ఓటు బ్యాంకుల వంచనా శిల్పం

ABN , First Publish Date - 2021-07-07T06:02:55+05:30 IST

మనరాజకీయవేత్తలు చెలాయించే అధికారాలకు అవధులు లేవు. అయితే మన జీవితాలలో సువ్యవస్థిత మార్పులకు అవి ఏమైనా దోహదం చేస్తున్నాయా? చేయడం లేదన్నది ఎవరూ...

ఓటు బ్యాంకుల వంచనా శిల్పం

మనరాజకీయవేత్తలు చెలాయించే అధికారాలకు అవధులు లేవు. అయితే మన జీవితాలలో సువ్యవస్థిత మార్పులకు అవి ఏమైనా దోహదం చేస్తున్నాయా? చేయడం లేదన్నది ఎవరూ ఎవరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేని సమాధానం. మన సమాజంలో, దేనినైనా సరే తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు రాజకీయవేత్తలే. పంచాయత్ నుంచి పార్లమెంటు వరకు వారిని ఎన్నుకునే ప్రజలకు శూన్య హస్తాలు, శుష్కవాగ్దానాలే దక్కుతున్నాయి! 


మన సమాజంలోని సకల సామాజికవర్గాలు, ముఖ్యంగా అణగారిన సమూహాల సంక్షేమం, అభ్యున్నతి విషయమై ఒక మహాదార్శనికుని ఆలోచనలనే తీసుకోండి. బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆయన ప్రతి ఆలోచనా సమానత్వం, విమోచన చుట్టే పరిభ్రమించింది. శతాబ్దాల వెనుకబాటుతనం నుంచి బడుగుప్రజలకు విముక్తి, ఎటువంటి మినహాయింపులు లేకుండా అందరికీ సమానావకాశాలు సమకూరడం ద్వారానే దేశం అభివృద్ధి చెంది సంపద్వంతమవుతుందని భారత రాజ్యాంగ నిర్మాత భావించారు. మరి ఆయన ఆలోచనలను మన రాజకీయవేత్తలు తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎలా మార్చుకున్నారో చూడండి. 


సామాజికంగా అట్టడుగువర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని అంబేడ్కర్ నిర్దేశించారు. సమాజంలో తమకు ఎదురవుతున్న వివక్షను అధిగమించి ప్రతి ఒక్కరితో సమానంగా, హుందాతో సహజీవనం చేయగలిగేందుకు బలహీనవర్గాల వారికి రిజర్వేషన్లు అవసరమని ఆయన గట్టిగా విశ్వసించారు. విద్యావంతులై ఆర్థిక స్వావలంబన సాధించిన బడుగులు ఉన్నత వర్గాల వారితో కలిసి సమాజ సమష్టి సంక్షేమానికి తోడ్పడుతారని భావించారు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని ఆయన ఆశించారు. సకల దురన్యాయాల నుంచి బయటపడి జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ‘కింది స్థాయి’ వారిని ఉన్నతవర్గాల వారు తమ సహ, సమాన పౌరులుగా అంగీకరించి , గౌరవించడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు విలసిల్లుతాయని ఆయన భావించారు. 


అయితే స్వతంత్ర భారతదేశంలో రాజకీయవేత్తలు మొదటి నుంచీ రిజర్వేషన్ల అంశాన్ని తమ స్వీయ కోణం నుంచే చూశారు. తమకు ఓటుబ్యాంకులను సృష్టించే విధంగా మాత్రమే రిజర్వేషన్లను అమలుపరిచేందుకు వారు శ్రద్ధ చూపారు. బడుగువర్గాల వారి జీవితాలలో నిజమైన అభ్యున్నతి జరిగితే తమకు ఓటుబ్యాంకులు లేకుండా పోతాయని వారు భయపడ్డారు. దళితులకు విద్యారంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఉత్కృష్ట బోధనాప్రమాణాలు, నవీన సదుపాయాలు గల పాఠశాలలను నెలకొల్పి అభివృద్ధిపరచడాన్ని అలక్ష్యం చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదవడం అనేది దళితులకు అనివార్యమై పోయింది. ఈ పాఠశాలలను సరైన విధంగా నిర్వహించడంపై ఎవరూ శ్రద్ధ చూపలేదు. అయినా ప్రతిభావంతులైన అతి కొద్దిమంది మంది దళితబాలలు ప్రభుత్వ పాఠశాలల ద్వారానే ఉన్నతస్థితికి చేరుకోగలిగారు. అత్యధిక దళితబాలల జీవితాలలో మౌలికమార్పులకు ప్రభుత్వ పాఠశాలలతో దోహదం జరగలేదు. అయితేనేం రిజర్వేషన్ల పేరుతో దేశ జనాభాలో 15శాతం మందిని తమ ఓటుబ్యాంకుగా చేసుకోవడంలో రాజకీయవేత్తలు సఫలమయ్యారు.


