రూ.90 కోట్ల రుణం పేరిట దగా

ABN , First Publish Date - 2021-01-14T07:07:24+05:30 IST

అతను ఓ కంపెనీకి యజమాని.. వ్యాపార అవసరాలు, బ్యాంకులకు చెల్లింపుల కోసంఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు

రూ.90 కోట్ల రుణం పేరిట దగా

వ్యాపారవేత్తకు రూ. 20 లక్షల కుచ్చు టోపీ  

నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు


పంజాగుట్ట, జనవరి 13: అతను ఓ కంపెనీకి యజమాని.. వ్యాపార అవసరాలు, బ్యాంకులకు చెల్లింపుల కోసంఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన.. అతనికి అంతకుముందే పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగారు. ఇంకేముంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 90 కోట్ల రుణం ఇప్పిస్తామంటూ నమ్మబలికి ఆ వ్యాపారికి రూ. 20 లక్షలు కుచ్చు టోపీ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఎర్రమంజిల్‌ హిల్‌టాప్‌ కాలనీకి చెందిన పి.నాగేశ్వర్‌రావు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో సింధూర పేపర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 2008 నుంచి పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. బ్యాంకర్లకు డబ్బుల చెల్లింపులు, ఇతర అవసరాల కోసం ఆర్థిక వనరులు సమకూర్చునేందుకు కొద్దినెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 2020 మార్చిలో అతనికి పరిచయమైన నాగరాజు (మూసాపేట), లీలాకాంత్‌ (ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌), చింతేశ్వర్‌రావు (చింతల్‌) తమవంతు సాయం చేస్తామంటూ నాగేశ్వర్‌రావును ముగ్గులోకి దించారు. 


కార్పొరేట్‌ రంగానికి చెందిన కృష్ణప్రసాద్‌ ద్వారా రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకుగాను రూ. 20 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. రుణం మంజూరు కాకపోతే తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఒప్పందం మేరకు నాగేశ్వర్‌రావు 2020 మే 24న ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ అకౌంట్‌కు రూ. 15 లక్షలు ఆర్టీజీఎస్‌ చేశాడు. మరో 5 లక్షల నగదును వారికి అందించాడు. రోజులు గడుస్తున్న రూ. 90 కోట్ల రుణం రాకపోగా.. తాను ఇచ్చిన రూ. 20 లక్షలు కూడా వారు ఇవ్వడంలేదు. దీంతో ఆ ముగ్గురిని ప్రశ్నించడంతో.. గూగుల్‌ ఇండియా డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి నకిలీ రుణ మంజూరు పత్రాన్ని వారు నాగేశ్వరావుకు పంపించారు. మిగతా ప్రక్రియ పూర్తి కావాలంటే మరో 20 లక్షలు కావాలని డిమాండ్‌ చేశారు. ఆ ముగ్గురి తీరుపై అనుమానం కలిగిన నాగేశ్వర్‌రావు.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని నిలదీయగా.. వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన నాగేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాగరాజు, లీలాకాంత్‌, చింతేశ్వర్‌రావు, కృష్ణప్రసాద్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-14T07:07:24+05:30 IST