విత్తన శత్రువు..!

ABN , First Publish Date - 2020-06-07T10:37:00+05:30 IST

వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతుకు ‘నకిలీ’ భయం వెంటాడుతోంది. గతంలో నకిలీ మిర్చి విత్తనాలు, బీటీ-3 పత్తి విత్తనాల

విత్తన శత్రువు..!

వానాకాలం సాగుకు పొంచి ఉన్న నకిలీ విత్తనాల ముప్పు

రైతులను వెంటాడుతున్న బోగస్‌ విత్తన కంపెనీలు

ప్రముఖ కంపెనీల పేర్లతో మోసం

రంగురంగుల లేబుళ్లతో బురిడీ కొట్టిస్తున్న అక్రమార్కులు

పీడీ యాక్టు ప్రయోగిస్తామంటున్న అధికారులు


ఖమ్మం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతుకు ‘నకిలీ’ భయం వెంటాడుతోంది. గతంలో నకిలీ మిర్చి విత్తనాలు, బీటీ-3 పత్తి విత్తనాల దెబ్బకు చిత్తయిన రైతన్న ఈ యేడాది విత్తనాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నాడు. రైతుల అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు బోగస్‌ కంపెనీల పేరుతో రెచ్చిపోతున్నారు. అథరైజ్డ్‌ డీలర్‌ ధర కంటే తక్కువ రేటుకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ఎక్కువ పాకెట్లు కొనుగోలు చేస్తే తక్కువ రేట్లకే విత్తనాలు ఇస్తామనీ బురిడి కొట్టిస్తున్నారు. డీలర్లకు కూడా భారీ కమీషన్‌ ఆశచూపి ముగ్గులోకి దించుతున్నారు. ఈ మోసాలను అరికట్టేందుకు అధికారులు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుచేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 


ప్రముఖ కంపెనీల లేబుళ్లతో..

 రైతులు మార్కెట్‌లో లభిస్తున్న విత్తనాల్లో ఏది అసలు, ఏది నకిలీ, ఏది బీటీ కనిపెట్టలేక సతమతమవుతున్నారు. అన్ని విత్తనాల కంపెనీల విత్తనాల ప్యాకెట్లు ఒకేలా ఉంటున్నాయి. వాస్తవానికి ఒరిజనల్‌ కంపెనీలకు సంబంధించిన బీటీ విత్తనాలను వ్యవసాయ అధికారులు పరీక్షించిన తర్వాతే వాటిని మార్కెట్లోకి విడుదల చేయడానికి అనుమతించాలి.  అక్రమార్కులు ఆకట్టుకునే రంగుల్లో, ప్రముఖ కంపెనీల లేబుళ్లను ఫ్యాకెట్లపై అతికించి మాయ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ‘పంట వేస్తే పొలంలో గడ్డి మందు కొట్టినప్పుడు మొక్కకు ప్రమాదం ఉండదనీ, పురుగులు, తెగుళ్లు కూడా రావని ప్రచారం చేసి అనుమతుల్లేని బీటీ- 3విత్తనాలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


వ్యవసాయ శాఖ విస్తృత తనిఖీలు

వానాకాలం పంటకు  రైతులు సిద్ధమవుతున్న తరుణంలో జిల్లా వ్యవసాయశాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. జిల్లా నలుమూలల్లో ఎక్కడైనా సంఘటన జరిగితే రైతులు సమాచారం అందించేందుకు, వారికి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా నిఘాను పట్టిష్టం చేశారు. విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు జిల్లాలోని పలు గ్రామాల్లో తిరిగి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. డివిజన్ల వారీగా వ్యవసాయశాఖ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, పోలీసు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పలు దుకాణాలను తనిఖీలు చేస్తున్నారు. రైతులను మోసం చేస్తే పీడీ యాక్టు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. 


సీడ్‌ జర్మినేషన్‌ టెస్టు తప్పనిసరి

రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన అనంతరం సీడ్‌ జర్మినేషన్‌ టెస్టు చేయాలి. దీని వల్ల నకిలీ విత్తనాలు గురించి తెలుస్తుంది. పాలిథిన్‌ షీట్‌పై తడిపిన న్యూస్‌ పేపరును వేసి పాకెట్‌లోని ఒక పది విత్తనాలను తీసుకుని  తడి తొందరగా ఆరిపోని ప్రదేశంలో ఉంచాలి. అలా రెండు రోజుల వరకు ఉంచిన తర్వాత ఆయా విత్తనాల్లో మొలకెత్తిన విత్తనాల ఆధారంగా అవి అసలువా, నకిలీవా అన్న విషయాన్ని గుర్తించవచ్చు. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఆయా డీలర్ల వద్ద జీవోటీ ఉందా లేదా అడిగి తెలుసుకోవాలి.  విత్తనాల పాకెట్లపై ఉన్న తేదీ గడువును సరిచూసుకోవాలి. ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ ఉందా లేదా చూసుకోవాలి. బీటీ-3 విత్తనాలను ప్రభుత్వం ఆమోదించలేదు. ఆయా విత్తనాలను విక్రయించకూడదు. వాటిని కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు. 

Updated Date - 2020-06-07T10:37:00+05:30 IST