మట్టి దందా!

ABN , First Publish Date - 2022-08-04T05:42:47+05:30 IST

వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా పర్వాలేదన్నట్టుంది మట్టి తవ్వకాల్లో అక్రమార్కుల తీరు.

మట్టి దందా!
టిప్పరుపై విరిగిపడిన విద్యుత్‌ స్తంభం

మాజీమంత్రి అనుచరుడి నిర్వాకం

బందరు మండలం పాతేరులో అక్రమం

ప్రభుత్వ భూముల్లో తవ్వకం

 ఒక్కొక్క టిప్పరు మట్టి రూ.10 వేలకు అమ్మకం

 పట్టుకుంటే జాతీయ రహదారి నిర్మాణం పేరుతో తోలకం

 టిప్పర్‌ విద్యుత్‌ స్తంభాలను ఢీకొనడంతో వెలుగుచూసిన అక్రమ బాగోతం

వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా పర్వాలేదన్నట్టుంది మట్టి తవ్వకాల్లో అక్రమార్కుల తీరు. మాజీమంత్రి అనుచరుడు ప్రభుత్వ భూమిలో ఇష్టారీతిన మట్టి తవ్వి రాత్రి సమయంలో టిప్పర్లతో తరలించి ప్రైవేటుగా అమ్మి సొమ్ముచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బందరు మండలం పాతేరులో చోటుచేసుకుంటున్న ఈ మట్టిదందా బుధవారం అనూహ్యంగా వెలుగులో కొచ్చింది. టిప్పర్‌ విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టడం ద్వారా తీగ లాగితే అక్రమం డొంక కదిలింది!

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు మండలం పాతేరు గ్రామంలోని ప్రభుత్వ భూమిని 150 మందికి ఎకరం చొప్పున గతంలో పంపిణీ చేశారు. ఈ భూమికి కొద్ది దూరంలోనే మరికొంత ప్రభుత్వ భూమి ఉంది. దానిపై మాజీమంత్రి అనుచరుడు కన్నేశాడు. మట్టి తవ్వకాలకు ఎక్స్‌కవేటర్‌ను, రవాణాకు టిప్పర్లను సిద్ధం చేశాడు. మంగళవారం రాత్రి నుంచి మట్టితోలకం ప్రారంభించాడు. ఇటీవల కాలంలో రోజుల తరబడి భారీవర్షాలు కురవడంతో మట్టి రవాణా కొద్దిరోజులు నిలిచిపోయింది. మట్టి విక్రయాలకు డిమాండ్‌ ఏర్పడింది. నాలుగు రోజులుగా వర్షాలు కురవకపోవడంతో మళ్లీ మట్టి విక్రయాలకు మాజీమంత్రి అనుచరుడు తెరదీశాడు. ఇష్టారీతిన తవ్వి తరలిస్తున్నాడు. 

జాతీయ రహదారి పేరుతో ప్రైవేటుగా అమ్మకం 

 బందరు మండలంలోని పలు గ్రామాల నుంచి మట్టి అక్రమ రవాణా పెరిగింది. మాజీమంత్రి అనుచరుడు.. జాతీయ రహదారి నిర్మాణానికి మట్టి రవాణా చేస్తునట్టు చూపి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నాడు. ప్రభుత్వ భూమిని గుర్తించడం, టిప్పర్లు వచ్చిపోయేలా దారిని రహదారి వరకు పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడం, ఎలాంటి అనుమతులూ లేకుండానే మట్టిని తవ్వేయడం అతనికి పరిపాటిగా మారింది. ఒక్కో టిప్పర్‌లో మట్టిని లోడ్‌ చేసినందుకు రూ.2000, మట్టి రవాణాకు దూరాన్ని బట్టి  రూ.10వేలు వసూలు చేస్తున్నాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు టిప్పర్లను తనిఖీ చేస్తే ఏవేవో కాగితాలు చూపడం, అంతకూ చేయిదాటితే జాతీయ రహదారి పనులకు మట్టిని రవాణా చేస్తున్నట్లుగా సాకు చూపడం రివాజుగా మారింది. 

టిప్పర్‌ ప్రమాదంతో అక్రమం వెలుగులోకి..

మచిలీపట్నం శివారులోని కోన రోడ్డు మలుపు సమీపంలో బుధవారం తెల్లవారుజామున మట్టిలోడుతో వస్తున్న టిప్పర్‌ విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11కేవీ విద్యుత్‌వైర్లతో ఉన్న మూడు స్తంభాలు, గృహావసరాలకు విద్యుత్‌ సరఫరా చేసే మరో మూడు స్తంభాలు విరిగిపడ్డాయి. దిగువ గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముందు వస్తున్న టిప్పర్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టగా, దానివెనుకే ఉన్న మరో టిప్పర్‌పై విద్యుత్‌ స్తంభం పడిపోయింది. సంఘటన జరిగిన సమయంలో వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో టిప్పర్‌ డ్రైవర్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఆరు స్తంభాలు విరిగి పడటంతోపాటు  మూడు టిప్పర్లు నడిరోడ్డుపైనే నిలబడిపోయాయి. మచిలీపట్నం - కోన రహదారి వెంబడి రాకపోకలు ఆగిపోయాయి. పాతేరు గ్రామం సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కృష్ణా యూనివర్సిటీ, కోన, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెంలలో విద్యుత్‌ సరఫరా బుధవారం తెల్లవారుజాము నుంచి గంటల తరబడి నిలిచిపోయింది. 

 మట్టి అక్రమం వాస్తవమే

పాతేరు గ్రామం నుంచి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నమాట వాస్తవమే. ఈ అంశంపై విచారణ చేస్తున్నాం

- డి.సునీల్‌బాబు,  తహసీల్దార్‌

ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయాలన్నా ముడుపులే..

బందరు మండలంలో వేలాది ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువులున్నాయి. వీటికి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం వందలాది మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. యాదర, భోగిరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు ఈ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసే పనులు చేస్తుంటారు. ఇటీవల కాలంలో మండలంలోని రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలంటే మాజీమంత్రి అనుచరుడికి ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని షరతు పెట్టారు. నేరుగా రైతుల నుంచి నగదు తీసుకోకుండా విద్యుత్‌ స్తంభాలు, కాసారాలు, విద్యుత్‌వైర్లు ఇతరత్రా సామగ్రి అందుబాటులో లేవని, వాటి ఖర్చు రైతులే పెట్టుకోవాలని చెబుతూ దొడ్డిదారిన వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై రైతులు స్థానిక విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.



Updated Date - 2022-08-04T05:42:47+05:30 IST