవర్గాన్నే చల్లగా ఉంచే ఓ కృత్రిమ మంచుపర్వతం... ఇలా చాలా పెద్ద జాబితా ప్రకటించాడు ఆ అభ్యర్థి. తమిళనాడులో ఉచితాలు హద్దులు దాటుతున్నందున జనాన్ని అప్రమత్తం చేయాలన్నది తన లక్ష్యమన్నాడు. తమిళనాడే కాదు, దేశమంతా ఇదే స్థితి ఉన్నది కనుకనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంది. హేతుబద్ధతలేని ఉచితాలను నియంత్రించడానికి పార్టీలతో సమావేశాలు నిర్వహించి, మేనిఫెస్టోల రూపకల్పనకు మార్గదర్శకాలు తయారుచేయమని ఎనిమిదేళ్ళక్రితమే ఎన్నికల సంఘానికి చెప్పిన విషయాన్నీ, రాజకీయపార్టీలతో ఒకేఒక్క మీటింగ్ పెట్టడం వినా ఆ తరువాత ఈసీ ఏమీచేయలేదన్నదీ కూడా న్యాయస్థానం గుర్తుచేసుకుంది. ఉచిత హామీల బడ్జెట్ అసలు బడ్జెట్‌ను మించిపోతున్నదని కూడా వ్యాఖ్యానించింది. 


ఏ లక్ష్యంతో పిటిషన్ దారు దీనిని దాఖలు చేసినప్పటికీ, ప్రస్తావించిన అంశాలు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా తీవ్రమైనవే. అర్థపర్థంలేని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వస్తే కొన్నింటిని అమలు చేసే ప్రయత్నంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేయడం పార్టీలకు అలవాటైపోయింది. ఉచితం అని ప్రకటించడమంటే ఓటరుకు లంచం ఇవ్వడమేననీ, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాల్లో కూడా ఈ ఉచితాల పోటీ నడుస్తోందనీ, ప్రతీ పౌరుడి నెత్తినా మూడు లక్షల రూపాయల అప్పున్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నదనీ అంటున్నాడు పిటిషనర్. 


బ్యాంకు ఖాతాల్లో నగదు, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు, స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు, ల్యాప్ టాప్ లు ఇలా దాదాపు ప్రతిరాష్ట్రంలోనూ ఎన్నికల సందర్భంలో ఇటువంటి హామీలు అనేకం వినబడుతూనే ఉన్నాయి. పంజాబ్ లో ఆయా రాజకీయపార్టీలు ఇచ్చిన ఉచితాల విలువ రాష్ట్ర ఆదాయానికి అనేక రెట్లు దాటిపోయిందట. ఎన్నికల సంఘం, కేంద్రం నాలుగువారాల్లో ఏ సమాధానం చెబుతాయన్నది అటుంచితే, విస్తృత సామాజిక ప్రయోజనం లేని వాటికి ప్రజల సొమ్మును ధారపోసే పార్టీల ధోరణికి అతివేగంగా అడ్డుకట్టపడాల్సిన అవసరం ఉంది. హామీలు హేతుబద్ధంగా ఉండటం, వాటికయ్యే ఖర్చు ఎక్కడనుంచి ఏ రూపంలో తెస్తారో చూపమనడం వంటివి అమలుజరిగితే రాజకీయపార్టీలు కొంతమేరకు అదుపులో ఉంటాయి.

Updated Date - 2022-01-26T06:58:30+05:30 IST