బ్యాట్స్‌మెన్‌దే భారం

ABN , First Publish Date - 2021-09-04T08:16:33+05:30 IST

నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఒల్లీ పోప్‌ (159 బంతుల్లో 6 ఫోర్లతో 81), క్రిస్‌ వోక్స్‌ (60 బంతుల్లో 11 ఫోర్లతో 50) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు.

బ్యాట్స్‌మెన్‌దే భారం

ఇంగ్లండ్‌కు 99 పరుగుల ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌ 290 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 43/0


లండన్‌: నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఒల్లీ పోప్‌ (159 బంతుల్లో 6 ఫోర్లతో 81), క్రిస్‌ వోక్స్‌ (60 బంతుల్లో 11 ఫోర్లతో 50) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. దీంతో ఇంగ్లండ్‌ 84 ఓవర్లలో 290 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 99 పరుగుల ఆధిక్యం లభించింది. ఉమేశ్‌కు 3, బుమ్రా.. జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారత్‌ కూడా రెండో ఇన్నింగ్స్‌ను అంతే దీటుగా ఆరంభించింది. ఓపెనర్లు రాహుల్‌ (22 బ్యాటింగ్‌), రోహిత్‌ (20 బ్యాటింగ్‌) క్రీజులో ఆత్మవిశ్వాసంతో కనిపించారు. దీంతో శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా భారత్‌ 43 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఆధిక్యానికి ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉండగా, మ్యాచ్‌కు మరో మూడు రోజుల సమయం ఉంది. ఈ దశలో శనివారం భారత బ్యాట్స్‌మెన్‌ రాణించడం కీలకం కానుంది. 


ఆదుకున్న పోప్‌, జానీ:

రెండోరోజు 53/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే పేసర్‌ ఉమేశ్‌ ధాటికి 9 పరుగుల వ్యవధిలోనే ఒవర్టన్‌ (1), మలాన్‌(31) వికెట్లను కోల్పోయింది. 62/5తో ఇబ్బందుల్లో పడిన జట్టును బెయిర్‌స్టో (37), పోప్‌ జోడీ ఆదుకుంది. తొలిగంటలో 25 పరుగులే వచ్చినప్పటికీ.. ఈ జోడీ దూకుడుతో స్కోరులో వేగం పెరిగింది. శార్దూల్‌ ఓవర్‌లో పోప్‌ 3 ఫోర్లు, జానీ ఓ ఫోర్‌ బాదాడు. తర్వాత సిరాజ్‌, ఉమేశ్‌ ఓవర్లలో బెయిర్‌స్టో మూడేసి ఫోర్లతో చకచకా స్కోరును పెంచాడు. దీంతో లంచ్‌ బ్రేక్‌కు స్కోరు 139/5కి చేరింది. రెండో సెషన్‌లో బెయిర్‌స్టోను సిరాజ్‌ ఆరంభంలోనే అవుట్‌ చేసినా పోప్‌ దీటుగా నిలబడ్డాడు. చక్కటి డ్రైవ్స్‌, ఫ్లిక్‌, పుల్‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడికి మొయిన్‌ అలీ (35) సహకరించడంతో ఇంగ్లండ్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ జోడీ సునాయాసంగా భారత బౌలర్లను ఎదుర్కొంది. ఇదే జోరుతో పోప్‌ అర్ధసెంచరీ సాధించగా, మరో ఎండ్‌లో అలీ వేగం కనబరుస్తూ ఏడు ఫోర్లతో ఎదురుదాడికి దిగాడు. అయితే జడేజా ఓవర్‌లో స్లాగ్‌ స్వీప్‌నకు ప్రయత్నించి అలీ వెనుదిరగడంతో ఏడో వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. టీ బ్రేక్‌ సమయానికి జట్టు 36 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 


వోక్స్‌ బాదుడు:

చివరి సెషన్‌లో వోక్స్‌ వరుస బౌండరీలతో చెలరేగాడు. అయితే జట్టుకు అండగా నిలిచిన పోప్‌ను 77వ ఓవర్‌లో శార్దూల్‌.. ఆ వెంటనే రాబిన్సన్‌ (5)ను జడేజా అవుట్‌ చేశాడు. మరోవైపు వోక్స్‌ ఏకంగా 11 ఫోర్లతో  ఆధిక్యాన్ని పెంచాడు. ఈక్రమంలో 58 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి వోక్స్‌ రనౌట్‌తో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్ప్‌ (బి) బుమ్రా 5; హమీద్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; మలాన్‌ (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 31; రూట్‌ (బి) ఉమేశ్‌ 21; ఒవర్టన్‌ (సి) కోహ్లీ (బి) ఉమేశ్‌ 1; పోప్‌ (బి) శార్దూల్‌ 81; బెయిర్‌స్టో (ఎల్బీ) సిరాజ్‌ 37; మొయిన్‌ అలీ (సి) రోహిత్‌ (బి) జడేజా 35; వోక్స్‌ (రనౌట్‌) 50; రాబిన్సన్‌ (బి) జడేజా 5; అండర్సన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం: 84 ఓవర్లలో 290 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-5, 2-6, 3-52, 4-53, 5-62, 6-151, 7-222, 8-250, 9-255, 10-290. బౌలింగ్‌: ఉమేశ్‌ 19-2-76-3; బుమ్రా 21-6-67-2; శార్దూల్‌ 15-2-54-1; సిరాజ్‌ 12-4-42-1; జడేజా 17-1-36-2.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 20; రాహుల్‌ (బ్యాటింగ్‌) 22; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 16 ఓవర్లలో 43/0. బౌలింగ్‌: అండర్సన్‌ 6-1-13-0; రాబిన్సన్‌ 4-0-21-0; వోక్స్‌ 5-1-8-0; ఒవర్టన్‌ 1-0-1-0.

Updated Date - 2021-09-04T08:16:33+05:30 IST