ఇసుకాసుల పంట.. దళారులకు టీఎస్‌ఎండీసీ ఇసుక

ABN , First Publish Date - 2020-07-06T21:15:18+05:30 IST

భవన నిర్మాణ దారులకు ఇసుక ధరలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం దళారులకు కాసుల పంట పండిస్తోంది.

ఇసుకాసుల పంట.. దళారులకు టీఎస్‌ఎండీసీ ఇసుక

ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు.. ఆపై రెట్టింపు రేటుకు అమ్మకాలు

నీరుగారుతున్న వినియోగదారుల సంక్షేమం


ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : భవన నిర్మాణ దారులకు ఇసుక ధరలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం దళారులకు కాసుల పంట పండిస్తోంది. ఇసుక వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకున్న కొందరు నిర్ణీత సమయానికి కొందరు ఏజెంట్ల ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌లు చేయించి.. ఇసుక కొనుగోలు చేసి.. బయట రెట్టింపు ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇళ్ల నిర్మాణ అవసరాల నిమిత్తం టీఎస్‌ఎండీసీలో ఆన్‌లైన్‌ బుక్‌చేసి ఇసుక కొనుగోలు చేయాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ఉంది పరిస్థితి. 


ఉదాహరణకు... 

ఖమ్మం టీఎస్‌ఎండీసీ ఇసుక డిపోలో ట్రాక్టర్‌ ఇసుక బుక్‌ చేస్తే రూ.5,220 చెల్లించాలి. దళారులు ఎక్కువమంది నెట్‌వర్క్‌తో ఆన్‌లైన్‌ బుక్‌ చేసుకుని ఇసుక కొనుగోలు సాగిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన ఇసుకను ట్రాక్టర్‌ రూ.10నుంచి రూ.12వేల వరకు అమ్ముతున్నారు. దీంతో రెట్టింపు లాభం వస్తుంది. నిజమైన వినియోగదారులు ఎవరూ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేకపోతున్నారు. టీఎస్‌ఎండీసీలో గోదావరి నదీ ప్రాంత ఇసుక లభిస్తున్నందున భవన నిర్మాణ యజమానులు ఈ ఇసుకకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో బుక్‌ చేసుకుంటున్న దళారులకు రెట్టింపు లాభాలు వస్తున్నాయి. ఖమ్మం ఇసుక డిపోలో రోజుకు 30ట్రాక్టర్ల వరకు అనుమతి ఉంటుంది. ఈ 30ట్రాక్టర్లు కూడా దళారులే కొనుగోలు చేసి భవన నిర్మాణదారులకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు గోదావరి తీరప్రాంతమైన మణుగూరు తదితర చోట్ల కూడా టీఎస్‌ఎండీసీ ఇసుక ర్యాంపులున్నాయి. కొన్ని ప్రైవేటు రైతుల భూములనుంచి ఇసుక తవ్వకాలు జరుగుతుండగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాల వాసులు నేరుగా ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుని ఇసుక లారీల్లో తరలిస్తున్నారు. ఇదికూడా పూర్తిగా దళారీల దందానే కొనసాగుతోంది. క్యూబిక్‌ మీటరుకు రూ.600 టీఎస్‌ఎండీసీకి చెల్లించాలి. ఒక్కోలారీలో పదినుంచి 20క్యూబిక్‌ మీటర్ల వరకు తరలించుకువెళ్లే అవకాశం ఉంది. ఇలా కొనుగోలు చేసిన ఇసుకను కూడా రెట్టింపు రేటుకు విక్రయిస్తున్నారు. నిజమైన భవన నిర్మాణ యజమానులకు టీఎస్‌ఎండీసీ ఆన్‌లైన్‌బుకింగ్‌లో ఇసుక లభ్యంకావడంలేదు. తిరిగి దళారులను ఆశ్రయిస్తే వారు బుక్‌చేసుకున్న ఇసుకను రెట్టింపు సొమ్ములుఇచ్చి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. 


భద్రాద్రి జిల్లాలో ర్యాంపులు తెరిచేందుకు ప్రయత్నాలు

గోదావరి తీరప్రాంతంలోని భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక ర్యాంపులతో పాటు కొత్తగా తొమ్మిది చోట్ల ఇసుక తవ్వకాలకు టీఎస్‌ఎండీసీ నుంచి అనుమతి లభించింది. త్వరలో ఇసుక ర్యాంపులు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా దళారుల రాజ్యం కాబోతోంది. గోదావరి ఇసుకకు హైదరాబాద్‌లో డిమాండ్‌ ఉండడంతో కొందరు అధికార పార్టీ నాయకులు కొత్త ఇసుక ర్యాంపుల వెనుక చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గిరిజన సొసైటీలపేరుతో సాగే తవ్వకాలు, అమ్మకాల్లో కూడా దళారుల దందా సాగే ప్రమాదం ఉంది. గతంలో కూడా గిరిజనేతరులు గిరిజన సొసైటీల పేరుతో ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడిన సంఘటనలున్నాయి. వాస్తవానికి టీఎస్‌ఎండీసీ ‘మన ఇసుక మన వాహనం’ పేరుతో ఆయా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో బుక్‌చేసుకున్న వారికి అసలు ధరకు నేరుగా ఇసుక పంపాల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాన్ని ఆసంస్థ అధికారులే నీరుగార్చి ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  ఈ క్రమంలో దళారులకు టీఎస్‌ఎండీసీ ఇసుక కాసుల పంట పండిస్తోందని, ఇప్పటికైనా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు ఇసుక అమ్మకాలలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వినియోగదారులు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-07-06T21:15:18+05:30 IST