మరో నలుగురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-31T09:58:18+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో శనివారం మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలో ఇద్దరితో

మరో నలుగురికి పాజిటివ్‌

సంగారెడ్డి జిల్లాలో ముగ్గురికి, సద్దిపేట జిల్లాలో ఒకరికి కరోనా నిర్ధారణ


సంగారెడ్డి అర్బన్‌, మే 30 : సంగారెడ్డి జిల్లాలో శనివారం మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలో ఇద్దరితో పాటు జహీరాబాద్‌కు చెందిన మరోకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. జహీరాబాద్‌ మూసానగర్‌లో ఓ వ్యక్తికి శుక్రవారం కరోనా సోకగా ఆయన భార్య(32) శాంపిల్‌ను కోవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీకి పంపగా పాజిటివ్‌గా తేలింది. అలాగే సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్ల్లి హౌసింగ్‌బోర్డు ఫేస్‌-1 కాలనీలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో ఆయన భార్య, ఇద్దరి పిల్లలకి కరోనా పరీక్షలు చేయగా భార్య(35), కూతురు(11)కి కరోనా పాజిటివ్‌ రాగా కుమారుడికి నెగిటివ్‌ వచ్చింది. జహీరాబాద్‌  చెందిన ఆమెను గాంధీకి తరలించగా, సంగారెడ్డిలో పాజిటివ్‌ వచ్చిన ఇద్దరిని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

  

సంగారెడ్డి ఎంసీహెచ్‌లో టెన్షన్‌

సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో(ఎంసీహెచ్‌) కరోనా భయం నెలకొన్నది. ఇక్కడ విధులు నిర్వహించే ఓ ఉద్యోగినికి కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆమె భర్తకు శుక్రవారం కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉద్యోగిని పలుమార్లు ఎంసీహెచ్‌తో పాటు జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి వచ్చి వెళ్లినట్లు పలువురు చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో ఆమెతో ఎవరెవరు కాంటాక్ట్‌ అయ్యారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా కాంటాక్ట్‌ అయిన వారికి పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ ఉద్యోగికి కరోనా సోకడంతో ఎంసీహెచ్‌లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఇలా ఉండగా సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో శుక్రవారం అడ్మిట్‌ చేసిన ఏడుగురిలో ఇద్దరికి పాజిటివ్‌ రాగా ఐదుగురికి నెగటివ్‌ వచ్చినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. 


జహీరాబాద్‌ పట్టణంలో మరింత అప్రమత్తం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని మూసానగర్‌లో ఓ మహిళకు శనివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో పట్టణంలో ఆందోళన నెలకొన్నది. శుక్రవారం కరోనా వచ్చిన వ్యక్తి భార్యకే పాజిటివ్‌గా తేలడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వారితో కాంటాక్ట్‌ అయిన కుటుంబసభ్యులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. వారి ఇంటి చుట్టపక్కల 500 మీటర్లు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మూసానగర్‌ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్‌ అధికారులు రసాయనాలను స్ర్పేచేశారు. పట్టణంలో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


తొగుటలో కరోనా పాజిటివ్‌ కేసు

సిద్దిపేట జిల్లా తొగుటలో ముంబాయి నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో శనివారం తెల్లవారుజామున అతడిని వైద్య సిబ్బంది చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. కాగా తొగుట మండలంలోనే వెంకట్రావుపేట గ్రామంలో ఇదివరకే ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దాంతో ఈ మండలంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తొగుటలో కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సర్పంచ్‌ కొండల్‌రెడ్డి గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడంతో పాటు మందును పిచికారీ చేయించారు. తొగుట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య సర్వే చేపట్టారు. ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.

Updated Date - 2020-05-31T09:58:18+05:30 IST