Abn logo
Apr 21 2021 @ 01:09AM

‘ఏర్పేడు’ ఘటనకు నాలుగేళ్లు

   నేటికీ బాధితులకు అందని సాయం

 ఆందోళనలో క్షతగాత్రులు


ఏర్పేడు, ఏప్రిల్‌ 20: ‘ఏర్పేడు’ దుర్ఘటనకు బుధవారంతో నాలుగేళ్లు పూర్తికానున్నయి. నాటి ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో కొందరు నేడు వికలాంగులుగా మారారు. మతిస్థిమితం కోల్పోయిన వారూ ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మృత్యువాత పడిన రైతులకు మరింత సాయం అందిస్తామంటూనే.. క్షతగాత్రులకు పూర్తిగా ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇప్పటికీ ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం భరించలేదు. ఉన్న ఆస్తులు అమ్మి నేటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నెలకు రూ.వేలల్లో మందులు కొని అప్పుల పాలవుతున్నారు. బాధితులకు ప్రభుత్వ సహకారం సరిగా లేదంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మండిపడింది. తాము అధికారంలోకి వస్తే బాధితులకు అన్ని విధాల న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వీళ్లు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా బాధితులను పట్టంచుకోలేదు. ఆస్పత్రి ఖర్చులకు అప్పులపాలైన తమను ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 


అమరులకు స్మారక స్థూపం

మృతి చెందిన రైతులకు గుర్తుగా మునగలపాళెం గ్రామ సమీపాన.. అమరవీరుల స్థూపాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల నుంచి స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తున్నారు. దుర్ఘటన జరిగిన రోజున పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఇలా బుధవారం కూడా సుమారు వెయ్యిమందికి అన్నదానం చేయనున్నారు. 

నాడు ఏం జరిగిందంటే.. 

స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని అప్పట్లో ఏర్పేడు మండలం మునగలపాళెం రైతులు ఆందోళన చెందారు. జలసంరక్షణ కోసం.. ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలంటూ 2017 ఏప్రిల్‌ 21వ తేదీన ఏర్పేడు పోలీ్‌సస్టేషన్‌ ఎదురుగా నిరసన తెలిపారు. ఆ సమయంలో ఓ లారీ వీరి మీదకు దూసుకు రావడంతో 16మంది మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement