ఉద్యోగాల పేరిట మోసం

ABN , First Publish Date - 2021-04-13T08:31:48+05:30 IST

ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. అయినా అతడిలో మార్పు రాలేదు. జల్సాలకు అలవాటుపడిన అతగాడు..

ఉద్యోగాల పేరిట మోసం

జైలుకు వెళ్లినా మారని నైజం

నిందితుడిని చండీగఢ్‌లో అరెస్టు చేసిన పోలీసులు

రామచంద్రాపురం, ఏప్రిల్‌ 12: ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. అయినా అతడిలో మార్పు రాలేదు. జల్సాలకు అలవాటుపడిన అతగాడు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మళ్లీ మోసాలకు దిగాడు. ఆ మోసగాడిని రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జగదీశ్‌  తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం రాజావారి పల్లెకు చెందిన కె.రాజేశ్‌  2019లో ఇలాంటి కేసుల్లోనే జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత కూడా అతడి తీరులో మార్పు రాలేదు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన తేజస్విని అనే మహిళకు  సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(భెల్‌)లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ విడతల వారీగా రూ. 5,52,700 వసూలు చేశాడు. అలాగే.. సమ్రీన్‌, అపర్ణ, ఆదర్స్‌, షరీఫ్‌ అనే వారి నుంచి కూడా లక్షల రూపాయలు.. మొత్తంగా  రూ.1.10 కోట్లు వసూలు చేశాడు. తర్వాత ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. డబ్బులు చెల్లించిన వారికి ముఖంచాటేసేవాడు. దీంతో ఈ నెల 9న తేజస్విని తండ్రి మల్లికార్జునరావు పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు చండీగఢ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీ్‌సలు.. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొన్నారు. రాజేశ్‌, రమేశ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, సుమిత్‌, ఆగర్వాల్‌ అనే పేర్లతో నిందితుడు మోసాలకు పాల్పడేవాడని ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.   

Updated Date - 2021-04-13T08:31:48+05:30 IST