Abn logo
Sep 7 2021 @ 03:31AM

ఓ.. వెల్‌ భారత్‌

 బౌలర్ల తడాఖా

నాలుగో టెస్టులో అద్వితీయ విజయం

సిరీస్‌లో 2-1తో ఇంగ్లండ్‌పై ఆధిక్యం


ఇంగ్లండ్‌ ముందు 368 పరుగుల లక్ష్యం.. ఓ వైపు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌.. దీనికి తోడు ఆదివారం చివరి సెషన్‌లోనే ఆ జట్టు 77 పరుగులు చేసింది. ఇక ఆఖరి రోజు.. చేతిలో 10 వికెట్లున్న వేళ ఫలితం ఎలా రానుందనే ఆసక్తి నెలకొంది. కానీ నిర్జీవమైన పిచ్‌పై భారత బౌలర్లు అద్భుతమే చేశారు. తొలి సెషన్‌ నుంచే రూట్‌ సేన పనిబట్టారు. బుమ్రా స్వింగ్‌, యార్కర్లకు తోడు పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న జడేజా మిడిలార్డర్‌ను కూల్చడంతో రెండో సెషన్‌ వరకే 8 వికెట్లు ఫట్‌మన్నాయి. దీంతో ఓవల్‌ టెస్టులో భారత్‌ విజయం లాంఛనమే అయ్యింది.


లండన్‌: మూడో టెస్టులో దారుణ పరాభవానికి టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో బదులు తీర్చుకుంది. ఆదివారం చివరి రోజు భారత బౌలర్లు చెలరేగి జట్టుకు అసాధారణ విజయాన్నందించారు. 368 పరుగుల చేధనలో ఇంగ్లండ్‌ వీరి ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 92.2 ఓవర్లలో 210 పరుగులకే కుప్పకూలింది. దీంతో 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్‌ ఐదు టెస్టుల సిరీ్‌సలో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.


హమీద్‌ (63), బర్న్ప్‌ (50) అర్ధసెంచరీలు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌కు మూడు, జడేజా.. బుమ్రా.. శార్దూల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రోహిత్‌ నిలిచాడు. చివరి టెస్టు 10 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది. అతి జాగ్రత్తగా..: 77/0 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లో ఆచితూచి ఆడింది. దీంతో 27 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్‌ ఫ్లాట్‌గానే ఉన్నా భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారింది. జడేజా బంతిని చక్కగా టర్న్‌ చేయగలిగాడు. అటు హమీద్‌ అతి జాగ్రత్తను కనబరుస్తూ 123 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.  ఓపెనర్‌ బర్న్న్‌ అర్ధసెంచరీ పూర్తయ్యాక అవుటయ్యాడు. పేసర్‌ శార్దూల్‌ తీసిన ఈ వికెట్‌తో తొలి వికెట్‌కు 100 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న మలాన్‌ (5) రనౌట్‌ అయ్యాడు. దీంతో విజయానికి 237 రన్స్‌ కావాల్సి ఉండగా ఇంగ్లండ్‌ లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.


వికెట్లు టపటపా:

విరామం తర్వాత భారత్‌ మరింత జోరు పెంచింది. జడేజా, బుమ్రా ధాటికి ఇంగ్లండ్‌ ఆరు పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. ముందుగా అత్యంత ఓపిగ్గా ఆడుతున్న హమీద్‌తో పాటు మొయిన్‌ అలీ (0)లను జడేజా అవుట్‌ చేయగా.. బుమ్రా సూపర్‌ బాల్స్‌తో పోప్‌ (2), బెయిర్‌స్టో (0) క్లీన్‌ బౌల్డయ్యారు. అటు కెప్టెన్‌ రూట్‌ (36) ఒంటరి పోరాటం ఎక్కువ సేపు నిలవలేదు. 81వ ఓవర్‌లో శార్దూల్‌ అతడిని బౌల్డ్‌ చేయడంతో 182/7తో జట్టు ఇబ్బందుల్లో పడింది. అప్పటికింకా 185 పరుగులు చేయాల్సి ఉండగా టీ బ్రేక్‌కు ముందు  వోక్స్‌ను ఉమేశ్‌ యాదవ్‌ అవుట్‌ చేయడంతో ఆశలు వదులుకుంది. ఆ తర్వాత చివరి రెండు వికెట్లు కూడా ఉమేశ్‌ ఖాతాలోకే వెళ్లాయి.

ఇదీ గెలుపంటే!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): ఇంగ్లండ్‌పై నాలుగో టెస్ట్‌ విజయం టీమిండియాకు నిజంగా అపురూపం. మూడో టెస్ట్‌ ఘోర పరాజయం, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కనీసం రెండు వందల పరుగులు కూడా చేయని వైనం..ఇంకా దాదాపు వంద రన్స్‌ లోటు. ఫలితంగా జట్టు ఎదుర్కొన్న ఒత్తిడి అంతాఇంతా కాదు. ఈ ప్రతికూలతలను అధిగమించి కోహ్లీసేన అందుకున్న ఈగెలుపు అద్భుతమనే చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ మళ్లీ చేతులెత్తేయడంతో ఈ టెస్టు కూడా చేజారుతుందేమోనని భారత ఫ్యాన్స్‌ ఆందోళన చెందకపోలేదు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో విదేశాల్లో అమోఘంగా రాణిస్తున్న మన బౌలర్లు మరోసారి అదేస్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయకుండా అడ్డుకుని తమ పాత్రను సమర్థంగా నిర్వర్తించారు. ఇక..బౌలర్ల శ్రమను ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా చేయకూడదనే దృఢ సంకల్పం రెండో ఇన్నింగ్స్‌లో మన బ్యాట్స్‌మెన్‌లో కనిపించింది.


ఇంకా..గత టెస్ట్‌ ఓటమి, మొదటి ఇన్నింగ్స్‌ వైఫల్యం వారిలో కసి పెంచింది. ఒక్క రహానె మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ అంతా పట్టుదలగా ఆడారు. సంయమనం, దూకుడు మేళవించిన వారి ఆటతో రెండో ఇన్నింగ్స్‌లో 450కిపైగా స్కోరు సాధ్యమైంది. ఇక బౌలింగ్‌ విభాగం మరోసారి తన కర్తవ్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఇంగ్లండ్‌కు భారీ పరాజయం తప్పలేదు. కిందటి టెస్ట్‌ పరాజయానికి అదే స్థాయిలో బదులు తీర్చుకున్న భారత జట్టు  సిరీ్‌సలో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆఖరి టెస్ట్‌లోనూ గెలుపొంది సిరీ్‌సను దక్కించుకుంటుందని ఆశిద్దాం.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191 ; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 290; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 466

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 50; హమీద్‌ (బి) జడేజా 63; మలాన్‌ (రనౌట్‌) 5; రూట్‌ (బి) శార్దూల్‌ 36; పోప్‌ (బి) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) బుమ్రా 0; మొయిన్‌ అలీ (సి సబ్‌) సూర్యకుమార్‌ (బి) జడేజా 0; వోక్స్‌ (సి) రాహుల్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 18; ఒవర్టన్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 10; రాబిన్సన్‌ (నాటౌట్‌) 10; అండర్సన్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 2; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 92.2 ఓవర్లలో 210 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-100, 2-120, 3-141, 4-146, 5-146, 6-147, 7-182, 8-193, 9-202, 10-210. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 18.2-2-60-3; బుమ్రా 22-9-27-2; జడేజా 30-11-50-2; సిరాజ్‌ 14-0-44-0; శార్దూల్‌ 8-1-22-2.