ఎవరా నలుగురు?

ABN , First Publish Date - 2021-09-12T05:27:56+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ రేప్‌ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ నెల 8వ తేదీ రాత్రి గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలడుగు గ్రామశివారులో ఓ మహిళపై నలుగురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే.

ఎవరా నలుగురు?

పోలీసులకు సవాల్‌గా గ్యాంగ్‌ రేప్‌ కేసు 

నాలుగు రోజులైనా కనిపించని పురోగతి 

ఘటనా స్థలంలో నిందితుడి వేలిముద్ర 

సాంకేతికత, పోలీసు జాగిలంపై సన్నగిల్లిన ఆశలు

తప్పుదారి పట్టించేందుకు నిందితుల వ్యూహం

చుట్టుపక్కల ప్రాంతాల వారిపైనే అనుమానాలు 


గుంటూరు, సెప్టెంబరు 11: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ రేప్‌ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ నెల 8వ తేదీ రాత్రి గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలడుగు గ్రామశివారులో ఓ మహిళపై నలుగురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఆమె భర్తను కొట్టి, కట్టేసి అతని ముందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలోనూ సీతానగరం ఘాట్‌ వద్ద ప్రియుడి ఎదుటే యువతిపై ఇద్దరు అగంతకులు అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఆ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులు నిందితులను శేరే కృష్ణ, ప్రసన్నరెడ్డి అలియాస్‌ వెంకట్‌గా గుర్తించారు. అయితే కృష్ణను 2నెలలకు అరెస్టు చేయగా నేటికీ రెండో నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. అలాగే గుంటూరులోని బీటెక్‌ విద్యార్థిని రమ్య, నరసరావుపేటలో అనూష హత్య కేసుల్లో, రాజుపాలెంలో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం కేసుల్లో గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు. అయితే పాలడుగు కేసులో మాత్రం నాలుగు రోజులు గడుస్తున్నా నిందితులు ఎవరనేది గుర్తించలేకపోతున్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న కోల్డ్‌స్టోరేజీలో పని చేస్తున్న ఒడిశా, విజయనగరం ప్రాంతాలకు చెందిన కార్మికులను పోలీసులు తొలుత అనుమానించారు. వారిని అన్ని కోణాల్లో విచారించినా ఏ  ఆధారాలూ లభ్యం కాలేదు. అత్యాచారానికి ఒడిగట్టింది వారు కాదని ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.


ఫోన్‌ కాల్స్‌ జల్లెడ 

సాధారణంగా ఎంతటి కేసుల్లోనైనా సాంకేతికపరమైన ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యేవి. ఘటన జరిగిన సమయంలో సమీపంలోని టవర్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్‌ జాబితాను జల్లెడ పట్టేవారు. పోలీసుల పరిభాషలో దీనిని ఫోన్‌కాల్స్‌ డంప్‌గా అభివర్ణిస్తుంటారు. అయితే ఈ ఘటన రాత్రి సమయంలో జరగడం, అందులోనూ అది గ్రామీణ ప్రాంతానికి సంబంధించినది కావడంతో ఆ సమయంలో స్థానిక సెల్‌టవర్‌కు వందల సంఖ్యలో కాల్స్‌ వచ్చాయి. అందులోని ప్రతి నంబరు వివరాలను నిశితంగా పరిశీలించినా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. పాలడుగుతో పాటు గుంటూరు, సత్తెనపల్లి మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలించినా ఏమాత్రం ఆనవాళ్లు కనిపించలేదు. పాలడుగులో ప్రభుత్వ మద్యం దుకాణం లేదు. ఆ గ్రామంలో రెండు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అందులో ఒకటి పని చేయకపోవడం, పనిచేస్తున్న మరో కెమెరా రోడ్డుపై దృశ్యాలను పూర్తిగా గ్రహించలేకపోవడంతో పోలీసులు ఆ కోణంలో ఆశలు వదులుకున్నారు. గుంటూరు నుంచి వచ్చిన పోలీసు జాగిలం వల్ల కూడా ప్రయోజనం కనిపించలేదు. ఘటనా స్థలంలో నిందితులకు సంబంధించినదిగా అనుమానిస్తున్న  వేలిముద్రను ఫింగర్‌ ఫ్రింట్స్‌ విభాగం గుర్తించింది. దాన్ని పాత నేరస్థుల వేలిముద్రలతో సరి చూసినా మ్యాచ్‌ కాలేదు. ఘటనా స్థలంలో లభించిన చెప్పుల వల్ల కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. మొత్తంమీద ఘటన జరిగినప్పటి నుంచి తొమ్మిది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఒక చిన్న ఆధారం అయినా సేకరించి పెద్ద పెద్ద కేసులను సైతం ఛేదిస్తున్నారు. ఈ కేసులో మాత్రం అటువంటి ఆధారాలూ లభ్యం కాలేదు.


చుట్టుపక్కల ప్రాంతాల వారేనా? 

మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు చాలా తెలివిగా వ్యవహరించినట్టు పోలీసు వర్గాలు అంచనాకు వచ్చాయి. దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించారని అనుమానిస్తున్నారు. బాధితులతో సుమారు రెండు గంటలకు పైగా ఉన్న నిందితులు ఒకటి రెండుసార్లు హిందీలో, ఉర్దూలో మాట్లాడారు. బాధితురాలి ఫోను నుంచి ఓ నంబరుకు డయల్‌ చేశారు. ఆ నంబరు మధ్యప్రదేశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ నంబరుతో వీరికి సంబంధం లేదని, పోలీసులను తప్పుదారి పట్టించటానికే నోటికి వచ్చిన నంబరు డయల్‌ చేసినట్టు అనుమానిస్తున్నారు. అంతేగాక ఆ సమయంలో నిందితులు సత్తెనపల్లి మండల పరిధిలోని అబ్బూరు గ్రామం పేరు ఉచ్ఛరించడం కూడా వ్యూహంలో భాగమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు పాలడుగు, సత్తెనపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన వారై ఉంటారని, ఇతర ప్రాంతాల వారైతే పాలడుగు రోడ్డును ఎంచుకోవటం సాధ్యంకాదని అంటున్నారు. అబ్బూరు పేరును ఉదహరించటాన్ని బట్టి కూడా నిందితులు ఈ పరిసర ప్రాంతాలకు చెందిన వారై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


నలుగురిని విచారించిన పోలీసులు 

క్రోసూరు ప్రాంతానికి చెందిన నలుగురిని పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని గుంటూరుకు తరలించి విచారించగా వారు కాదని తేలడంతో వదిలివేసినట్టు తెలిసింది. అయితే ఘటనా స్థలంలో ద్విచక్ర వాహనాలు కానీ, ఆటోకానీ లేదని, వారు అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో అదృశ్యమయ్యారంటే వారు సమీప ప్రాంతాలకు చెందిన వారై ఉండటం కానీ, ఆ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న వారుకానీ అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారు ద్విచక్ర వాహనాలో, ఆటోనో ఉపయోగించి ఉండవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని ఎక్కడ పార్కు చేశారు, ఏ రూట్‌లో పారిపోయి ఉంటారో ఎటువంటి ఆధారాలు లభించలేదు. దిశ చట్టం పేరుతో నిందితులను గంటల్లోనే అరెస్టు చేశాం, రోజుల వ్యవధిలోనే చార్జిషీటు దాఖలు చేశాం, త్వరిత గతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారులు ఈ గ్యాంగ్‌రేప్‌ విషయంలో మాత్రం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కేసును చేధించేందుకు సీనియర్లను, అనుభవజ్ఞులను రంగంలోకి దించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-12T05:27:56+05:30 IST