నాలుగు సంపదలు

ABN , First Publish Date - 2021-10-08T05:52:49+05:30 IST

భారత దేశంలో సింధు నాగరికత నాటి నుంచి శ్రమణ సంప్రదాయం ఉంది. శైవం, జైనం, బౌద్ధం ఈ కోవకు చెందినవే. అహింస, విముక్తి, దానం...

నాలుగు సంపదలు

ధర్మపథం

భారత దేశంలో సింధు నాగరికత నాటి నుంచి శ్రమణ సంప్రదాయం ఉంది. శైవం, జైనం, బౌద్ధం ఈ కోవకు చెందినవే. అహింస, విముక్తి, దానం... ఈ సంప్రదాయానికి పునాదులు. దీన్ని పరిపుష్టం చేసి, ధార్మికమార్గంగా మలచి, ప్రపంచ వ్యాప్తం చేసింది బౌద్ధం. శీల గుణాలను పెంపొందించే ధార్మిక మార్గంగా అది విరాజిల్లుతూనే ఉంది.


ధనం సుఖాన్ని ఇస్తుందని అందరూ అనుకుంటారు. కానీ, ధనం సౌకర్యాలను ఇస్తుంది, సుఖాన్ని ఇవ్వదు. ఒక్కొక్కసారి అధిక దుఃఖాన్ని సైతం కలిగిస్తుంది. అలాగే కీర్తి, విద్య కూడా మనిషిలోని గర్వాన్ని పెంచుతాయి. చెడ్డ స్వభావం ఉన్నవారు వాటితో గర్వం చెందితే, మంచి గుణాలు ఉన్నవారు వాటి వల్ల శాంతమూర్తులు అవుతారు. 


బుద్ధుడి కాలంలో ఎందరో విదేశీ వ్యాపారులు (సార్థవాహకులు) ఉండేవారు. వారు అవిశ్రాంతంగా తిరిగి వ్యాపారాలు చేసేవారు. ధనం బాగా సంపాదించేవారు. అలసట వల్ల అనారోగ్యం పాలై మరణించేవారు. ఇంకొందరు తాము సంపాదించిన ధనం వల్ల వ్యసనాలకు అలవాటు పడి, అన్ని రకాలుగానూ పతనమయ్యేవారు. ఇక వారి పిల్లలు దుర్వ్యసనాలకు బానిసలై, ధనాన్ని, కీర్తిని, జీవితాన్ని, తుదకు ప్రాణాలను కోల్పోయేవారు. 


అలా భ్రష్టులైన వాళ్ళలో ఆనాటి మేటి ధనవంతుడు, పెద్ద వ్యాపారి అనాథ పిండికుని కుమారుడు ఒకరు. ప్రతిరోజూ వేల వేల బంగారు నాణేలను విందులు, వినోదాలకు అతను ఖర్చు పెట్టేవాడు. ‘అతణ్ణి ఎలా మార్చాలి?’ అని ఆలోచించిన అనాథ పిండికుడు తన కుమారుడితో... ‘‘నాయనా! నీవు కోరిన దానికన్నా రోజూ ఎక్కువే ఇస్తాను. కానీ నీవు ఒక పని చెయ్యాలి. బుద్ధ భగవానుడు జేత వనంలో ఉంటున్నారు. ఉదయాన్నే నువ్వు వెళ్ళి, ఆయన చెప్పే ధర్మోపదేశం విను. నీవు వచ్చి, ఆయన చెప్పిన దానిలో ఒక్క వాక్యమైనా నాకు చెప్పాలి’’ అని నిబంధన పెట్టాడు. 


అడిగిన దానికన్నా ఎక్కువ ధనం దక్కుతుందన్న ఆలోచనతో అతని కుమారుడు మరుసటి రోజు నుంచీ జేతవనానికి వెళ్ళసాగాడు. రోజూ వెళ్ళి బుద్ధుని ధర్మోపదేశం వినడం వల్ల చివరకు అతను తన తప్పు తెలుసుకున్నాడు. ధర్మం వైపు మళ్ళాడు.


ఒకసారి పరివర్తన గురించి బుద్ధుడు మాట్లాడుతూ ‘‘ధనం సంపాదించడం, కీర్తి పొందడం, చిరకాలం జీవించడం, మరణించాక స్వర్గానికి పోవాలని కోరుకోవడం... ఈ నాలుగే గొప్ప సంపదలుగా భావిస్తారు. కానీ... వీటికన్నా గొప్ప సంపదలు ఉన్నాయి. వాటిలో మొదటిది శ్రద్ధా సంపద. మంచి పనుల మీద మనసు నిలపడం, మంచిని వినడం. చూడడం, ఆచరించడం పట్ల శ్రద్ధ చూపాలి. అంటే ధర్మం మీద శ్రద్ధ చూపాలి. శ్రద్ధా సంపద ఇచ్చే సుఖం ధన సంపద వల్ల రాదు. రెండోది... శీల సంపద. జీవహింసకు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల శీలగుణం వృద్ధి పొందుతుంది. అలాంటి వ్యక్తికి తరిగిపోని కీర్తి లభిస్తుంది. ధనం వల్ల వచ్చే కీర్తి కన్నా... శీలం వల్ల వచ్చే కీర్తి శాశ్వతం. అలాగే... మూడోది త్యాగ సంపద. అంటే ఇవ్వడం వల్ల పొందే ఆనందం, దానం వల్ల కలిగే సుఖం. ఉదారత, వితరణ అనే సుగుణాలు గొప్పవి.


ధనాన్ని పొందినప్పుడు కలిగే ఆనందం కన్నా... ఆ ధనాన్ని దానం చెయ్యడం వల్ల పొందే ఆనందం ఎంతో ఎక్కువ. ఎదుటి వారి బాధలు, కన్నీరు, కష్టాలు తీర్చడానికీ, పది మంది క్షేమానికీ ధనాన్ని సద్వినియోగం చేయడం, దానం ఇవ్వడం వల్ల ఒక వ్యక్తికి కలిగే సంతోషం వెలకట్టలేనిది. కాబట్టి ఇవ్వడం కూడా గొప్ప సంపదే. ఇక నాలుగోది... ప్రజ్ఞా సంపద. మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవడమే ప్రజ్ఞ. తృష్ణలు, అధర్మ కర్మలు, ద్వేషం, సోమరితనం, అవిశ్రాంత కర్మలు, కోపం, అనుమానం... ఇవన్నీ మనో మలినాలే! వీటిని తొలగించుకుంటే మనసు స్వర్గానికి మించిన సుఖాన్ని పొందుతుంది. ఈ సుఖాన్ని కలిగించేదే ప్రజ్ఞా సంపద’’ అన్నాడు. ఈ ప్రబోధం అనాథపిండికుడి మీదా, అతని కుమారుడి మీదా అమితంగా పని చేసింది. ఆ కుమారుణ్ణి ధర్మ మార్గంలో నడిపించింది.

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-10-08T05:52:49+05:30 IST