మరో నలుగురికి వైరస్‌

ABN , First Publish Date - 2020-06-04T09:05:23+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం మరో నలుగురికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

మరో నలుగురికి వైరస్‌

కేజీహెచ్‌ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌

కూర్మన్నపాలెంలో మరో ఇద్దరికి...

ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామానికి చెందిన ఓ మహిళకు వైరస్‌

జిల్లాలో 124కు చేరిన కేసుల సంఖ్య


విశాఖపట్నం/కూర్మన్నపాలెం/ఎస్‌.రాయవరం/మహరాణిపేట, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం మరో నలుగురికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 124కు చేరింది. నగర పరిధిలోని కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు, కేజీహెచ్‌లో పనిచేసే మహిళా ఉద్యోగి, గ్రామీణ జిల్లాలోని ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామానికి చెందిన ఓ మహిళ వైరస్‌ బారినపడినట్టు అధికార యంత్రాంగం వెల్లడించింది. 


కేజీహెచ్‌ ఉద్యోగినికి...

జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన నలభై ఏళ్ల మహిళ కేజీహెచ్‌లో ఎఫ్‌ఎంఎన్‌ఓ (ఆయా)గా పనిచేస్తోంది. రోస్టర్‌ ప్రకారం ట్రామాకేర్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తోంది. ఇంట్లో వున్న ఆమె భర్త కొన్నాళ్లుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనిది సాధారణ జ్వరంగానే ఆమె భావించింది. కానీ ఐదు రోజుల క్రితం ఆమెకు కూడా జ్వరం సోకింది. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతూనే విధులు నిర్వహిస్తోంది. దీన్ని గుర్తించిన తోటి ఉద్యోగులు పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించడంతో టెస్ట్‌ చేయించుకుంది. మంగళవారం సాయంత్రం అందిన నివేదికలో ‘పాజిటివ్‌’ అని తేలింది. వెంటనే ఆమెను కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.


ఆమె విధుల్లో వున్నప్పుడు ఎవరెవరు ఆమెతో కలిసి పనిచేశారని ఆరాతీయడం మొదలుపెట్టారు. మొత్తం 34 మందిగా లెక్క తేలడంతో వీరందరికీ బుధవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అలాగే ట్రామాకేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న నలుగురు రోగులను కూడా ఐసోలేషన్‌ వార్డుకు తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతోనే ఐదు రోజులపాటు ఆమె విధులు నిర్వహించడంతో ఇంకెంత మందికి వైరస్‌ సోకిందో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆమెతో పనిచేసిన స్వీపర్‌లో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో మిగిలిన వారి విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు.  


కూర్మన్నపాలెంలో ఇద్దరికి.. 

నగర పరిధిలోని కూర్మన్నపాలెంలో మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. అశోక్‌నగర్‌ ప్రాంతానికి 32 ఏళ్ల వ్యక్తికి, శాతవాహన నగర్‌కు చెందిన మరో 34 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిద్దరూ...కొద్దిరోజుల కిందట వైరస్‌ బారినపడిన ఫార్మా కంపెనీ ఉద్యోగి కాంటాక్ట్‌ కేసులేనని అధికారులు తెలిపారు. వీరితో సన్నిహితంగా మెలిగిన మరో 77 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. వీరికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. శాతవాహన నగర్‌, అశోక్‌నగర్‌, ఉప్పరవానిపాలెం, కాశీపాలెం, దుగ్గపువానిపాలెం రెడ్‌ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. 


పెనుగొల్లులో అలెర్ట్‌

55 ఏళ్ల మహిళకు కరోనా వైరస్‌ పాజిటివ్‌

కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన పోలీసులు

కాంటాక్టు అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు

ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లులో ఒక మహిళ (55) గత నెలలో విజయవాడలో వుంటున్న తన అల్లుడి ఇంటికి వెళ్లింది. మే 25న అక్కడి నుంచి బస్సులో పెనుగొల్లు చేరుకుంది. వేరే జిల్లా నుంచి  రావడంతో మూడు రోజులపాటు హోం క్వారంటైన్‌లో వుండాలని పోలీసులు, వైద్య సిబ్బంది చెప్పారు. తనకు కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్నాయని 29వ తేదీన వైద్య సిబ్బందికి చెప్పడంతో నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించి థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష చేశారు. అనంతరం స్వాబ్‌ నమూనా తీసి విశాఖపట్నం తరలించారు.


‘నోడిటెక్టివ్‌’ అని నివేదిక రావడంతో, మెరుగైన పరీక్షల కోసం 30న విశాఖలోని ప్రథమ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా బుధవారం రిపోర్ట్‌ వచ్చింది. చెప్పారు. దీంతో ఆమె నివాసం వుంటున్న వీఽధి, పరిసర ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. కాగా పాజిటివ్‌ వచ్చిన మహిళతోపాటు బస్సులో ప్రయాణించిన 12 మందిని, స్థానికంగా ఆమెతో సెకండరీ కాంటాక్ట్‌ వున్న వారిని గుర్తిస్తున్నామని, ఆమె భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులను పరీక్షల కోసం తరలిస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. 

Updated Date - 2020-06-04T09:05:23+05:30 IST