గో‘మాత’

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

‘రాధా సురభి గోశాల’ ప్రారంభించి... రెండున్నర వేలకు పైగా ఆవులకు ఆవాసం కల్పించారు. నిస్వార్థ సేవకు ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న ఫ్రెడరిక్‌ బ్రూనింగ్‌ ప్రస్థానం ఇది...

గో‘మాత’

జీవిత పరమార్థాన్ని వెతుక్కొంటూ ఆమె జర్మనీ నుంచి భారత్‌కు వచ్చారు. గురువు ఉపదేశంతో ఆధ్యాత్మిక బాట పట్టారు. రక్తం ఓడుతూ కదలలేని పరిస్థితిలో ఉన్న ఓ ఆవు దూడను చూసి చలించిపోయారు. అది మొదలు ఏ దిక్కూ లేని ఆవులకు అమ్మయ్యారు. ‘రాధా సురభి గోశాల’ ప్రారంభించి... రెండున్నర వేలకు పైగా ఆవులకు ఆవాసం కల్పించారు. నిస్వార్థ సేవకు ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న ఫ్రెడరిక్‌ బ్రూనింగ్‌ ప్రస్థానం ఇది... 

 

ఫ్రెడరిక్‌ బ్రూనింగ్‌... ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ సుదేవి మాతాజీగా ఆమె సుపరిచితురాలు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఆ పేరు మారుమోగుతుంది. దాదాపు నలభై ఏళ్ల కిందట, 19 సంవత్సరాల వయసులో సత్యాన్వేషణలో భాగంగా జర్మనీ నుంచి భారత్‌కు వచ్చారు ఫ్రెడరిక్‌. ఉపఖండంలోని ఆధ్యాత్మిక, సంస్కృతీ సంప్రదాయాలపై ఆమెకు ఎనలేని మక్కువ. తన పయనం ఎటు అనే ప్రశ్నకు భగవద్గీతలో ఆమెకు సమాథానం దొరికింది. అయితే గీత చూపిన దారిలో నడవడానికి ఒక గురువు కావాల్సి వచ్చింది. ఎవరా గురువు? ఎక్కడ ఉంటారు? అన్వేషణ మొదలుపెట్టారు. చివరకు ఆమె ప్రయత్నం ఫలించింది. మథుర సమీపంలోని రాధాకుండ్‌లో తిన్‌ కోరి బాబాను కలిశారు. 


ఆధ్యాత్మిక మార్గంలో... 

బాబా దర్శనంతో ఫ్రెడరిక్‌ అన్వేషణ ముగిసింది. ఆయన మార్గదర్శనంలో ఆమె ఆధ్యాత్మిక అంశాలెన్నిటినో తెలుసుకున్నారు. భారతీయతలోని గొప్పదనాన్ని అర్థం చేసుకున్నారు. గురువు నుంచి మంత్ర దీక్ష స్వీకరించారు.  నాటి నుంచి ఫ్రెడరిక్‌ బ్రూనింగ్‌... సుదేవి మాతాజీగా మారారు. అయితే దాదాపు ఇరవై ఏళ్ల కిందట కంటపడిన ఓ దృశ్యం... ఆమె ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ‘‘మా గ్రామం బయట ఒక ఆవు దూడ తీవ్ర గాయాలతో నెత్తురు కారుతూ పడివుంది. వెనక కాళ్లు విరిగిపోయాయి. ఈగలు ఆ గాయాలను తొలిచేస్తున్నాయి. ఆ హృదయవిదారక దృశ్యం చూసి నా కళ్లు తిరిగాయి. దూడను తీసుకువెళ్లి వైద్యం చేయించాను. ఆ రోజే అర్థమైంది... జీవితంలో నేను చేయాల్సింది ఎంతో ఉందని’’ అంటారు సుదేవి. 


గోశాలకు శ్రీకారం... 

ఆ భయానక ఘట్టంతో ఆమె పయనం కొత్త మలుపు తీసుకుంది. మథురలో ‘రాధా సురభి గోశాల’కు అంకురార్పణ జరిగింది. వీధుల్లో తిరిగేవి, గాయపడినవి, అనారోగ్యంతో బాధపడుతున్నవి... కంట పడిన ఆవులు, దూడలన్నింటినీ తెచ్చి గోశాలలో ఆశ్రయం కల్పించారు సుదేవి. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గోశాల చిన్నదైంది. దీంతో మరో విశాలమైన ప్రాంతానికి దాన్ని మార్చారు. ఇప్పుడు అక్కడ రెండున్నర వేలకు పైగా ఆవులు, దూడలు హాయిగా జీవిస్తున్నాయి. ‘‘మా దగ్గరకు రోజుకు ఐదు నుంచి పదిహేను గోవులు వస్తుంటాయి. అవసరమైనవాటికి వైద్య చికిత్స అందిస్తాం. మందులు, ఆహారం, లేదా చికిత్సకయ్యే ఖర్చు... ఇలా నిత్యం ఎవరికి తోచింది వారు ఇచ్చిపోతుంటారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆవులను మరో గోశాలకు పంపిస్తాం. ఇప్పటి వరకు 20 వేలకు పైగా గోవులను రక్షించాం’’ అంటూ చెప్పుకొచ్చారు ఆమె. గోవులే కాకుండా కబేళాల నుంచి రక్షించిన గేదెలు, గుర్రాలు, గాడిదలు కూడా ఈ గోశాలలో ఉన్నాయి. 


కరోనా కష్టకాలంలోనూ... 

భారీ సంఖ్యలో ఆవులను పోషించడమంటే సాధారణ విషయం కాదు. అదీ కరోనా కష్ట కాలంలో అంత పెద్ద గోశాల నిర్వహించడం తలకు మించిన భారం. అయినా సుదేవి వెనుకంజ వేయలేదు. ‘‘ఆరంభంలో మా అమ్మా నాన్న ఇచ్చిన డబ్బుతో గోశాల నడిపేదాన్ని. రాను రాను గోవుల సంఖ్యతో పాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. గోశాల అధికశాతం దాతల చందాలతోనే నడుస్తుంది. కానీ కరోనా వల్ల వచ్చే నిధులు ఆగిపోయాయి. గింజ గింజకూ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆవులను మేపడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడ్డాను. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ‘డొనేట్‌ కార్ట్‌’ అనే క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా దాదాపు కోటిన్నర రూపాయలు సమకూరాయి. ఆ డబ్బే కరోనా కాలంలో గోశాలను ఆదుకుంది’’ అంటారు సుదేవి. 




పిల్లలకు చదువు... 

గోవుల గురించే కాకుండా ఆ గ్రామంలో ఉండే పేద పిల్లలకూ అండగా నిలుస్తున్నారు సుదేవీ మాతాజీ. బడి అంటే తెలియనివారికి ఆమే విద్యాబుద్ధులు చెబుతున్నారు. వాళ్లు ఎంతో తెలివైన వారని, సాన పెడితే మెరికల్లా తయారవుతారని అంటారు ఆమె. సుదేవి నిరంతర సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అధికశాతం మంది ఆవులు, గేదెలను ఒక ఆదాయ వనరుగానే చూస్తున్నారని, వాటి వల్ల ఇక ఉపయోగం లేదనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా బయటకు తోలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారామె. ఈ తీరు మారాలంటున్న సుదేవి మాతాజీ... భవిష్యత్తులో మరిన్ని పశువులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.



Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST