డేటింగ్‌ పేరిట టోకరా.. అమ్మాయిల ఫోటోలు పంపి రూ. 48వేల మోసం

ABN , First Publish Date - 2020-10-14T19:12:37+05:30 IST

డేటింగ్‌ యాప్‌ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ దేశవ్యాప్తంగా ఎంతో మందిని డేటింగ్‌ల పేరిట మోసాలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు

డేటింగ్‌ పేరిట టోకరా.. అమ్మాయిల ఫోటోలు పంపి రూ. 48వేల మోసం

సైబర్‌క్రైంలో ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు నిందితుల అరెస్టు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): డేటింగ్‌ యాప్‌ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ దేశవ్యాప్తంగా ఎంతో మందిని డేటింగ్‌ల పేరిట మోసాలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో డేటింగ్‌ యాప్‌ ద్వారా మోసపోయిన నగర వాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసి ట్రాన్సిట్‌ వారెంట్‌పై మంగళవారం ఇక్కడికి తరలించారు. సైబర్‌ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఏడాది జనవరి 7న బాధితునికి డేటింగ్‌ యాప్‌ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అమ్మాయిలను సరఫరా చేస్తానని.. వారితో డేటింగ్‌, చాటింగ్‌లు చేయిస్తానని నమ్మించాడు. ఫోటోలు, వివరాలు పంపించడానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని... మెంబర్‌ షిప్‌ కార్డు తీసుకుంటే మరిన్ని సౌకర్యాలు ఉంటాయని నమ్మించాడు. 


గోల్డ్‌ మెంబర్‌షిప్‌ కార్డు తీసుకుంటే హోటళ్లలో బుకింగ్‌లు, డేటింగ్‌లు, మీటింగ్‌లు ఉంటాయంటూ అతని వద్ద నుంచి మొత్తం రూ. 48 వేలు తీసుకున్నాడు. పేటీఎం వ్యాలెట్‌లు, నెట్‌ బ్యాంకింగ్‌ల ద్వారా డబ్బులు చెల్లించిన బాధితునికి అనుమానం రావడంతో మోసపోయిన తీరును వివరిస్తూ జనవరి 22న సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనిచ్చిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈనెల 9న ప్రధాన నిందితుడైన కోల్‌కతా నివాసి ఆనంద్‌కార్‌ (31), రెండో నిందితుడు 24పరగణ జిల్లాకు చెందిన బుద్ధదేవ్‌ పాల్‌లను అరెస్టు చేశారు. నిందితులను విచారించగా ఫోన్‌ నెంబర్లు సేకరించి అమాయకులను టార్గెట్‌ చేసుకుని వారికి ఆశలు చూపి... అమ్మాయిల ఆకర్షణీయమైన ఫోటోలు పంపి డబ్బులు కాజేస్తుంటామని వివరించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వందల మందిని మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. వారిద్దరినీ ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. డేటింగ్‌ యాప్‌లను, ఆఫర్లను వెరిఫై చేసుకోకుండా నమ్మరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-10-14T19:12:37+05:30 IST