పరిహారం.. పక్కా మోసం

ABN , First Publish Date - 2020-02-07T07:11:19+05:30 IST

పెట్రోల్‌ పైపులైన్‌ నిర్మాణం నేపథ్యంలో నష్టపరిహారం పంపిణీలో జిల్లాల మధ్య, వివక్ష చూపుతున్నారు. ఒకచోట ఒక్కోరకంగా భూమి విలువ కట్టడంపై

పరిహారం.. పక్కా మోసం

పెట్రోల్‌ పైప్‌లైన్‌ నిర్మాణంలో రైతులకు అన్యాయం
భూములకు చాలా తక్కువ నష్టపరిహారం
గుంటూరు జిల్లాలో ఎక్కువ, ప్రకాశంలో తక్కువ
అన్నీ సాగుకు అనుకూలమైన భూములే
పొలాల సాగుకు అడ్డుగా పైప్‌లైన్‌ నిర్మాణం
పంట నష్టపరిహారంపైనా రైతుల ఆందోళన

పెట్రోల్‌ పైపులైన్‌ నిర్మాణం నేపథ్యంలో నష్టపరిహారం పంపిణీలో జిల్లాల మధ్య, వివక్ష చూపుతున్నారు. ఒకచోట ఒక్కోరకంగా భూమి విలువ కట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..విజయవాడ నుంచి తమిళనాడులోని ధర్మపురి వరకు పెట్రోలియం పైప్‌లైన్‌ నిర్మాణాన్ని హెచ్‌పీసీఎల్‌ సంస్థ ప్రారంభించింది. ఆపైపులైన్‌ జిల్లా నుంచి వెళుతుంది. అందులో కురిచేడు మండలంలోని పలు గ్రామాలు ఉన్నాయి. పైప్‌లైన్‌ వేసే గ్రామాల రైతులకు నష్టపరిహారం అందజేసే విషయంలో కంపెనీ రైతులకు అన్యాయం చేసింది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఇచ్చి ప్రకాశం జిల్లా రైతులకు మాత్రం తక్కువగా నష్టపరిహారం ఇచ్చారు. అందుకు సంబంధించి తమకు న్యాయం చేయమని రైతులు కలెక్టరుకు వినతిపత్రాలు అందజేశారు.
 
60గ్రామాల మీదుగా..
ప్రకాశం జిల్లాలో 8 మండలాల్లో భూమి అవసరం. సంతమాగులూరు, కురిచేడు, దొనకొండ, మార్కాపురం, తర్లుపాడు, కంభం, బేస్తవారిపేట, కొమరోలు మండలాలకు చెందిన 60గ్రామాల మీదుగా పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు. కురిచేడు మండలంలో పడమర వీరాయపాలెం, కురిచేడు, కాటంవారిపల్లె, పొట్లపాడు, గంగదొనకొండ గ్రామాల పొలాల్లో రైల్వేట్రాక్‌ పక్కన ఈ పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. రైతుల భూములు ఏమేర అవసరమో గుర్తించి సదరు భూముల సేకరణకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను 2018 నవంబరు 12న ఇచ్చారు. రైతుల భూముల గుండా పైప్‌లైన్‌ వేసేందుకు అవసరమైన నోటీసులు సైతం రైతులకు ఇచ్చారు. అయితే పైప్‌లైన్‌ వేసేందుకు తమ వద్ద తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో కంపెనీ రైతులకు న్యాయం చేయలేదు.
 
గుంటూరులో రూ.3,600.. ప్రకాశంలో రూ.850..
పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాలో సెంటుకు రూ.3,600 లెక్కన ఇచ్చిన కంపెనీ ఇక్కడి రైతులకు మాత్రం రూ.850 నుంచి రూ.1,500 మాత్రమే అందజేశారు. ఇదెక్కడి న్యాయం అని రైతులు అడుగుతున్నారు. గుంటూరు జిల్లాలో 9మండలాలోని 34 గ్రామాల గుండా 102.2 కి.మీ పైప్‌లైన్‌ నిర్మాణం చేస్తున్నారు. అక్కడి రైతులను కలెక్టరు సమన్వయపరచారు. రైతులు, హెచ్‌పీసీఎల్‌ కంపెనీల వారిని కూర్చోబెట్టి మాట్లాడి రైతులకు సెంటుకు రూ.3,600లు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. దీనికి సంబంధించి 2019 డిసెంబరు 30న ఆర్‌సి.నంబరు.988/2018-జి3-1 పేరుతో ఉత్తర్వులు కలెక్టరు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం రైతులకు సెంటుకు రూ.3,600 లెక్కన రైతులకు హెచ్‌పీసీఎల్‌ కంపెనీ వారు అందజేశారు. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఆ ప్రకారం జరగలేదు. ఇక్కడి అధికారులపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
హామీ ఇచ్చి తప్పారు..
ప్రకాశం జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా కంపెనీ ప్రతినిధులు వ్యవహరించారు. రైతుల భూములకు చాలా తక్కువగా నష్టపరిహారం అందజేశారు. రూ.850 నుంచి రూ.1,500ల వరకు ఇచ్చారు. పక్క జిల్లాలో ఇచ్చిన దానిలో సగం కంటే తక్కువగా ఇచ్చారు. ఇదేమని అడిగిన రైతులకు వారి నుంచి సమాధానం కూడా లేదు. మాకు న్యాయం చేయాలని రైతులు తహసీల్దార్‌కు, కలెక్టరుకు వినతిపత్రం అందజేస్తున్నారు. నిర్మాణ సమయంలో నష్టపరిహారం పెంచమని పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. పరిహారం పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ తర్వాత పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే తమకు గుంటూరు జిల్లాలో రైతులకు ఇచ్చిన పరిహారం మేరకు తమకు కూడా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
 
