జిల్లాకు నాలుగు స్టడీ సర్కిళ్లు!

ABN , First Publish Date - 2022-07-06T08:37:54+05:30 IST

జిల్లాకు నాలుగు చొప్పున రాష్ట్రంలో 132 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

జిల్లాకు నాలుగు స్టడీ సర్కిళ్లు!

  • రాష్ట్రంలో మొత్తం 132 ఏర్పాటు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తలా ఒక్కోటి
  • మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు కూడా
  • అన్ని గురుకులాలు, కస్తూర్బాల్లో ఇంటర్‌ విద్య
  • 15 బీసీ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలూ
  • ఈ ఏడాది నుంచే అమలుకు సీఎం ఆదేశం


హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): జిల్లాకు నాలుగు చొప్పున రాష్ట్రంలో 132 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వీటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్కోటి ఉండాలని నిర్దేశించారు. జిల్లాకు ఒకటిగా మరో 33 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని గురుకులాలు, స్టడీ సర్కిళ్లపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియట్‌ విద్యను బోధించాలని.. దీని అమలులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని సీఎం పేర్కొన్నారు. 


అఖిల భారత సర్వీసులకు అత్యున్నతంగా..

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ తదితర సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలతో పాటు గ్రూప్‌-1 ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ స్టడీ సర్కిల్‌ ఆఫ్‌ తెలంగాణ ేస్టట్‌’ను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను అదేశించారు. మరోవైపు  రాష్ట్ర ప్రభుత్వ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలుగానే కాక.. యువతకు ఉద్యోగ, ఉపాధి అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్లను దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వం అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కేవలం రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాక దేశవ్యాప్తంగా వైమానిక, సైనిక, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో శిక్షణ అందించాలన్నారు. ఈ మేరకు  ఖాళీల భర్తీ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు సమీకరించి అందుకనుగుణంగా శిక్షణ అందించాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఏటా పదో తరగతి ఉత్తీర్ణులెందరు ? అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఉండగా.. మరో 15  కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. 


‘‘రాబోయే విద్యా సంవత్సరంలో మరో 17తో కలిపి.. ఇలా అన్ని జిల్ల్లాలో ఏర్పాటు చేయాలి’’ అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు కేసీఆర్‌ సూచించారు. సంప్రదాయ కోర్సులను కాక ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులు రూపొందించాలని సీఎం తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి విధివిధానాలు రూపొందించాలన్నారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎమ్మెల్సీ ఎస్‌.మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, రోహిత్‌ రెడ్డి, విద్యాసాగర్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొలి ప్రయత్నంలోనే ఐఎ్‌ఫఎ్‌సలో 86వ ర్యాంక్‌ సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థి కాసర్ల రాజు (23)ను సీఎం కేసీఆర్‌ అభినందించారు.  


స్టడీ సర్కిళ్లు ఉపాధి కేంద్రాలు 

 ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో విజయం సాధించిపెట్టే అస్ర్తాలుగా స్టడీ సర్కిళ్లు రూపాంతరం చెందాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్‌ ఎలా ఉండాలో విధి విధానాలను రూపొందించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఫార్మా, కెమికల్‌, డిఫెన్స్‌, రైల్వే, బ్యాంకింగ్‌, నర్సింగ్‌, వ్యవసాయ తదితర కోర్సులు చదివిన తెలంగాణ యువతకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి.ఇందుకు సమర్థులైన అధికారులను నియమించాలి.  కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్‌లో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతిచోట కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. బాలురకు కల్పించినట్టుగానే బాలికలకు కూడా స్టడీ సర్కిళ్లల్లో ప్రత్యేక వసతిని ఏర్పాటు చేయాలి’’ 

-సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ 

Updated Date - 2022-07-06T08:37:54+05:30 IST