రిసార్ట్స్‌ పేరుతో మోసం.. మంత్రుల పేరు చెబుతూ బెదిరింపులు.. కేసీఆర్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-16T17:24:41+05:30 IST

రిసార్టులో డబ్బులు కట్టి మోస పోయిన న్యాయవాది కుటుంబం హైదరాబాద్‌కు

రిసార్ట్స్‌ పేరుతో మోసం.. మంత్రుల పేరు చెబుతూ బెదిరింపులు.. కేసీఆర్‌కు ఫిర్యాదు
నిందితుడు నవీన్ రెడ్డి

  • సీఎం కేసీఆర్‌, డీజీపీ, హెచ్చార్సీలో బాధితుల ఫిర్యాదు


హైదరాబాద్/అడ్డగుట్ట : రిసార్టులో డబ్బులు కట్టి మోస పోయిన న్యాయవాది కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే సంస్థ ప్రతినిథులు టీఆర్‌ఎస్‌ మంత్రుల పేరు చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు సీఎం కేసీఆర్‌ పేషీ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధుసూదన్‌ బాబు న్యాయవాది, ప్రస్తుతం పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. 


2020, జనవరి 29న విజయవాడలోని సీవీఆర్‌ చాంబర్‌లో ఉన్న ఫిసూన్‌ హాలీడేస్‌ కంపెనీ నుంచి టెలికాలర్‌ ద్వారా ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీకు కూపన్‌ వచ్చింది, తక్కువ డబ్బులు చెల్లించి రిసార్ట్‌లో చేరితే మీకు 30ఏళ్ల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. దాంతో మధుసూదన్‌ బాబు తన భార్య దుర్గమ్మ పేరుతో రూ. 3.60 లక్షలు చెల్లించాడు. లాక్‌డౌన్‌ రావడంతో ఏడాది ఆలస్యం అయింది. లాక్‌డౌన్‌ సడలింపు తరువాత ఆర్నేళ్ల క్రితం తీసుకున్న డబ్బు విషయం అడగడానికి వెళితే రిసార్ట్‌ లేదని నిర్వాహకులు చెప్పారు. సంస్థకు చెల్లించిన డబ్బులు ఇవ్వమని అడిగితే సమాధానం ఇవ్వలేదని వారు వాపోయారు. ఈ సంస్థకు సూత్రధారి నిమ్మల నవీన్‌రెడ్డితో పాటు నాగిరెడ్డి, వెంకటరత్నం నల్గొండలో ఉంటారు.


ఫోన్‌ ద్వారా డబ్బు విషయం అడిగితే చంపేస్తామని తరుచూ నాగిరెడ్డి బెదిరిస్తుండడంతో, మధుసూదన్‌ దంపతులు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేషీ, డీజీపీ పేషీ, రెవెన్యూ విజిలెన్స్‌, ఇన్‌కం టాక్స్‌, హెచ్చార్సీలను ఆశ్రయించాడు. తన భార్య దుర్గమ్మ పేరుతో రిసార్ట్స్‌కు డబ్బు చెల్లించానని వెంటనే తన డబ్బు ఇప్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ సంస్థ ప్రతినిధులు నల్గొండలో ఉండడంతో నేరుగా నల్గొండ ఎస్సీ కి కూడా ఫిర్యాదు చేశాడు. తరుచూ చంపేస్తానంటూ బెదిరింపులు రావడంతో వారం రోజుల పాటు హైదరాబాద్‌లో తలదాచుకున్నారు. నకిలీ రిసార్ట్‌ పేరుతో తమని మోసం చేశారని తనలాంటి వాళ్లు వందల మంది ఉన్నారని ఆయన చెప్పారు.

Updated Date - 2021-04-16T17:24:41+05:30 IST