నవంబరులో ‘ఎఫ్‌పీఐ’ రికార్డ్... ఈ దేశాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి

ABN , First Publish Date - 2020-11-30T22:12:04+05:30 IST

ఆర్థికవ్యవస్థ కరోనా తర్వాత ఇప్పుడు వేగంగా పుంజుకుంటోంది. వ్యాక్సిన్ పై ప్రకటనల నేపథ్యంలో పుంజుకున్న ఈక్విటీ మార్కెట్లు... సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో... ఎఫ్‌పీఐలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నవంబరులో రూ. 62,951 కోట్ల ఎఫ్‌పీఐ లు రావడం గమనార్హం.

నవంబరులో ‘ఎఫ్‌పీఐ’ రికార్డ్... ఈ దేశాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి

న్యూఢిల్లీ : ఆర్థికవ్యవస్థ కరోనా తర్వాత ఇప్పుడు వేగంగా పుంజుకుంటోంది. వ్యాక్సిన్ పై ప్రకటనల నేపథ్యంలో పుంజుకున్న ఈక్విటీ మార్కెట్లు...  సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో... ఎఫ్‌పీఐ(ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్)లు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిస్తున్నారు. నవంబరులో రూ. 62,951 కోట్ల మేరకు ఎఫ్‌పీఐ ల నుండి రావడం గమనార్హం. 


ఆరు నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు... 

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా ప్రకారం ఈక్విటీ విభాగంలో నవంబరులో అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. భారత మార్కెట్‌లోకి అక్టోబరు నెలలో వచ్చిన ఎఫ్‌పీఐ లు రూ. 22,033 కోట్లు. నవంబరు 3 వ తేదీ నుండి 27 వ తేదీల మధ్య వచ్చిన నికర ఎఫ్‌పీఐ లు రూ. 60,358 కోట్లు. ఇక... డెట్ విభాగంలో రూ. 2,593 కోట్లొచ్చాయి. కాగా... మొత్తం నికర పెట్టబడులు రూ. 62,951 కోట్లు.


ఈ దేశాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి...

అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికే పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని గ్రో సీవోవో, కో-ఫౌండర్ హర్ష్ జైన్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోందన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రధానంగా బ్లూచిప్స్ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయన్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. 


నవంబరులో అందుకే...

నవంబరు నెలలో పెట్టుబడులు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులతో పాటు అమెరికా డాలర్ బలహీనపడడమేనని చెబుతున్నారు. అలాగే... దేశంలో కరోనా కేసులు తగ్గిపోవడం, రికవరీ వేగవంతంగా ఉండటం కూడా దోహదం చేసినట్లు చెబుతున్నారు. కాగా... 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం మేర పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో గతేడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్దఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్ల(2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు రావడం విశేషం. 


Updated Date - 2020-11-30T22:12:04+05:30 IST