సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ భారీగా మోసాలు

ABN , First Publish Date - 2021-06-22T12:26:11+05:30 IST

‘నేను సీఎం పర్సనల్‌ సెక్రటరీని... సీఎం పేషీ నుంచి ఫోన్‌ చేస్తున్నా’

సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ భారీగా మోసాలు

  • నామినేటెడ్‌ పోస్ట్‌ల పేరుతో అందినంత వసూళ్లు
  • అరెస్ట్‌ చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ పరిచయం చేసుకొని, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బుర్రా కమల్‌ కృష్ణగౌడ్‌ (40) డిగ్రీ మధ్యలో మానేశాడు. బతుకుదెరువు కోసం 2018లో నగరానికి వచ్చి పలు ప్రైవేటు ఉద్యోగాలు చేశాడు. అనంతరం బంజారాహిల్స్‌లోని ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పనిచేయడం ప్రారంభించాడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇతను పలుపార్టీల కార్యకర్తలు, సానుభూతిపరుల ఫోన్‌ నెంబర్లు సేకరించాడు. 


‘నేను సీఎం పర్సనల్‌ సెక్రటరీని... సీఎం పేషీ నుంచి ఫోన్‌ చేస్తున్నా’ అంటూ వారికి ఫోన్‌లు చేసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తానంటూ నమ్మించి అందినకాడికి దోచుకునేవాడు. ఇతడిపై గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇతడి వ్యవహారంపై పలు ఫిర్యాదులు రావడంతో వలపన్నిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్‌ చేసి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని గోపాలపురం పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-06-22T12:26:11+05:30 IST