సంక్షేమ పథకాల పేరుతో మోసం
ప్రజల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము
మాయం చేస్తున్న వలంటీరు అరెస్టు
కలికిరి(చిత్తూరు): సంక్షేమ పథకాల కోసమంటూ వేలి ముద్రలు తీసుకుని వాటి ఆధారంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు దోచుకోవడమనే కొత్త రకం మోసానికి తెరతీసిన గ్రామ వలంటీరు మంచూరి నవకుమార్ (25)ను కలికిరి పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా నిందితుడి వద్ద నుంచి రూ.44,900 నగదు, మొబైల్ ఫోను, ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ లోకేష్ రెడ్డి వెల్లడించారు. పత్తేగడ పంచాయతీలోని కుక్కలొడ్డు, పల్లెల్లవారిపల్లె వలంటీరుగా పనిచేస్తున్న నవకుమార్ ఈ-పాయింట్ ఇండియా అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా తన పరిధిలో వున్న కొంత మంది ప్రజల వద్ద ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారి వేలి ముద్రలు అవసరమని నమ్మించేవాడన్నారు. వారి వేలి ముద్రలు వేయించుకుని వారి ఖాతాల నుంచి డబ్బును ఈ యాప్ ద్వారా తన ఖాతాలోకి పంపించుకుని మోసం చేసేవాడని సీఐ వివరించారు. ఈ విధంగా పలువురి ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసినట్లు తేలిందన్నారు. దీనికి సంబంధించి పి.నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలికిరి ఎస్ఐ లోకేష్ రెడ్డి కేసు నమోదు చేశారని చెప్పారు.
సీఐ నాగార్జున రెడ్డిని దర్యాప్తు అధికారిగా ఎస్పీ సెంథిల్‌కుమార్ నియమించినట్లు పేర్కొన్నారు. పలువురి ఖాతాల నుంచి ఈ విధమైన అక్రమ బదలాయింపులు జరిగినట్లు దర్యాప్తులో రుజువు కావడంతో నవకుమార్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు సీఐ వివరించారు. కాగా నవకుమార్ సహచరుడైన మరో వలంటీరును పోలీసులు ఇంకా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.అతి తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన దర్యాప్తు అధికారి సీఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ లోకేష్ రెడ్డి, హెచ్‌సీ మనోహర్, పీసీలు సుబ్రమణ్యం, అమరనాథ్లను డీఎస్పీ రవిమనోహరాచారి అభినందించారు.