కరోనా రెండో వేవ్‌లో క్లిష్ట దశను దాటేశాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

ABN , First Publish Date - 2020-11-25T21:51:26+05:30 IST

ఈ వారంతంలో కరోనా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు. క్రిసమస్ కల్లా షాపులు, సినిమ హాళ్లు, థియేటర్లు తెరుచుకుంటాయని, ఈ పర్వదినాన్ని ప్రజలు తమ కుటుంబాలతో జరుపుకోవచ్చని ఆయన చెప్పారు.

కరోనా రెండో వేవ్‌లో క్లిష్ట దశను దాటేశాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

ప్యారిస్: ఈ వారంతంలో కరోనా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు. క్రిసమస్ కల్లా షాపులు, సినిమ హాళ్లు, థియేటర్లు తెరుచుకుంటాయని, ఈ పర్వదినాన్ని ప్రజలు తమ కుటుంబాలతో జరుపుకోవచ్చని ఆయన చెప్పారు. ఐరోపాలో కరోనా రెండో వేవ్‌కు సంబంధించి క్లిష్టమైన దశ దాటిపోయిందని, అయితే రెస్టారెంట్లు, బార్లు, కేఫ్‌లు జనవరి 20 వరకూ మూసి ఉంచాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా మూడో వేవ్ ప్రారంభం కాకుండా ఉండేందుకు ఈ నిబంధనలు అవసరమని ఆయన స్పష్టం చెప్పారు.


 ‘కరోనా మూడో వేవ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రానీయకూడదు. ఈ దిశగా మనం చేయవలసిందంతా చేయాలి’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో నెలలో ఫ్రాన్స్‌లోని నగరాల్లో విధించిన కర్ఫ్యూ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం అక్టోబర్ 30న దేశ వ్యాప్తంగా ఒక నెల పాటు లాక్ డౌన్ విధించింది. దీంతో కరోనా ప్రభావం కొద్దిగా తగ్గి అక్కడి ఆస్పత్రులకు కరోనా రోగుల తాకిడి తగ్గింది. అయితే.. ఆంక్షల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ వ్యాపార వర్గాలు ప్రభుత్వం వద్ద మొర పెట్టుకోవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించేందుకు నిర్ణయించింది. 

Updated Date - 2020-11-25T21:51:26+05:30 IST