అమెరికన్లే టార్గెట్.. మీ అకౌంట్లు హ్యాకయ్యాయంటూ వారిని భయపెట్టి.. అచ్చు సినిమాలో జరిగినట్టే..

ABN , First Publish Date - 2021-11-24T02:11:02+05:30 IST

అమెరికన్లను ఉచ్చులోకి దింపుతున్న కాల్ సెంటర్ గుట్టురట్టు..!

అమెరికన్లే టార్గెట్.. మీ అకౌంట్లు హ్యాకయ్యాయంటూ వారిని భయపెట్టి.. అచ్చు సినిమాలో జరిగినట్టే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ రోజు అకస్మాత్తుగా ఆ అమెరికన్‌కు ఫోన్ వచ్చింది. అది భారత్‌లోని  కాల్ సెంటర్‌ నుంచి వెళ్లిన కాల్. అవతలి వారు తమని తాము ఆదాయపు పన్నుల శాఖ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. మీరు పన్నుల కింద చాలా మొత్తం బాకీ పడ్డారంటూ అతడిని బెదిరించారు. చెప్పిన మొత్తాన్ని తమకు వెంటనే చెల్లించకపోతే జైలు పాలవుతారని భయభ్రాంతులకు గురి చేశారు. అంతే.. ఆ అమెరికన్ భయపడిపోయి..నేరగాళ్లు కోరిన మొత్తాన్ని చెప్పిన విధంగా చెల్లించాడు. ఇదంతా చదువుతుంటే.. ఇటీవల విడుదలైన మోసగాళ్లు సినిమా గుర్తోస్తోంది కదూ..! కొన్నేళ్ల క్రితం భారత్‌ను కుదిపేసిన ఓ బడా కాల్ సెంటర్ కుంభకోణం ఆధారంగా నిర్మించిన సినిమా ఇది. అయితే.. ఆ సినిమా కథను పోలిన మరో ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.  అమెరికన్లే టార్గెట్‌గా మార్చుకుంటూ డబ్బు దండుకుంటున్న నిందితులను  ముంబై పోలీసులు గత గురువారం అరెస్టు చేశారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేక్ కాల్ సెంటర్ నిర్వహించే కొందరు నిందితులు అమెరికన్లను మోసం చేసి డబ్బు దోచుకున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా ఫోన్లు చేసి..మీ ఈ-కామర్స్ సంస్థల అకౌంట్లు హ్యాకయ్యాయంటూ అనేక మంది అమెరికన్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఇలా వారిని లొంగదీసుకుని, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ కొనిపించారు. ఈ క్రమంలో బాధితులు గిఫ్ట్ కార్డుల కొని చెల్లింపుల కింద పంపించారు. ఆ తరువాత ఈ డబ్బంతా హవాలా మార్గాల్లో ఇండియాకు వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసుల దృష్టి పడటంతో వారు గురువారం రాత్రి నవీ ముంబైలోని ఎయిరోలీ ప్రాంతంలో గల ఓ ఫ్లాట్‌పై రెయిడ్ జరిపి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి పది ల్యాప్‌టాప్‌లు, రౌటర్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. భారత శిక్షాస్మృతి, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ఈ విషయాలను పోలీసులు ఇటీవలే వెల్లడించారు.

Updated Date - 2021-11-24T02:11:02+05:30 IST