Viral: నరకయాతనకు ముగింపు.. 10 ఏళ్ల తరువాత నాలుగు పులులకు లభించిన స్వేచ్ఛ..!

ABN , First Publish Date - 2022-03-14T21:47:28+05:30 IST

స్వేచ్ఛగా జీవించడమనేది మనిషి ప్రాథమిక హక్కు మాత్రమే కాదు.. జీవులు అన్నిటికీ ప్రకృతి ప్రసాదించిన హక్కు. కానీ.. తెలివి మీరిపోయిన మనిషి ప్రకృతిపైనే ఆధిపత్యం చెలాయిస్తూ అనేక దారుణాలకి కారణమవుతున్నాడు. ఈ ఒరవడికి బలైపోతోంది..

Viral:  నరకయాతనకు ముగింపు.. 10 ఏళ్ల తరువాత నాలుగు పులులకు లభించిన స్వేచ్ఛ..!

ఇంటర్నెట్ డెస్క్: స్వేచ్ఛగా జీవించడమనేది మనిషి ప్రాథమిక హక్కు మాత్రమే కాదు.. జీవులు అన్నిటికీ ప్రకృతి ప్రసాదించిన హక్కు. కానీ.. తెలివి మీరిపోయిన మనిషి ప్రకృతిపైనే ఆధిపత్యం చెలాయిస్తూ అనేక దారుణాలకి కారణమవుతున్నాడు. ఈ ఒరవడికి బలైపోతోంది మూగజీవాలే. ముఖ్యంగా మనుషుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసుకున్న సర్కస్‌ వంటి వికృత ప్రదర్శనల్లో  మూగ జీవాలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయి బోనుల్లో జీవితాంతం బందీలుగా మిగిలిపోతున్నాయి. ఈ ఒరవడి ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ..అడపాదడపా సర్కస్‌లో ట్రెయినర్ల కారణంగా నరకయాతన అనుభవిస్తున్న మూగజీవాలకు సంబంధించిన కథనాలు బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి దీనిస్థితిలో ఉన్న నాలుగు పులులకు కొందరి మానవత్వం కారణంగా మళ్లీ స్వేచ్ఛ లభించింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అర్జెంటీనాలోని ఓ సర్కస్ కంపెనీ వదిలించుకోవడంతో నాలుగు పులులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆలనాపాలనా చూసేవారులే.. దాదాపు 10 ఏళ్ల పాటు నానా అవస్థలు పడ్డాయి. రైలు బోగీల్లో బందీలుగా కాలం గడిపాయి. అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన అవి..కేవలం 75 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న బోనుల్లో బిక్కు బిక్కు మంటూ బతికాయి. అయితే.. దక్షిణాఫ్రికాలోని ‘ఫర్ పాస్’ స్వచ్ఛంద సంస్థ కలుగు జేసుకోవడంతో వాటికి ఇన్నాళ్లకు సమస్యల నుంచి విముక్తి లభించింది. ఆ సంస్థ ఇటీవలే వాటిని అర్జెంటీనా నుంచి దక్షిణాఫ్రికాలోని తన జంతు సంరక్షణాలయానికి తరలించింది. అక్కడ అధిక వైశాల్యం ఉన్న ఎన్‌క్లోజర్‌లో ఉంచింది. ఆ ఎన్‌క్లోజర్‌లోని వాతావరణం అడవులను పోలి ఉండటంతో ఆ పులులకు ఇన్నాళ్లకు ఓ కొత్త ప్రపంచం పరిచయమయ్యింది. మునుపెన్నడూ ఎరుగని స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను అవి పొందుతున్నాయి. ఈ కొత్త వాతావరణంలో అవి ఒకప్పటి గాయాలను మర్చిపోయిన త్వరగానే కోలుకుంటున్నాయని వాటి సంరక్షకులు చెబుతున్నారు. అవి పరిస్థితులను తట్టుకుని నిలబడగల ఫైటర్లంటూ కితాబిస్తున్నారు. 

Updated Date - 2022-03-14T21:47:28+05:30 IST