Published: Wed, 26 Jan 2022 03:47:12 IST v>రామచంద్రయ్య డోలు వాయిద్య నైపుణ్యమే మేడారం జాతరలో కిక్కు
ఆదివాసీ యోధుల చరిత్రలను ఆశువుగా వినిపించడంలో దిట్ట
కొత్తగూడెం/మణుగూరు, జనవరి 25: ఆయన నిరక్షరాస్యుడు! అయితేనేం.. ఆదివాసీ యోధులపై ఆయన గొంతెత్తితే ఆశువుగా కథ వస్తోంది. ఆయన డోలు వాయిస్తే అంతకుమించి వీనులకు విందుగా ఉంటుంది! ఆ డోలు వాయిద్యానికి పద్మశ్రీ పురస్కారమే ఆయన వద్దకు కదిలివచ్చింది. ఆయనే 65 ఏళ్ల సకిని రామచంద్రయ్య. స్వస్థలం కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం. కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందినవారాయన. మాతృభాషలో కులాచారపు గీతాలు పాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్త్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రలను పారాయణం చేసే వారిలో రామచంద్రయ్యే చివరి వ్యక్తి అని అంటారు. సమక్క సారక్క చరిత్ర, గరికామారాజు, పగిడిద్దరాజు, ఈరామరాజు, గాడిరాజు, బాపనమ్మ, ముసలమ్మ, నాగులమ్మ, సదలమ్మ తదితర ఆదివాసీ యోధుల కథలను గానం చేయడంలో ఆయన దిట్ట. మేడారం సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్య వాయిద్య నైపుణ్యమే కిక్కు. వన దేవతలకు ఆయన డోలు వాయిద్యం మధ్య పూజలు చేస్తారు. రామచంద్రయ్య.. ముత్తాతల కాలం నుంచి సంక్రమించిన గిరిజన సంప్రదాయ కళను నేర్చుకుని జీవనాధారంగా మలుచుకున్నారు. ఈయనకు భార్య బసవమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఆదివాసీ కళకు అవార్డు దక్కింది
ఎంతో సంతోషంగా ఉంది అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయ కళకు ఈ అవార్డు దక్కింది. గిరిజన కళలు సంప్రదాయాలు అంతరించి పోతున్న ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డోలు వాయిద్యాన్ని కళగా గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం ఆనందంగా ఉంది.
-రామచంద్రయ్య
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.