ONGC Helicopter: అరేబియా సముద్రంలో కూలిన ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్.. నలుగురి మృతి

ABN , First Publish Date - 2022-06-29T02:40:24+05:30 IST

ముంబై అరేబియా సముద్రంలోని సాగర్ కిరణ్ ఓఎన్‌జీసీ రిగ్‌కు సమీపంలో హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో..

ONGC Helicopter: అరేబియా సముద్రంలో కూలిన ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్.. నలుగురి మృతి

ముంబై: ముంబై అరేబియా సముద్రంలోని సాగర్ కిరణ్ ఓఎన్‌జీసీ రిగ్‌కు సమీపంలో హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న 9 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేశారు. అందరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే.. దురదృష్టవశాత్తూ 9 మందిలో నలుగురు తీరానికి చేరుకునే సమయానికి స్పృహలో లేరు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ముగ్గురు ONGC ఉద్యోగులుగా తెలిసింది. ఈ ఘటన పట్ల ఓఎన్‌జీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హెలికాఫ్టర్‌లో ఇద్దరు పైలట్లు, మరో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఈ హెలికాఫ్టర్ (VT-PWI) జుహు నుంచి సాగర్ కిరణ్ రిగ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిని చికిత్స నిమిత్తం ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. ONGC ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది.



ఈ హెలికాఫ్టర్ మంగళవారం ఉదయం 11.45 నిమిషాలకు అరేబియన్ సముద్రంలో ఎమర్జెనీ ల్యాండింగ్‌ చేస్తూ సముద్రంలో మునిగిపోయింది. హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన ఆ ప్రాంతం ONGC offshore rig Sagar Kiranకు సుమారు 1.85 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సైట్‌కు వెళ్లి పరిశీలించారు. కూలిపోయిన ఆ హెలికాఫ్టర్‌ను Sikorsky S-76Dగా గుర్తించారు. పవన్ హాన్స్ ఇటీవల మైల్‌స్టోన్ ఏవియేషన్ గ్రూప్ నుంచి ఆరు Sikorsky S-76D హెలికాఫ్టర్లను లీజుకు తీసుకుంది.

Updated Date - 2022-06-29T02:40:24+05:30 IST