అగ్రకులాలు, సంపన్న కుటుంబాల బాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేయవలసిన అవసరం లేదు. ఆ పాఠశాలలోని వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకోవలసిన అవసరం వారికి లేదు. వారి కోసమే ప్రత్యేకంగా పబ్లిక్ స్కూల్స్, ఇంకా అటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. నేను విద్యాభ్యాసం చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రతి తరగతిలోనూ ఒకటి రెండు సీట్లు బడుగువర్గాల వారికి రిజర్వ్ చేస్తారు. ఆ విద్యార్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తారు. అయితే కాయకష్టమే జీవనాధారంగా గల తల్లిదండ్రులను చూస్తున్న ఆ పేద బాలలు తమ భావిజీవితాలను కూడా అదేరీతిలో ఊహించుకోవడం కద్దు. ఆ జీవనానికే వారు సిద్ధమవుతారు. విద్యావ్యాసంగాలు వారికి కొత్త. మరి ప్రభుత్వ ఉదారతతో పాఠశాలల్లో చేరిన ఆ బాలలు చదువుపై చూపవలసిన శ్రద్ధ చూపకపోవడం కద్దు. చాలామంది విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపి వేయడం కూడా ఒక సాధారణ పరిణామంగా మారింది. అటువంటి బాలలు విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా చూడడం ప్రభుత్వ నైతికబాధ్యత. అవును, అది పాలకుల విధ్యుక్తధర్మం. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వంగానీ, రాజకీయవేత్తలు గానీ ఈ విషయమై ఎందుకు శ్రద్ధ చూపుతారు? ఆ అవసరం వారికి లేదు. బడుగువర్గాల వారికి రాజ్యంగం నిర్దేశించిన విధంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆ విద్యావాతావరణంలో ఆ బాలలు పూర్తిగా నిమగ్నమయ్యేలా చేయడంపై వారు నిర్లిప్తంగా వ్యవహరిస్తారు. ఆ విద్యాసంస్థలను ఉన్నత ప్రమాణాలతో నడిపేందుకు వారు కించిత్ శ్రద్ధ కూడా చూపరు. ఫలితంగా బడి మధ్యలోనే మానివేసి కూలీపనులకు వెళ్ళే బాలల సంఖ్య గణనీయంగా ఉండడంలో ఆశ్చర్యమేముంది? 


వెనుకబడినకులాల వారికి కల్పించిన రిజర్వేషన్ల విషయాన్ని చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జాబితాలో 92 కులాలు ఉండేవి. ఆ తరువాత వీటి సంఖ్యను క్రమంగా 138కి పెంచారు. జాబితాలోని తొలి 92 కులాల జీవనస్థితిగతుల విషయమై ఎలాంటి అధ్యయనాలు నిర్వహించలేదు. ఓట్ల సంఖ్యను పెంచేందుకు బీసీ జాబితాలోని కులాల సంఖ్యను పెంచుతూ పోయారు. ఇటువంటి చర్యలు మన రాజకీయవ్యవస్థ పరిమితులను తెలియజేస్తున్నాయి.


ప్రతి దళిత కుటుంబానికీ మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని ఉద్యమ కాలంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. దళితుల జీవనస్థితిగతులను మెరుగుపరిచేందుకు వారికి భూవసతి కల్పించాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏనాడో సూచించారు. అది సత్సంకల్పంతో చేసిన సూచన. మరి నేటి రాజకీయ వేత్త తన ఓటు బ్యాంకులను పెంపొందించుకునేందుకే భూముల పంపిణీపై హామీ ఇస్తున్నాడు. అంటే బాబా సాహెబ్ సూచనను పాక్షికంగా మాత్రమే అమలుపరుస్తున్నాడు. అభివృద్ధి నిమిత్తమే భూ పంపిణీ జరగాలని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. ఆ సూచనను అమలుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే ఒకేచోట 30మంది దళితులకు 100 ఎకరాలు సమష్టిగా సమకూర్చేందుకు శ్రద్ధ చూపాలి. సహకార సేద్యానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిల దొక్కుకునేవరకు అన్నివిధాల అండదండల నందించాలి. ఆర్థికభద్రత సమకూరి, స్వయంసమృద్ధి సాధించిన అనంతరం అందుకు దోహదం చేసిన భూములను విక్రయించే ఆలోచనను ఏ దళితుడూ చేయడు. 


భూమి పంపిణీ చేసి, దాని సాగుకు అవసరమైన సహాయాన్ని అందించనప్పుడు లబ్ధిదారులు వాటి విషయమై ఎంతోకాలం శ్రద్ధ చూపరు. అంతిమంగా భూమిని విక్రయించేందుకే నిర్ణయం తీసుకుంటారు. ఇందుకు రెండు కారణాలను పేర్కొనవచ్చు. తనకు ఇచ్చిన భూమిని సేద్య యోగ్యంగా చేసేందుకు అవసరమైన సాధనసంపత్తి లేకపోవడం; రెండు- ఆ భూమిని విక్రయించి సొమ్ము చేసుకుని ఇతరత్రా ప్రయోజనం పొందాలని భావించడం. ప్రభుత్వం ఇచ్చిన భూమిని అలా విక్రయించుకున్నందుకు లబ్ధిదారుడు పలు అభాండాలకు గురికావలసి వస్తుంది. అయితే రాజకీయవేత్తకు ఇవేమీ పట్టవు. ఎందుకంటే భూ పంపిణీతో అతని ప్రయోజనం నెరవేరింది. లబ్ధిదారులు తన శాశ్వత ఓటుబ్యాంకుగా మారుతారు. అతనికి కావలసింది అదే కదా. 


బడుగుల విముక్తికి తోడ్పడే నిర్మాణాత్మక చర్యలను ఉపేక్షించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రకటించారు. శాసనసభకు ఒక ఉపఎన్నిక జరగనున్న సందర్భంలో ఆయన ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ తరహా రాజకీయాలను వ్యతిరేకించని పక్షంలో డాక్టర్ అంబేడ్కర్ నొక్కిచెప్పిన ‘ఓటుహక్కు’ విమోచన శక్తి మరింతగా బలహీనపడుతుంది.

డాక్టర్ పి. వినయ్ కుమార్ 

చైర్మన్, సామాజిక అధికార వేదిక 

Updated Date - 2021-07-07T06:02:55+05:30 IST