Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంగ్లండ్‌ అద్భుతం

ఆసీ్‌సతో నాలుగో టెస్టు డ్రా

పోరాడిన టెయిలెండర్లు

రాణించిన క్రాలే, స్టోక్స్‌


సిడ్నీ: సహజంగా వన్డే, టీ20ల్లో ఆఖరి బంతి వరకు విజయం ఎవరిదో చెప్పలేని ఉత్కంఠకనిపిస్తుంటుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం ఇలాంటివి ఎప్పుడోకానీ కనిపించవు. అయితే అలాంటి అరుదైన దృశ్యమే ఈ యాషెస్‌ సిరీ్‌సలోనూ ఆవిష్కృతమైంది. వరుసగా వికెట్లు నేలకూలుతున్నా మ్యాచ్‌లో నిలిచేందుకు ఇంగ్లండ్‌ జట్టు పోరాడిన తీరు వహ్వా అనిపించక మానదు. ఓవర్లు కరుగుతున్నకొద్దీ అటు ఆసీస్‌ జట్టులో విజయం కోసం తీవ్ర ఆదుర్దా కనిపించింది. మరోవైపు ఇబ్బందికర బంతులను కాచుకుంటూ స్టువర్ట్‌  బ్రాడ్‌ (35 బంతుల్లో 8 నాటౌట్‌), అండర్సన్‌ (0 నాటౌట్‌) మొండిగా  క్రీజులో నిలబడడంతో ఇంగ్లండ్‌ 102 ఓవర్లలో 9 వికెట్లకు 270 పరుగులు చేసి ఐదో రోజును విజయవంతంగా ముగించింది. దీంతో నాలుగో టెస్టు అద్భుత డ్రాగా ముగియగా.. అటు ఈ సిరీ్‌సలో ఆసీస్‌ ఏకపక్ష విజయాలకు బ్రేక్‌ పడినట్టయింది. బోలాండ్‌కు మూడు, కమిన్స్‌.. లియోన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఉస్మాన్‌ ఖవాజా నిలిచాడు. ఇదిలావుండగా.. గతేడాది జనవరిలో ఇదే మైదానంలో 407 పరుగుల ఛేదనకు దిగిన భారత జట్టులో విహారి-అశ్విన్‌ 256 బంతులెదుర్కొని మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. 


ఆఖరి బంతి వరకు..: 388 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన పర్యాటక జట్టు 30/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆఖరి రోజును ఆరంభించింది. విజయానికి ఇంకా 358 రన్స్‌ చేయాల్సి ఉంది. ఓపెనర్‌ క్రాలే (77), స్టోక్స్‌ (60) అర్ధ శతకాలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆసీస్‌ బౌలర్ల విజృంభణకు స్టోక్స్‌తో పాటు బట్లర్‌ (11), మార్క్‌ ఉడ్‌ (0) బెయిర్‌స్టో (41)ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. అప్పటికి స్కోరు 237/8 కాగా మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఈ దశలో బ్రాడ్‌తో కలిసి లీచ్‌ (26) మ్యాచ్‌ను ముగించే  ప్రయత్నం చేశాడు. ఫీల్డర్లు కూడా బ్యాటర్‌ చుట్టూ మోహరించి ఒత్తిడి పెంచారు. వెలుతురు పెద్దగా లేకపోవడంతో చివరి మూడు ఓవర్లు స్పిన్నర్లు లియోన్‌, స్మిత్‌ వేశారు. 100వ ఓవర్‌లో లీచ్‌ను స్మిత్‌ అవుట్‌ చేయడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. క్రీజులో బ్రాడ్‌కు జతగా అండర్సన్‌ కలవడంతో ఇక చివరి వికెట్‌ పడడం ఖాయమేనని అంతా భావించారు. అప్పటికింకా రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ముందుగా లియాన్‌ ఓవర్‌ను బ్రాడ్‌ మెయిడిన్‌గా ముగించగా.. చివరి ఓవర్‌ను వెటరన్‌ అండర్సన్‌ కూడా పూర్తిగా ఆడేయడంతో ఇంగ్లండ్‌ మ్యాచ్‌ గెలిచినంతగా సంబరాల్లో మునిగిపోయింది.


సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 416/8 డిక్లేర్‌; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 294; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 265/6 డిక్లేర్‌; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 102 ఓవర్లలో 270/9 (క్రాలే 77, స్టోక్స్‌ 60, బెయిర్‌స్టో 41; బోలాండ్‌ 3/30, లియాన్‌ 2/28, కమిన్స్‌ 2/80).

Advertisement
Advertisement