పాకిస్థాన్‌పై ఫ్రాన్స్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-02-24T01:36:53+05:30 IST

ఫ్రాన్స్ ప్రతిపాదించిన ఓ బిల్లు ముస్లింలను అవమానించేదిగా

పాకిస్థాన్‌పై ఫ్రాన్స్ ఆగ్రహం

పారిస్ : ఫ్రాన్స్ ప్రతిపాదించిన ఓ బిల్లు ముస్లింలను అవమానించేదిగా ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ చేసిన వ్యాఖ్యలపై ఫ్రాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులో ఎటువంటి వివక్ష లేదని స్పష్టం చేసింది. అల్వీ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు పాకిస్థాన్ ఛార్జ్ డీ అఫైర్స్‌ను పిలిచి, అల్వీ వ్యాఖ్యలపై నిరసన తెలిపింది. ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి పాకిస్థాన్‌కు తన నిరసనను తెలిపింది. 


ఫ్రెంచ్ ఫారిన్ మినిస్ట్రీ విడుదల చేసిన ప్రకటనలో, తమ ప్రభుత్వం ప్రతిపాదించిన యాంటీ సెపరేటిజమ్ బిల్లులో ఎటువంటి వివక్ష లేదని తెలిపింది. అల్వీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని, ఆ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఛార్జ్ డీఅఫైర్స్‌కు తెలిపినట్లు పేర్కొంది. మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక సూత్రాల మార్గదర్శకత్వంలో ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపింది. వివిధ మతాల మధ్య ఎటువంటి వ్యత్యాసాన్ని చూపలేదని, ఇది అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అర్థం చేసుకుని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నిర్మాణాత్మక వైఖరిని ప్రదర్శించాలని కోరింది. 


విద్వేషాన్ని నింపే సంస్థలపై వేటుకు అవకాశం

యాంటీ సెపరేటిజమ్ బిల్లును ఫ్రెంచ్ పార్లమెంటులోని దిగువ సభ గత వారం ఆమోదించింది. ఓ వ్యక్తిపై కానీ, కొందరు వ్యక్తులపై కానీ హింసను లేదా విద్వేషాన్ని రెచ్చగొట్టే వాదనలు లేదా సిద్దాంతాలను ప్రసారం చేసే మతపరమైన సంస్థలు, ప్రార్థనా స్థలాలను మూసివేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ బిల్లును రూపొందించారు. 


అల్వీ ఏమన్నారంటే...

పాకిస్థాన్ అధ్యక్షుడు అల్వీ శనివారం మతపరమైన సమావేశంలో మాట్లాడుతూ, మైనారిటీలను ఏకాకులను చేయడానికి మెజారిటీ ప్రజలకు అనుకూలంగా చట్టాలను మార్చుతున్నారంటే, అదొక ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. ప్రవక్తను అవమానించారంటే, ముస్లింలందరినీ అవమానించినట్లేనని అన్నారు. ఇటువంటి వైఖరులను చట్టాల్లోకి ప్రవేశపెట్టవద్దని ఫ్రాన్స్ రాజకీయ నాయకత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. ప్రజలను కలిపి ఉంచడానికి ప్రయత్నించాలని, ఓ మతంపై ఓ విధంగా ముద్ర వేయకూడదని చెప్పారు. పక్షపాతాన్ని, ప్రజల్లో అశాంతిని సృష్టించకూడదన్నారు. 


ఫ్రెంచ్ బిల్లుకు కారణం...

ఇస్లామిక్ రాడికల్ వ్యక్తి ఒకడు ఓ ఫ్రెంచ్ టీచర్‌ను హత్య చేసిన నేపథ్యంలో రాడికల్ ఇస్లాంను కట్టడి చేసేందుకు ఈ బిల్లును ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రవక్త మహమ్మద్‌ కార్టూన్లు ప్రచురితమైన నేపథ్యంలో ఆ టీచర్ హత్య జరిగింది.


Updated Date - 2021-02-24T01:36:53+05:30 IST