నాలుగు ఆదులు కలిసే రోజు.. ఉగాది

ABN , First Publish Date - 2020-03-25T08:33:43+05:30 IST

ప్రకృతి ఆరాధన నేర్చుకొన్న మానవుడు.. ఆ ప్రకృతి మాత ఆశీస్సులు కోరుతూ పంచభూతాలను కొలవడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే...

నాలుగు ఆదులు కలిసే రోజు.. ఉగాది

ప్రకృతి ఆరాధన నేర్చుకొన్న మానవుడు.. ఆ ప్రకృతి మాత ఆశీస్సులు కోరుతూ పంచభూతాలను కొలవడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే.. కాలానుగుణంగా ప్రకృతిలో లభించే వనరులు చేతికందినపుడు జరుపుకొనే వేడుకలే పండుగలయ్యాయి. పండుగల ఆవిర్భావానికి ప్రధాన కారణం.. మానవుడు సంఘజీవి కావడం. ఆ సంఘం సంతోషంగా ఉండాలని.. ఆ సంతోషాలలో తానూ భాగస్వామిని కావాలని కోరుకోవడం. అలా జరుపుకొనే ఒక్కొక్క పండుగకూ ఒక్కొక ఆచారం ఉంటుంది. వాటి వెనుక దైవారాధనతోపాటు అంతర్లీనంగా ఆరోగ్య సంరక్షణ కూడా ఉంటుంది. అలాంటి పండుగల్లో మనకు అత్యంత ముఖ్యమైనది ఉగాది. రుతువుల్లో మొదటిది వసంతం. మాసాల్లో మొదటిది చైత్రం. పక్షాల్లో మొదటిది శుక్లపక్షం. తిథుల్లో మొదటిది పాడ్యమి. మొదలు అంటే ఆది. ఇన్ని ఆదులు కలిసేరోజు ఉగాది. సంవత్సరాది పండుగనాడు ఆచరించవలసిన ముఖ్యమైన మూడు విధులు అభ్యంగన స్నానం, నింబకుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం. వీటిలో మొదటిది తైలాభ్యంగన స్నానం.


అభ్యంగ కార్యేన్నిత్యం సర్వ సంగీషు పుష్టిదం

నిత్యం అభ్యంగన స్నానం వలన శరీరంలోని అన్ని అవయవాలకూ పుష్టి చేకూరుతుందని దీని అర్థం. రోజూ చేయడం అందరికీ కుదరకపోవచ్చు. అందుకని పండుగనాడయినా తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. ఇక.. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం.. అనే రుచులు కలిసిన పచ్చడి.. జీవితం అన్ని రకాల అనుభవాల సమాహారమని, జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్నీ స్వీకరించాలని, సమర్థంగా ఎదుర్కోవాలని తెలియపరుస్తుంది. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి పిందెలు, వేప పువ్వు, ఉప్పు, ప్రాంతాచారాన్ని బట్టి పచ్చి మిరపకాయలు/మిరియాలతో చేసే ఈ పచ్చడి.. మారుతున్న వాతావరణంలో అనేక రోగాల నుంచి కాపాడి శరీరానికి దృఢత్వాన్ని కలిగిస్తుందని నమ్మిక. ఉగాది పచ్చడిని పండుగ రోజు మాత్రమే కాక.. శ్రీరామనవమి దాకా, అంటే తొమ్మిది రోజులపాటు తినాలని, అలా తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. అంతేకాదు.. కఫ, వాత, రక్త దోషాలను ఉగాది పచ్చడి పోగొడుతుంది. ఇక మూడోది పంచాంగ శ్రవణం. సంవత్సర ఫల శ్రవణమే పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరంలో దేశానికి, రాష్ట్రాలకు రాబోయే స్థితిగతులు, జయాపజయాలు, వృద్ధిక్షయాలు, మానవులకు ఆయా నక్షత్రాలను అనుసరించి జరగబోయే పరిణామాలు.. పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తాయి. ఒకప్పుడు పంటలు వేయడానికి, ఏరువాక సాగడానికి కూడా పంచాంగమే రైతులందరికీ మార్గదర్శకంగా ఉండేది. ఇప్పటికీ చాలామంది రైతులు దీన్ని పాటిస్తారు. ఇన్ని విశేషాల సమాహారమైన ఉగాది పండుగను ఈ ఏడాది ఒక మంచి సంకల్పంతో.. అందరికీ మంచి జరగాలని, ప్రకృతి సహకరించాలని, ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న సమస్య శీఘ్రంగా అంతరించాలని కోరుకుంటూ జరుపుకొందాం. ఆ పరమాత్మను అందరం వేడుకొందాం.

- నోముల చంద్రశేఖర్‌, 98666 69859


Updated Date - 2020-03-25T08:33:43+05:30 IST