పరిహారం విషయంలోనూ మోసం..
ఇదిలా ఉండగా పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌ లేని పొలాలకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వలేదు. పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండి, ఆన్‌లైన్‌లో నమోదై ఉంటేనే రైతులకు పరిహారం ఇస్తామని కంపెనీ వారు మెలిక పెట్టారు. అలాగే పంటలు పాడుచేసి పైప్‌లైన్‌ నిర్మించిన చోట పంట నష్టం ఇస్తామన్నారు. కానీ జాడ కూడా లేదు. పైప్‌లైన్‌ వేసిన భూములలో గుంతలు, మెట్టలు కూడా ఏర్పడ్డాయి. వాటిని కూడా చదును చేయలేదు. దానికి తమకు ఖర్చవుతున్నట్లు రైతులు తెలియజేస్తున్నారు. తమకు న్యాయం చేసి తమ భూములకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
 
తక్కువ నష్టపరిహారం ఇచ్చారు..
భూములు కోల్పోయిన రైతులకు తక్కువ నష్టపరిహారం ఇచ్చారు. మాకు సెంటు భూమికి రూ.850 మాత్రమే అందజేశారు. ఇదేమని అడిగితే సమాధానమే లేదు. మా గ్రామంలో పొగాకు, బొప్పాయి తోటలను నాశనం చేశారు. పంటనష్టం ఇస్తామన్నారు. ఆ ఊసేలేదు. గ్రామం పక్కగా పైప్‌లైన్‌ వెళుతోంది. భయంగా ఉంది. గుంటూరు జిల్లాలో రైతులకు ఇచ్చిన విధంగా మా భూములకు కూడా నష్టపరిహారం ఇప్పించాలి. పంటలు పోయినవి కనుక పంట నష్టం ఇప్పించి ఆదుకోవాలి.
-వరికూటి బాలయ్య, రైతు, గంగదొనకొండ, కురిచేడు మండలం

 
కలెక్టరుకు విన్నవిస్తాం..
హెచ్‌పీసీల్‌ కంపెనీ రైతులను మోసం చేసింది. వారు కోల్పోయిన భూములకు తక్కువ నష్టపరిహారం ఇచ్చారు. అదేమని అడిగిన రైతులను మభ్యపెట్టి తమ పనులు ముగించుకుని వెళ్ళారు. తర్లుపాడు మండలం కేతగుడిపి, సూరేపల్లి గ్రామాల పక్కనే పైప్‌లైన్‌ వేశారు. వారికి భవిష్యత్‌లో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. రైతులకు న్యాయం చేయమని కలెక్టరుకు విజ్ఞప్తి చేస్తాం. ఆయన ద్వారానే న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం.
- గాలి వెంకటరెడ్డి, ఏపీ రైతుసంఘం పశ్చిమ ప్రాంత కార్యదర్శి
 
 
కలెక్టరు దృష్టికి తీసుకెళ్లాం..
హెచ్‌పీసీల్‌ కంపెనీ తమ గ్యాస్‌ పైప్‌లైన్‌ వేసిన రైతుల భూములకు నష్టపరిహారం తక్కువగా ఇచ్చారని వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళ్తాము. రైతులకు ఎంతమేర పరిహారం ఇచ్చారో విచారణ చేయిస్తాము. గుంటూరు జిల్లాలో ఎలా పరిహారం ఇచ్చారో తెలియదు. రైతులను విచారించి వారి భూములకు ఎంత నష్టపరిహారం అందించారో రిపోర్టు తయారుచేయిస్తాము. రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఉన్నతాధికారులకు విషయం తెలియజేసి వారి ఆదేశాల మేరకు ఏం చేయాలో చేస్తాము.
- రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, కురిచేడు

Updated Date - 2020-02-07T07:11:19+05:30 IST